రాష్ట్రీయం

హర హర మహాదేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో శుక్రవారం అర్ధరాత్రి మల్లికార్జునస్వామికి లింగోద్భవకాల పూజలు కన్నుల పండువగా నిర్వహించారు. లింగరూపంలో మహాశివరాత్రి రోజున పరమశివుడు ఉద్భవించాడు కాబట్టి స్వామివారికి లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సుమారు 3లక్షల మంది భక్తులు శుక్రవారం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర పాతాళగంటలో స్నానాలు ఆచరించి దర్శనం కోసం వేకువజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టింది. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చక వేద పండితులు సంకల్పం పఠించారు. శనివారం జరుగనున్న రథోత్సవానికి ముందుగా శుక్రవారం సాయంత్రం ప్రభోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చక వేద పండితులు ఆలయ రథశాల వద్ద ప్రభను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం క్షేత్ర పురవీధుల్లో ప్రభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇఓ నారాయణ భరత్‌గుప్త దంపతులు, అర్చకులు, శివస్వాములు, భక్తులు పాల్గొన్నారు. 41 రోజులపాటు శివమండల దీక్ష చేపట్టిన శివస్వాములు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల సమక్షంలో మాలను తీసి దీక్ష విరమించారు. వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మహామంగళ హారతులు ఇచ్చిన అనంతరం నందివాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. మహాశివరాత్రి రోజు శ్రీశైలంలో జరిగే మరో అద్భుత కార్యక్రమం పాగాలంకరణ. స్వామి కొలువైన దేవాలయం విమానగోపురం త్రిశూలం, నవ నందులను కలుపుతూ ఏర్పాటుచేసే పాగాలంకరణను వీక్షించేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రకాశం జిల్లా అద్దలాపురానికి చెందిన భక్తుడు వెంకటేశ్వర్లు దిగంబరంగా తెల్లని వస్త్రాన్ని పాగాలా ఆలయ విమానగోపురం త్రిశూలానికి, ఆలయంపైన ఉన్న నవ నందులను కలుపుతూ చుట్టారు. పాగాలంకరణ భాగ్యం తరతరాలుగా వెంకటేశ్వర్లు కుటుంబానికి దక్కుతోంది. మహాశివరాత్రికి మూడు నెలల ముందు నుంచే వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు నియమనిష్టలతో పాగా నేస్తారు. మహాశివరాత్రికి మూడురోజుల ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి పాగాను తలపై పట్టుకుని కాలినడకన వారు శ్రీశైలం చేరుకుంటారు.
శ్రీ కాళహస్తిలో మార్మోగిన శివ నామస్మరణ
శ్రీ కాళహస్తి: హరహర మహాదేవ శంభో శంకర , ఓం నమఃశివయ అనే నామస్మరణలతో శ్రీ కాళహస్తి క్షేత్రం మారుమోగింది. శివ దర్శనంతో భక్తుల హృదయాలు పులకించిపోయాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు వేడుకగా ఆనందంగా జరుపుకున్నారు. దక్షిణ కైలాసమైన శ్రీ కాళహస్తి క్షేత్రంలో తెల్లవారుజామున రెండు గంటల నుంచే భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గంటకు ముందుగానే ఆలయం తలుపులు తెరచి అధికారులు భక్తులను దర్శనానికి అనుమతించారు. అప్పటికే పవిత్ర స్నానాలు చేసిన భక్తులు హర హర మహాదేవ అంటూ ఆది దంపతులను స్మరిస్తూ ఆలయంలోకి అడుగుపెట్టారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తరించారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం, శివాలయానికి వెళ్లడం, శివనామస్మరణ చేయడం ఇవన్నీ కూడా ముక్తికి సోపానాలని భక్తులు నమ్ముతారు. అందు వల్లే తెల్లవారుజామున చలి ఉన్నప్పటికీ స్వర్ణముఖి నదిలో దేవస్థానం ఏర్పాటుచేసిన స్నాన ఘట్టాల్లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు తడి బట్టలతోనే తన్మయత్వం చెందుతూ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. భక్తుల కోసం ఉచిత క్యూలు, టిక్కెట్ల క్యూలు దేవస్థానం ఏర్పాటుచేసింది. క్యూల ద్వారా వెళ్లిన భక్తులు స్వామి, అమ్మవార్లను, పరివారదేవతలను దర్శించి స్మరించుకున్నారు. దేవస్థానం భక్తులకు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేసింది. క్యూలైన్‌లో ఉన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు, భక్తులకు మంచినీళ్లు సరఫరా చేశారు. క్యూలైన్లు సక్రమంగా ఏర్పాటుచేసినా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల భక్తుల మధ్య తోపులాటలు, వాదులాటలు జరిగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ కాళహస్తిలో గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి ఇంద్రవిమానం వాహనంపైన, జ్ఞాన ప్రసూనాంబ సప్పరం వాహనంపైన ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
కిటకిటలాడిన కోటప్పకొండ
నరసరావుపేట: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పరిధిలో వేంచేసి ఉన్న కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం, త్రికూటాద్రి శివనామ స్మరణతో శుక్రవారం మార్మోగాయి. తెల్లవారు జాము నుండే వేలాది మంది భక్తులతో దేవాలయం కిటకిటలాడిపోయింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు భక్తులు కోసం మూడు రకాల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారు. దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త రాజామల్రాజ్ రామకృష్ణ కొండలరావు ఆలయ ఏర్పాట్లను పరిశీలించి, విఐపీలకు స్వాగతం పలికారు. అదే విధంగా కోటప్పకొండ తిరునాళ్ళ రాష్ట్ర పండుగ కావడంతో స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ప్రభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వామివారికి అందచేశారు. ఈ కార్యక్రమంలో కోడెల శివరాం, పూనాటి విజయలక్ష్మీ, పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు కొండ ఎగువ, దిగువ ప్రాంతంలో అన్ని వసతులను ఏర్పాటు చేశారు. స్వామివారి ప్రసాదమైన లడ్డు, అరిసెలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. కొండకు సుమారు 14విద్యుత్ ప్రభలు చేరుకున్నాయి.ప్రభలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.అర్ధరాత్రి 12గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
కృష్ణా నదీలో పవిత్ర స్నానాలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుండే విజయవాడ వద్ద కృష్ణా నదీలో హర హర శంబోశంకర అంటూ దేవాదేవుని స్మరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, నగరానికి చెందిన వారు అధిక సంఖ్యలో దుర్గాఘాట్‌కు చేరుకొని స్నానాలు ఆచరించి, పితృ దేవతలకు పిండప్రదాన క్రతువును నిర్వహించారు. తర్వాత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శివాలయం, పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామివారి దేవస్థానం, ప్రకాశం బ్యారేజీ ఎదుట ఉన్న శ్రీ విజయేశ్వరస్వామివారి దేవస్థానం, తదితర ఆలయాల్లో పరమేశ్వరునికి మహాన్యాస ఏకదశ రుద్రాభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు జరిగాయ.

చిత్రం..శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
శుక్రవారం నిర్వహించిన ప్రభోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు, ఇన్‌సెట్‌లో పాగాలంకరణ