జాతీయ వార్తలు

విశ్వాసంలో విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్రేగిపోయిన డిఎంకె సభ్యులు
స్పీకర్ చొక్కానే చించిన వైనం
స్పీకర్ సీట్లో కూచుని వీరంగం
రెండుసార్లు సభ వాయిదా
డిఎంకె సభ్యులను సస్పెండ్
చేసి విశ్వాస పరీక్ష నిర్వహణ
పక్కా ప్రణాళిక ప్రకారం
స్టాలిన్ బృందం అరాచకం
ఆత్మహత్య చేసుకుంటానని
ఎంకె స్టాలిన్ బెదిరింపు
1989 నాటి
సన్నివేశాలు పునరావృతం

చెన్నై, ఫిబ్రవరి 18: చొక్కాలు చిరిగిపోయాయి. మైకులు విరిగిపోయాయి..కుర్చీలు పైపైకి ఎగిరిపడ్డాయి. కనపడ్డ వాళ్లను కనపడ్డట్టు తోసేశారు. టేబుళ్లపైకెక్కి వీరంగం చేశారు. పెద్ద పెట్టున అరుపులు, కేకలు, నినాదాలు.. తాము ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులమన్న ఇంగితం ఎవరికీ లేదు. కనీసం సభాధ్యక్షుడికి ఇవ్వాల్సిన మర్యాదా ఇవ్వలేదు. ఆయన కుర్చీలోనే దర్జాగా కూర్చొని నినాదాలు చేశారు. నిరసనలు తెలిపారు. తమిళనాడు శాసనసభలో శనివారం నాటి దృశ్యాలివి. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళని స్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా తమిళనాడు శాసనసభ యుద్ధ్భూమిగా మారింది. విశ్వాసపరీక్షకు సంబంధించి రెండు రోజులుగా రోజుకో వైఖరి ప్రకటిస్తూ వచ్చిన ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించిన వెంటనే పోతురాజుల్లా మారిపోయారు. పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు. స్పీకర్ ధనపాల్‌కు సభను నిర్వహించటమే కష్టంగా మారిపోయింది. మార్షల్స్ సాయంతో డిఎంకె సభ్యులను బయటకు పంపించి మరీ విశ్వాస పరీక్షను నిర్వహించాల్సి వచ్చింది. ఈ పరీక్షలో 122-11 ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి పళనిస్వామి విజయం సాధించినట్లు స్పీకర్ ప్రకటించారు.
రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి బల నిరూపణ చేసుకునేందుకు పదిహేను రోజులు సమయం ఇచ్చినప్పటికీ 48గంటల వ్యవధిలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. 234మంది సభ్యులున్న తమిళనాడు శాసనసభలో 123మంది కొద్ది రోజులుగా చెన్నై శివార్లలోని గోల్డెన్‌బే రిసార్ట్స్‌లో శశికళ ఏర్పాటు చేసిన క్యాంప్‌లో ఉన్నారు. పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంవైపు వచ్చారు. విశ్వాస పరీక్షకు కొద్ది గంటలకు ముందు కోయంబత్తూరు ఎమ్మెల్యే అరుణ్‌కుమార్ తాను అసెంబ్లీకి హాజరు కావటం లేదని ప్రకటించటంతో పళనిస్వామి వర్గం కొంత ఆందోళన చెందింది. శాసనసభకు చేరుకున్నాక మరికొందరు తమ వైపు వచ్చేస్తారని పన్నీర్ వర్గం భావించింది. కానీ, ఆ తరువాత ఒక్క ఎమ్మెల్యే కూడా పన్నీర్ క్యాంప్ వైపు తొంగిచూడనైనా లేదు.
ఉదయం 10గంటల ప్రాంతంలో గోల్డెన్‌బే రిసార్ట్స్ నుంచి సుమారు 35 వాహనాల్లో అన్నాడి ఎంకె శాసనసభ్యులంతా అసెంబ్లీకి చేరుకున్నారు. అంతకుముందే డిఎంకెకు చెందిన 88మంది శాసనసభకు వచ్చారు. పార్టీ అధినేత ఎం.కరుణానిధి అనారోగ్యం కారణంగా సభకు రాలేదు. ఆ తరువాత పన్నీర్ సెల్వం, ఆయనకు మద్దతునిస్తున్న 11మంది ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. 11గంటలకు సభ ప్రారంభం కాగానే రహస్య ఓటింగ్ జరిపించాలని ప్రతిపక్ష నేత స్టాలిన్ స్పీకర్‌ను డిమాండ్ చేశారు. దీనికి పన్నీర్ వర్గంతో సహా మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా మద్దతు పలికాయి. కానీ, వారి డిమాండ్‌ను స్పీకర్ ధనపాల్ తోసిపుచ్చారు. ‘సభను ఏ విధంగా నిర్వహించాలో, ఓటింగ్ ఏ రకంగా జరపాలో నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇంతకాలం శాసనసభ్యులను రిసార్ట్స్‌లో బంధించారని, వారిని సొంత నియోజక వర్గాలకు పంపించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నాక