రాష్ట్రీయం

తెలుగు భాషాభివృద్ధి హామీలు అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: తెలుగు భాషాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకుంటే ఈనెల 21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం రోజు నుంచి ఇంటింటికి వెళ్లి తెలుగు భాషకు ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని వివరిస్తానని నేషనల్ హిందీ అకాడమీ అధ్యక్షుడు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. స్థానిక లోక్‌నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టిడిపి విడుదల చేసిన మానిఫెస్టోలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం లేదని అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు. నాలుగు వేల మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల భాషను దొడ్డి దారిన ప్రవేశపెట్టారని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూచిపూడి, రాజమండ్రి, శ్రీశైలంలో తెలుగు విద్యాలయాలు ఉంటే, హైదరాబాద్, వరంగల్‌లో 16 ఉన్నాయని ఆయన చెప్పారు. మన రాష్ట్రంలో తెలుగు విద్యాలయాల్లో చేరాలకున్న వారికి ఏమేరకు సీట్లు లభిస్తాయని ఆయన ప్రశ్నించారు. ఆయా విద్యాలయాల్లో తెలుగు భాష పండిట్లుగా బయటకు వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు ఉండడం లేదని లక్ష్మీప్రసాద్ అన్నారు. తెలుగు భాష పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన అన్నారు. అందుకే ఈ నెల 21 నుంచి తను ఇంటింటికి వెళ్లి తెలుగు భాషకు ప్రభుత్వం చేస్తున్న వంచన గురించి వివరిస్తానని యార్లగడ్డ చెప్పారు. సమావేశంలో ప్రముఖ రచయిత కెఎస్ చలం మాట్లాడుతూ తెలుగు భాషను ప్రోత్సహిస్తూ, తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించుకోవాలని అన్నారు. రచయిత చందు సుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్ర సంస్కృతి త్రిమూర్తులుగా గుర్తింపు పొందిన గిడుగు, గురజాడ, శ్రీశ్రీ అడుగు జాడల్లో నడుస్తూ, తెలుగు భాషా పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోపోతే, తెలుగు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.