రాష్ట్రీయం

జాతి విద్వేషానికి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: అమెరికాలో జాతి విద్వేషానికి మరో తెలుగువాడు బలయ్యాడు. యుఎస్ నేవీ మాజీ ఉద్యోగి అడమ్ పూరింటన్ జరిపిన కాల్పులకు అమెరికాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న హైదరాబాదీ కూచిబొట్ల శ్రీనివాస్ (32) బలైపోయాడు. అతని స్నేహితుడు వరంగల్‌కు చెందిన అలోక్ మేడసాని గాయపడ్డాడు. గత 10న కాలిఫోర్నియాలోని మిలిపిటాస్‌లో జరిగిన కాల్పుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వంశీరెడ్డి మామిడాల మరణించిన ఘటన మరువకముందే, మరో తెలుగువాడు బలైపోవడంపట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు శ్రీనివాస్ భార్య సునయిన కన్సాస్‌లోనే పని చేస్తుంటే, మేడసాని సతి ఐదు నెలల గర్భవతి అని తెలిసింది. కాల్పులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన అమెరికన్ ఇయాన్ గ్రిల్లట్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం గమనార్హం. కన్సాస్ రాష్ట్రం ఒలాథె పట్టణంలోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్స్‌లో ఘటన జరిగింది. ఘటనపై అటు అమెరికా, ఇటు భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన వారిగా భావించి వీరిపై కాల్పులు జరిపినట్టు హంతకుడు అడమ్ డబ్ల్యు పురింటన్ పేర్కొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదిలావుంటే, ట్రంప్ సర్కారు చర్యలవల్లే దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటూ ఎన్నారైలు ఆరోపిస్తుంటే, జాత్యాహంకారాన్ని సహించేది లేదంటూ భారత్‌లో అమెరికా రాయబారి మేరీ కే కార్లసన్ ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ కాల్పుల ఘటన దిగ్బ్రాంతి కలిగించిందన్నారు. మృతుని కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ఘటనపై భారతీయ రాయబారి నవతేజ్ శర్మతో మాట్లాడామని, రాయబార కార్యాలయ అధికారి ఆర్‌డి జోషిని హ్యూస్టన్ నుంచి కన్సాస్, మరో అధికారి హర్పాల్ సింగ్‌ను డల్లాస్ నుంచి కన్సాస్ పంపుతున్నట్టు సుష్మ పేర్కొన్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని భారత్‌కు తెచ్చేందుకు సహకరిస్తామన్నారు. కాల్పులకు కారకుడైన పురింటన్‌పై కఠిన చర్యలు తప్పవని అమెరికా వెల్లడించింది. శ్రీనివాస్ స్నేహితుల్లో ఒకరైన కవిప్రియ ‘గో ఫండ్ మి’ పేరిట సామాజిక మాధ్యమాల్లో పేజీ క్రియేట్ చేయగా, అమెరికా సమాజం పద్దఎత్తున సానుభూతి ప్రకటించింది. శ్రీనివాస్ కుటుంబానికి బాసటగా పెద్దఎత్తున విరాళాలు వచ్చి పడుతున్నాయి. గంటల వ్యవధిలో రెండు కోట్లకు పైగా విరాళాలను ప్రజలు ప్రకటించారు.
శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ సిఎం చంద్రబాబు, ఎన్నారై వ్యవహారాల మంత్రి పల్లె రఘునాధరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఏపీ ఎన్నారై ప్రతినిధి కోమటి జయరాంతో మాట్లాడి శ్రీనివాస్ మృతదేహం తరలింపునకు సహకరించాలని కోరారు.
కుటుంబాల్లో తీవ్ర విషాదం
జీడిమెట్ల: కన్సాస్ ఘటనతో మృతుడు శ్రీనివాస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని మల్లంపేట్ గ్రామ పరిధి ప్రణీత్ నేచర్ బౌంటీలో ఉంటున్న కూచిభొట్ల మధుసూదన్‌రావు రెండో కుమారుడే శ్రీనివాస్. ఇలాంటి దుర్ఘటన పగవాడికి కూడా ఎదురు కాకూడదంటూ శ్రీనివాస్ కుటుంబం విలవిల్లాడిపోయింది. తమ కుమారుని మృతదేహాన్ని అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పుట్టెడు దుఃఖంతో కుటుంబీకులు కోరారు.
నిలకడగా అల్లోక్ పరిస్థితి
ఎల్‌బినగర్: కాల్పుల్లో గాయపడిన ఎం అల్లోక్‌రెడ్డి (32)కి ప్రాణాపాయం లేదని తండ్రి ఎం జగన్మోన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ ఇందిరానగర్ కాలనీలోని వాసవీ రెసిడెన్స్‌లో ఉంటున్న జగన్మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అలోక్‌రెడ్డి కుటుంబీకులు వరంగల్‌కు చెందినవారు కావడంతో కాల్పుల సమాచారంతో ఓరుగల్లు ఉలిక్కిపడింది. రెండువారాల కిందట వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి కాల్పుల ఘటనలో మరణించిన విషయం తెలిసిందే.

చిత్రం..దుఃఖసాగరంలో మృతుని కుటుంబం. కాల్పుల్లో మృతిచెందిన శ్రీనివాస్