విశ్వాస పరీక్షను నిర్వహించాలని పన్నీర్ సెల్వం స్పీకర్‌ను డిమాండ్ చేశారు. కానీ ఆ డిమాండ్‌ను కూడా స్పీకర్ ధనపాల్ తిరస్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై రహస్య ఓటింగ్ కాకుండా డివిజన్ ఓటింగ్ జరపాలని స్పీకర్ నిర్ణయించారు. పళనిస్వామికి మద్దతునిచ్చేవారిని, వ్యతిరేకించే వారిని బ్లాకుల వారిగా నిలుచోవాలని ఆదేశించారు. వారిని లెక్కించటం మొదలుపెట్టారు. ఒక బ్లాక్ లెక్కించేసరికి డిఎంకె సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ లెక్కింపును అడ్డుకున్నారు. ఒక మహిళా ఎమ్మెల్యే టేబుల్ పైకి ఎక్కి నిలుచుని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. అంతకుముందే ఆయన సభాసమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. లోపల ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియకుండా చాలాసేపు ఉత్కంఠ నెలకొంది.
మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశమైనప్పుడు పరిస్థితి మరింత ముదిరింది. డిఎంకె సభ్యులు స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయన ముందున్న మైక్‌ను లాగిపారేశారు. చొక్కా చించేశారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ డిఎంకె సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్షల్స్‌ను పిలిపించి వారిని బయటకు పంపాలని ఆదేశించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత స్టాలిన్ మరింత తీవ్రంగా స్పందించారు. తనను సభనుంచి బయటకు పంపించాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. కానీ, స్పీకర్ సభను మధ్యాహ్నం మూడు గంటల దాకా వాయిదా వేసి, ఆ వ్యవధిలో డిఎంకె సభ్యులను బయటకు పంపించాలని మార్షల్స్‌ను ఆదేశించారు. సభ రెండోసారి వాయిదా పడిన అనంతరం మార్షల్స్ రంగప్రవేశం చేసి డిఎంకె సభ్యులను బలవంతంగా ఖాళీ చేయించారు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడు సభలో పళని, పన్నీర్ వర్గం సభ్యులు మాత్రమే మిగిలారు. ఒకరిద్దరు సభ్యులున్న పార్టీలు వాకౌట్ చేశాయి. దీంతో పళని విజయం ఖరారైంది. మూజువాణి ఓటుతో ముఖ్యమంత్రి పళనిస్వామి విజయం సాధించినట్లు స్పీకర్ ప్రకటించారు. 122మంది సభ్యుల మెజార్టీతో ఆయన గెలిచారని స్పీకర్ తెలిపారు. ఒకవేళ డిఎంకెతోపాటు ఇతర విపక్ష సభ్యులు సభలో ఉండి ఓటేసినప్పటికీ వారి సంఖ్య 98మాత్రమేనని, వాటికి 11మంది పన్నీర్ వర్గాన్ని కలుపుకున్నా మెజార్టీ పళనిస్వామిదేనని స్పీకర్ తేల్చి చెప్పారు.
1988లోనూ ఇదే పరిస్థితి..
తమిళనాడు శాసనసభలో ఈ రకమైన రాజకీయ అరాచక పరిస్థితి కొత్తేమీ కాదు. 1988లో ఎంజి రామచంద్రన్ మరణానంతరం ఇదే అన్నాడిఎంకె లో ఎంజిఆర్ సతీమణి జానకి రామచంద్రన్, జయలలితల మధ్య పార్టీ చీలిపోయింది. 1988 జనవరి 28న జరిగిన జానకి విశ్వాస పరీక్ష సందర్భంగా కూడా అనూహ్యమైన స్థాయిలో శాసనసభ హింసాత్మక ఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది. సరిగ్గా మూడు దశాబ్దాల తరువాత మళ్లీ అదే సీన్ అదే అసెంబ్లీలో, అదే అన్నాడిఎంకె పార్టీ చీలికల నేపథ్యంలో రిపీట్ అయింది.

అమ్మ (జయలలిత) సమాధి సాక్షిగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి వికె శశికళ చేసిన శపథం నెరవేరింది. తమిళనాడులో అమ్మ ప్రభుత్వమే కొనసాగుతోంది.
ఆమె ఆశయాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్లడమే ధ్యేయం. పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గడం చట్టబద్ధమైందా కాదా? అన్నది తమిళనాడు ప్రజలే నిర్ణయిస్తారు. మా అధినేత్రి దివంగత జయలలిత ప్రభుత్వాన్ని పున:ప్రతిష్ఠించేంత వరకూ విశ్రమించేది లేదు.

చిత్రం... తమిళనాడు అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య యుద్ధ సన్నివేశం