రాష్ట్రీయం

హల్దేకర్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ జ్యేష్ఠ ప్రచారకుల్లో ఒకరైన రాంభావు హల్దేకర్ (87) గురువారం మధ్యాహ్నం భాగ్యనగర్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ కార్యాలయంలో తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధ వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నారు. హల్దేకర్ కన్నుమూశారన్న వార్తతో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, ఎబివిపి, విహెచ్‌పి, భజరంగ్‌దళ్ నేతలు సంఘ్ కార్యాలయానికి చేరుకుని అశ్రు నివాళి అర్పించారు.
హల్దేకర్ లేరనే వార్త దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం సాయంత్రం సంఘ్ కార్యాలయానికి వచ్చి హల్దేకర్‌కు నివాళి అర్పించారు. హల్దేకర్ మృతి జాతీయవాదులకు తీరని లోటని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు, శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి, జాతీయ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు ప్రకటన విడుదల చేస్తూ సంఘ్ ప్రాంత ప్రచారక్‌గా, విభాగ్ ప్రచారక్‌గా అమూల్యమైన సేవలు అందించారని హల్దేకర్‌కు నివాళి ప్రకటించారు. హల్దేకర్ ఎంతోమంది
సంఘ్ కార్యకర్తలకు స్ఫూర్తి ప్రధాత అని అభివర్ణించారు.
జీవిత విశేషాలు
హల్దేకర్‌గా పరిచయమైన రామచంద్ర సదాశివ హల్దేకర్ 1930 ఫిబ్రవరి 5న మహారాష్ట్ర శంభాజీనగర్ హల్దా గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లో బిఎస్సీ చదువుతున్నపుడే ఆర్‌ఎస్‌ఎస్ పట్ల ఆకర్షితులై చదువును వదిలేసి సంఘ్ ప్రచారక్‌గా మారారు. 1954లో భాగ్యనగర్ ప్రచారక్‌గా, 1959 నుంచి 1962 వరకూ పాలమూరు, మెదక్, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలతో కూడిన విభాగ్ ప్రచారక్‌గా, 1963లో వరంగల్ విభాగ్ ప్రచారక్‌గా, 1969లో మళ్లీ భాగ్యనగర్ విభాగ్ ప్రచారక్‌గా, 1978 నుండి విజయవాడ విభాగ్ ప్రచారక్‌గా, 1980 నుండి ఆంధ్రప్రదేశ్ సహ ప్రాంత ప్రచారక్‌గా , 1989లో ప్రాంత ప్రచారక్‌గా, 1991 నుండి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలతో కలిసి ఉండే ఆగ్నేయ క్షేత్రానికి క్షేత్ర ప్రచారక్‌గా పనిచేశారు. 2003 నుండి దశాబ్దంపైగా దక్షిణ మధ్య క్షేత్రానికి కార్యకారణి సదస్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో ఒరిస్సాలో సంభవించిన తుఫాను, ఉప్పెన అనంతరం చేపట్టిన పునరావాస కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సేవక్ కుటుంబాల్లో విస్తృతంగా వ్యక్తిగతంగా ఆత్మీయ పరిచయం ఏర్పరచుకున్న సంఘ్ ప్రచారక్ హల్దేకర్‌కు ఆంధ్రప్రదేశ్ అన్ని గ్రామాల్లోని కుటుంబాలతో ఆత్మీయ సంబంధాలున్నాయి. తెలుగు లిపిని నేర్చుకుని మరాఠీ నుంచి అనేక రచనలను తెలుగులోకి అనువదించారు. దాండేకర్ మరాఠీ నవల రూపంలో రాసిన హెడ్గేవర్ జీవిత చరిత్రను పెనుతుపానులో దీపస్తంభం పేరుతో తెలుగులోకి అనువదించారు. మృణాళిని జోషి మరాఠీలో రాసిన గురూజీ గోళ్వాల్కర్ జీవితాన్ని ఓం రాష్ట్రీయ స్వాహా పేరుతో తెలుగులో అనువదించారు. శరత్ హేబాల్కర్ మరాఠీలో రాసిన బాలాసాహెబ్ దేవరస్ చరిత్రను 2012లో తెలుగులోకి అనువదించారు. తర్వాత అది హిందీలోకి తర్జుమా అయింది. 2013లో మరో రెండు పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. 2011లో తన సొంత ఊరు హల్దాలో పిత్రార్జితంగా వచ్చిన యావదాస్తిని సంఘానికి ఇచ్చేశారు. గత కొద్ది రోజులుగా శ్వాస కోశ సంబంధ వ్యాధులకు గురై చికిత్స పొందుతున్నారు. నేత్రదానం చేయాలనే వారి కోరిక మేరకు మరణానంతరం వారి కార్నియాను వాసన్ ఐ బ్యాంకుకు అందించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంబర్‌పేట శ్మశానవాటికలో హల్దేకర్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని సంఘ్ నేతలు తెలిపారు.