తెలంగాణ

నిరసన ర్యాలీ భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నిరుద్యోగుల నిరసన ర్యాలీని పోలీసులు వ్యూహాత్మకంగా భగ్నం చేశారు. టిజెఎసి చైర్మన్ ఎం కోదండరామ్‌ను తెల్లవారజాము 3.30 గంటల సమయంలో తార్నాకలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. తొలుత ఆయన తలుపులు తీయకపోవడంతో పోలీసులు గునపాలతో బద్ధలుకొట్టారు. ఈ సందర్భంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి బయలుదేరిన నిరుద్యోగులను, విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. తప్పించుకుని హైదరాబాద్ దారిపట్టినా, జాతీయ రహదారుల్లోనూ తనిఖీలు నిర్వహించి అరెస్టులు చేశారు. అయినా ఏదోరకంగా నగరంలోకి ప్రవేశించిన వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో యుద్ధవాతావరణం నెలకొంది. సుమారు వెయ్యిమందిని అరెస్టు చేసినట్టు సమాచారం. నగరంలో 447మందిని, రాచకొండ కమిషనరేట్ పరిథిలో 258మందిని అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు. ఇందిరా పార్కు వద్దకు ఏ ఒక్కరూ వెళ్ళకుండా ముళ్ళకంచెతో పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఐదుగురు ఏసీపీలు, 20మంది సిఐలు సహా సుమారు 500మంది పోలీసులు భద్రతా వలయంగా నిలబడ్డారు.
కోదండరామ్ ఎక్కడ?
అరెస్టు చేసిన ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎక్కడికి తీసుకెళ్ళారో చాలాసేపటి వరకు అంతుచిక్కలేదు. దీంతో టిజెఎసి నేతలు ఆందోళన చెందారు. చివరకు పాత నగరంలోని కామాటిపురా పోలీసు స్టేషన్లో ఉన్నట్టు తెలిసింది. అక్కడికి మీడియావెళ్ళగా లోపల లేరని చెబుతూనే, లోపలికి వెళ్లేందుకు మీడియానూ పోలీసులు అనుమతించలేదు. ప్రొఫెసర్ కోదండరామ్‌ను, మరో నేత రఘును కామాటిపురా పోలీసు స్టేషన్లో ఉంచగా, టిజెఎసి వైస్ ఛైర్మన్ ప్రహ్లాద్ సహా మరో 28మందిని కంఛన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించి సాయంత్రం విడుదల చేశారు. కేవలం ముందు జాగ్రత్తగానే వీరిని అరెస్టు చేశామని డిసిపి రవీంద్ర వెల్లడించారు. ప్రొఫెసర్ కోదండరామ్‌ను పలకరించేందుకు వెళ్ళిన అంజన్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అక్కడి నుంచి పంపించారు.
ఉస్మానియా వర్సిటీలో రెండున్నరేళ్ల తర్వాత ఉద్రిక్త వాతావరణం కనిపించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నిత్యం ఉస్మానియా భగ్గుమనేది. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్టుతో మళ్లీ విద్యార్థులు రెచ్చిపోయారు. నిరుద్యోగ ర్యాలీ కోసం రోడ్లపైకి వచ్చారు. వర్సిటీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ప్రధాన గేటు (ఎన్‌సిసి) వరకూ రానీయకుండా అడ్డుకున్నారు. మరోవైపు నుంచి మరో ర్యాలీ రావడం, పోలీసులపై కొంతమంది యువకులు ఆవేశంగా రాళ్ళు విసిరినా, వారు సంయమనం పాటిస్తూ బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. రోజంతా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఒకదశలో ఆర్ట్స్ కళాశాల భవనంపైకి చేరుకున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉద్రిక్తత మరింత తీవ్రమైంది. పోలీసులు చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు నిర్వహించాలని టిజెఎసి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందిరా పార్కు చుట్టూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేయగలిగారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బాగ్‌లింగంపల్లి క్వార్టర్లు, ఎస్‌వికె కేంద్రం ఉండడం వల్ల జన సంచారం ఉంది. దీంతో రోజంతా దశలవారీగా విద్యార్థులు ఆ జనం మధ్యలో నుంచి, ఎస్‌వికె నుంచి రావడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. అరెస్టులు చేయలేక బేజారయ్యారు. చిన్న లేన్ల నుంచి ఒక్కోక్కరూ విడివిడిగా చేరుకుని, ఒకేసారి 20మంది వరకూ గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేసే ప్రయత్నం చేయడం, పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేయడం జరిగింది. ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ఇలా అనేక విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులను, నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని నగర శివారు పోలీసు స్టేషన్లకు పంపించారు. నల్లకుంటలోని న్యూడెమోక్రసీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్భంధం చేశారు.
నిజాం కళాశాల వద్ద..
మరోవైపు నిజాం కళాశాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్నీ పోలీసులు అడ్డుకున్నారు. నిజాం కళాశాల విద్యార్థులు, బషీర్‌బాగ్‌లోని హాస్టల్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగే ప్రమాదం ఉందని ముందుగానే ఊహించిన పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని గేటు దాటి బయటకు రానీయకుండా కట్టుదిట్టం చేశారు. ప్రొఫెసర్ కోదండ రామ్ అరెస్టును నిరసిస్తూ సికింద్రాబాద్ పిజి కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.
ఇరుకైన సందుల్లో ఉన్న కామాటిపురా పోలీసు స్టేషన్‌లో ప్రొఫెసర్ కోదండరామ్ ఉండడంతో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఫొటోగ్రాఫర్లు చేరుకోవడం, పోలీసుల వాహనాలతో ఆ చుట్టు పక్కల సందడిగా మారింది. ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్టును నిరసిస్తూ నినాదాలు చేస్తూ వచ్చిన కొంత మంది న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత కాంఛన్‌బాగ్ పోలీసులు టి.జెఎసి వైస్-చైర్మన్ ప్రహ్లాద్‌ను, మిగతా వారిని విడుదల చేయగా, 6 గంటల తర్వాత కామాటిపురా పోలీసు స్టేషన్ నుంచి ప్రొఫెసర్ కోదండరామ్‌ను విడుదల చేశారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఉస్మానియా వర్సిటీ జెఎసి, పలు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఇలాఉండగా తెల్లవారుజామున 3.30కు కోదండరామ్ నివాసం తలుపులు పోలీసులు బద్దలు కొట్టిన ఫొటోలు సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులో హల్‌ఛల్ చేయడంతో సాయంత్రంలోగా పోలీసులు వాటికి మరమ్మతు చేయించడం గమనార్హం.

చిత్రం... ఉస్మానియాలో అరెస్టులు చేస్తున్న పోలీసులతో పెనుగులాడుతున్న విద్యార్థులు