రాష్ట్రీయం

అక్రమ నిర్మాణాలకు ఇక అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16:అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అనుమతులు లేకుండా నిర్మించిన ఫ్లాట్లు, ఇళ్లు, అనుమతులు లేని లే అవుట్లలో స్థలాల క్రయవిక్రయాలకు అవకాశం లేని విధంగా రిజిస్ట్రేషన్ల స్థాయిలోనే వాటిని అడ్డుకునేందుకు చట్టం తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు పేక మేడల్లా కుప్పకూలుతున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మున్సిపల్ పట్టణ, నగర ప్రణాళిక విభాగాలు బిల్లు రూపొందించడానికి కసరత్తు చేస్తున్నాయి. వచ్చే నెలలో జరుగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలన్నది ప్రభుత్వ యోచన. అక్రమ నిర్మాణాలను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో నియమించిన ఉప సంఘం నివేదిక సమర్పించింది. ఇళ్లు, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే పట్టణాలలో టౌన్ ప్లానింగ్, నగరాలలో సిటీ ప్లానర్ నుంచి తప్పనిసరిగా అనుమతి పత్రం ఉండాలనే విధంగా చట్టాన్ని రూపొందిస్తున్నారు. ఈ పత్రాలు లేనట్టయితే సదరు ఆస్తులు రిజిస్టర్ కాకుండా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చట్టంలో కూడా సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నోట్ల రద్దు అనంతరం రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దాదాపు మూడోవంతు పడిపోయిన విషయం తెలిసిందే. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఉండాలనే నిబంధన పెడితే మరింత ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉందని రెవిన్యూశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లనే పట్టణ, నగర ప్రణాళిక చట్ట సవరణకు జాప్యం జరిగినట్టు అధికారవర్గాల సమాచారం. ఫిలిమ్ నగర్ క్లబ్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనం, నానక్‌రామ్‌గూడలో అపార్టుమెంట్ కుప్పకూలడం వంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు, లే అవుట్లకు కళ్లెం వేసేందుకు మున్సిపల్ మంత్రి కెటిఆర్ పట్టుదలగా ఉన్నారని అధికార వర్గాల సమాచారం. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా సరే అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని లే అవుట్లకు అడ్డుకట్ట వేయాల్సిందేనని మంత్రి ఆదేశించడంతో బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు పట్టణ ప్రణాళిక విభాగం అధికార వర్గాల సమాచారం.