రాష్ట్రీయం

హైదరాబాద్‌కు విశిష్ట భాషా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: మైసూరులోని తెలుగు భాషల కేంద్ర సంస్థ -సిల్‌లో ఉన్న తెలుగు విశిష్ట భాషా కేంద్రాన్ని హైదరాబాద్‌కు తరలించాలని మంగళవారం నాడిక్కడ జరిగిన మేధామథన సదస్సు తీర్మానించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాంస్కృతిక శాఖ, ప్రెస్ అకాడమి, అధికార భాషా సంఘం, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ, తెలుగు అకాడమి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని టూరిజం ప్లాజాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల సంపాదకులు హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన మేధామథనం అనంతరం సమావేశం మూడు తీర్మానాలు ఏకగ్రీవంగా చేసింది. తెలుగు విశిష్ట భాషా కేంద్రాన్ని హైదరాబాద్‌కు తరలించాలని, అమ్మ భాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని, ఆంగ్ల మాధ్యమం స్కూళ్లలోనూ తెలుగు భాషను నేర్చుకునేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ తీర్మానాలను చేశారు. కార్యక్రమంలో తొలుత విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ స్వాగతం పలుకుతూ తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన తీరు, ఎదురైన సమస్యలు, న్యాయవివాదాలు, ప్రస్తుత స్థితిని వివరించారు. పది రోజుల క్రితం హైదరాబాద్‌లో కోర్ కమిటీ సమావేశం జరిగిందని, ఆర్ట్ గ్యాలరీలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు, బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆధీనంలోని వంద ఎకరాల్లో ఐదు ఎకరాల భూమిని పీఠానికి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు.
నిలుస్తుంది, గెలుస్తుంది: మామిడి హరికృష్ణ
సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగు విశిష్ట భాష హోదా దక్కడం ఒక సినిమాలా కొనసాగిందని, మైసూర్ సిల్‌లో కొనసాగుతున్న సంస్థను హైదరాబాద్ తరలించాల్సిందేనని చెప్పారు. దీనివల్ల తెలుగు భాషలో పెద్ద ఎత్తున పరిశోధనలకు, డాక్యుమెంటేషన్‌కు, డీ కోడింగ్‌కు, లిపి పరిణామాన్ని రికార్డు చేసేందుకు దోహదం చేస్తుందని, ఈ పీఠం పేరిట ఒక ప్రభుత్వ యంత్రాంగం ఏర్పడుతుందని చెప్పారు. సంస్థ తరఫున సదస్సులు, చర్చలు చేపట్టవచ్చని, భాషకు సంబంధించి మార్కెటింగ్ జరుగుతుందని అన్నారు. ప్రపంచంలో ప్రతి రెండు వారాలకు ఒక భాష నశించిపోతోందని, తెలుగు భాష మాత్రం ఖచ్చితంగా నిలుస్తుంది, గెలుస్తుంది, ఖండాంతరాలకు విస్తరిస్తుందని అన్నారు.
అంత దాతృత్వం ఉందా: కె శ్రీనివాస్
విశిష్ట భాషా కేంద్రం కోసం తమిళనాడులో కరుణానిధి కుటుంబం కోట్లాది రూపాయల విలువైన భవనాన్ని ఇచ్చేశారని, అలాంటి దాతృత్వం ఇక్కడ ఉందా అని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రాచీన భాషతో పాటు ఆధునిక భాష అవసరాలను గుర్తించాలని సూచించారు. కేంద్రం ఇచ్చే వంద కోట్ల పోరుకంటే, అస్థిత్వం, ఆత్మాభిమానానికి సంబంధించిన అంశంగా విశిష్ట్భాషా కేంద్రాన్ని చూడాలని పేర్కొన్నారు. తెలుగును ఏయే దశల్లో ఎలా వినియోగించుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలని అన్నారు.
తెలంగాణ టు డే ఎడిటర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్థలం, భవనం కేటాయించడం ప్రభుత్వానికి సమస్య కాబోదని, పోటీతత్వం లేకుండా చూసుకోవాలని హితవు పలికారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే: ఎంవిఆర్ శాస్ర్తీ
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లోనే తెలుగు భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. విశిష్ట్భాషా కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఉండి ఉంటే ఇంత వరకూ అవి అమలుచేయడానికి ఎలాంటి ఆటంకం లేదని అన్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఎవరికీ పట్టలేదని పేర్కొన్నారు. ఆధిపత్య పోరుతో దెబ్బతిన్నామని, కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై వివాదం అనవసరమని చెప్పారు. హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేసి చేయాల్సింది చాలా ఉందని అన్నారు. ఆధునిక భాషను రక్షించుకోలేకపోతే మన దేశంలోనే మనం పరాయివాళ్లం అయిపోతామని చెప్పారు. ఉద్యోగాలకు డిమాండ్ లేకనే తెలుగు చదవడం లేదని, అధికార భాషగా, శాసనభాషగా తెలుగును అమలు చేస్తే ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని పేర్కొన్నారు.
ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలుగు విశిష్ట భాషా కేంద్రాన్ని హైదరాబాద్‌కు తరలించాల్సిందేనని అన్నారు.
ప్రాంతీయ భాషలను ప్రధాన భాష కలుపుకుంటూ పోవాలని, తెలంగాణలో వాడుకలో ఉన్న లక్ష పదాలతో ఒక పుస్తకాన్ని తేవాలని యోచిస్తున్నట్టు తెలిపారు. నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఏ దేశం ఇంగ్లీషు ప్రావీణ్యంతో అభివృద్ధి సాధించలేదని, తెలంగాణ చరిత్రకు సంబంధించి లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని అన్నారు. భాషా కేంద్రంపై పూర్తి హక్కు మనకు ఉందని చెప్పారు. నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య మాట్లాడుతూ ప్రజల జీవన విధానం, ప్రభుత్వ విధానాలతో భాష ముడిపడి ఉందని అన్నారు. ప్రజల అవసరాలకు, జీవితానికి భాష ఉపయోగపడాలని చెప్పారు. భాషా కేంద్రంపై వివాదం మంచిది కాదని, ప్రభుత్వానికి భాష పట్ల చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, వి6 బుచ్చయ్య, 10టివి పి శ్రీ్ధర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ శ్రీ్ధర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్, డిప్యూటీ రిజిస్ట్రార్ రామ్మూర్తి, కె సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మంగళవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల సంపాదకులు