రాష్ట్రీయం

మన పవర్ చూపిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 25: చేనేతకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఐటి మంత్రి కె తారకరామారావు స్పష్టం చేశారు. సిరిసిల్ల పవర్‌లూం అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సౌత్ ఇండియా మిల్లర్ల అసోసియేషన్ (సిమ) అధ్యక్షులు సెంథిల్ కుమార్ శనివారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంలో సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సిరిసిల్ల పవర్‌లూమ్ ఆధునికీకరణ, అభివృద్ధి చర్యలపై సలహాలు ఇచ్చేందుకు సిమ అధ్యక్షులు జిల్లాలో పర్యటిస్తున్నారని అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు, తిరువూరు, ఈరోడ్, సేలంలో పర్యటించి అక్కడి వస్త్ర తయారీపై అధ్యయనం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే అక్కడి వస్త్ర పరిశ్రమ అంచెలంచెలుగా ప్రగతి సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు. రూ.36 వేల కోట్ల వస్త్రోత్పత్తి జరుగుతుందని, పల్లడం గ్రామ పంచాయితీకి అనుబంధ గ్రామమైన తిరువూరు వస్త్ర పరిశ్రమ అభివృద్ధితో అనతికాలంలోనే కార్పొరేషన్ స్థాయికి చేరిందన్నారు. రాష్ట్రంలో 80 వేల పవర్‌లూమ్‌లు ఉండగా, 1300 కోట్ల వస్త్రోత్పత్తి మాత్రమే
జరుగుతుందని మంత్రి అన్నారు. దేశంలోనే ఉత్తమ నాణ్యతగల కాటన్ తెలంగాణలోనే ఉత్పత్తి అవుతోందని, ఏటా 60 లక్షల బేల్ల కాటన్ ఉత్పత్తి అవుతంటే, కేవలం 10 లక్షల బేల్ల కాటన్ మాత్రమే వినియోగమవుతోందన్నారు. మిగతా కాటన్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోందని వివరించారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న కాటన్ ఇక్కడే వినియోగించాలని సిఎం గట్టి పట్టుదలతో ఉన్నారని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో ఇక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో తమిళనాడులో క్షేత్ర పర్యటన ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కాటన్, నైపుణ్యం గల కార్మికులు, ప్రభుత్వ సహకారం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని వస్త్ర పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకోవాలన్నారు. ప్రభుత్వం చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు, ప్రతి సోమవారం చేనేత ధారణకు ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి తెలిపారు. వరంగల్‌లో 1200 ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్ పార్క్ త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారని, కాటన్ నుండి ఫ్యాబ్రిక్ వరకు అన్ని ఒకేచోట ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వరంగల్‌ని సింగిల్ స్టాప్ షాప్‌గా అన్ని రకాల ఉత్పత్తుల కేంద్రంగా తయారు చేయనున్నట్టు చెప్పారు. ఆధునిక సమాజం, ఆధునిక ప్రపంచానికి ఆధునిక ఉత్పత్తులు అందించాలని మంత్రి అన్నారు. సిరిసిల్లలో అప్పెరెల్ పార్క్ రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. మగ్గాల ఆధునీకరణ, ఉత్పత్తుల వైరుధ్యం, పెద్దఎత్తున మహిళల ఉపాధికి అనుబంధంగా గార్మెట్ పరిశ్రమ చేపట్టాలని మంత్రి అన్నారు. అంతర్జాతీయ వినియోగదారులను ఆకర్షించడానికి ఉత్పత్తులను అంతర్జాతీయస్థాయికి చేర్చాలన్నారు. ఇక్కడి టెక్స్‌టైల్ పార్క్‌లోని 210 యూనిట్లలో 110 యూనిట్లు పని చేస్తున్నాయని, మిగతా 65 యూనిట్ల స్థాపనకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పార్క్‌లోని యూనిట్ల వారందరూ ఒక సంఘంగా ఏర్పడి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని, పార్క్ పరిశుభ్రత, వౌలిక అవసరాలపై వారే చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా పార్క్‌కు నీటి సరఫరా విషయమై చర్యలు తీసుకోవాలన్నారు. టెక్స్‌టైల్ ఇనె్వస్టర్ సమ్మిట్‌ను మార్చి మూడో వారంలో హైదరాబాద్‌లో నిర్వహించన్నునట్టు, దీనికి కేంద్ర మంత్రి స్మృతిఇరానీ హాజరవుతారని కెటిఆర్ తెలిపారు. సమావేశంలో పాల్గొన్న సిమ అధ్యక్షుడు సెంథిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంఘం పక్షాన అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. అంతర్జాతీయస్థాయిలో వినియోగదారునికి ఏంకావాలో అవగాహనతో ముందుకు సాగాలని, వినియోగదారులను ఆకర్షిస్తే వారే ముందుకు వస్తారన్నారు. మంచి కాటన్ ఉన్నదని, 33 స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, కాటన్‌ను విడిచిపెట్టి పాలిస్టర్ వైపునకు ఎందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. సమావేశంలో పాల్గొన్న సిమ ఎక్సిక్యూటివ్ సెక్రటరీ సెల్వరార్ మాట్లాడుతూ యూనిట్లను అప్‌గ్రేడ్ చేయాలని, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలన్నారు. జూన్ చివరి వారంలో టెక్స్‌టైల్ ఇండియా ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో సదస్సు నిర్వహిస్తారని, దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారని, తెలంగాణ ఉత్పత్తులు ఆ సదస్సులో ప్రదర్శించాలన్నారు. అంతకుముందు మంత్రి టెక్స్‌టైల్ పార్క్‌లోని యూనిట్లను సందర్శించి, వస్త్ర ఉత్పత్తిని పరిశీలించారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూర్ రవీందర్‌రావు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ సంచాలకురాలు శైలజారామయ్యార్, జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషా, డిఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, చేనేత సహాయ సంచాలకులు అశోక్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..వస్త్ర ఉత్పత్తులను మంత్రి కెటిఆర్‌తో కలిసి పరిశీలిస్తున్న ‘సిమ’ అధ్యక్షుడు సెంథిల్‌కుమార్