రాష్ట్రీయం

బోగస్ మేళా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, ఫిబ్రవరి 26: మరోసారి నిరుద్యోగులు మోసపోయారు. ఉద్యోగాల ఎరవేసి, డబ్బు వసూలు చేసి చివరాఖరున కుచ్చుటోపీ పెట్టే మోసగాళ్లు ఈసారి ఏకంగా జాబ్‌మేళానే తమ మోసాలకు వేదికగా ఎంచుకున్నారు. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన ఈ ‘తంతు’ చివరకు ఉద్రిక్తతకు దారితీసింది. జాబ్ మేళాకు తరలివచ్చిన వేలాది నిరుద్యోగులు మోసం జరిగిందని తెలుసుకుని, కళాశాలను ధ్వంసం చేశారు. ఉప్పల్ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, స్వల్పంగా లాఠీచార్జి జరిపి, వారిని చెదరగొట్టారు. నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పేరున్న సాఫ్ట్‌వేర్ సంస్థల్లో చదువుకు తగ్గ ఉద్యోగవకాశాలు ఉన్నాయని, ఆసక్తి గల వారు లిటిల్ ఫ్లవర్ కళాశాల (ఎల్‌ఎఫ్‌జి)కు ఈ నెల 26న హాజరు కావాలని అద్వితీయ సేవా ఫౌండేషన్ గత పదిహేను రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో జోరుగా ప్రచారం నిర్వహించింది. రిజిస్ట్రేషన్ ఫీజు 200 రూపాయలని షరతు పెట్టింది. ఈ ప్రకటన చూసి తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు ఆరువేల మంది నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో ఫీజు కట్టి, జాబ్ మేళాకు తరలివచ్చారు. మరో 9 వేల మంది ఆదివారం నేరుగా లిటిల్ ఫ్లవర్ కళాశాలకు వచ్చి ఎంట్రీ ఫీజు చెల్లించారు. ఇలా చెల్లించినవారికి
రశీదు ఇవ్వకుండా చేతిపై ముద్ర వేసి సరిపెట్టారు. ఆదివారం ఉదయం ఆరు గంటలనుంచే కళాశాలకు నిరుద్యోగులు వెల్లువలా తరలిరావడం మొదలైంది. ఉప్పల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ఎక్కడ చూసినా రెజ్యూమేలతో, ఫైళ్లతో తిరుగుతున్న నిరుద్యోగులే కనిపించారు. అయితే నిర్వాహకులు ఊదరగొట్టినట్టు ప్రముఖ కంపెనీలేవీ మేళాకు రాలేదు. ఈ విషయాన్ని గమనించిన నిరుద్యోగులు... తప్పుడు ప్రచారంతో తమను మోసం చేశారంటూ ఆవేశంతో ఊగిపోయారు. నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. వారినుంచి తగిన సమాధానం రాకపోవడంతో కళాశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అద్వితీయ సేవా ఫౌండేషన్ నిర్వాహకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, ఉప్పల్ రోడ్డుపై నిరుద్యోగులు రాస్తారోకోకు దిగారు. దీంతో ఐదారు గంటల సేపుఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ దశలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, నిరుద్యోగులపై స్వల్పంగా లాఠీచార్జీ జరిపి, చెదరగొట్టారు. ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. ఆద్వితీయ సేవా ఫౌండేషన్ ఆర్గనైజర్ కుమార్ పరారీలో ఉన్నాడు. పోలీసుల అదుపులో ఉన్న నిర్వాహకులు కేవలం రోజుకు రూ. 300ల వేతనంపై వచ్చిన వారని తెలిసింది. ఈ జాబ్ మేళాతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమను వదిలిపెట్టాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
కాగా కోటి ఆశలతో జాబ్ మేళాకు వచ్చిన అనేకమంది నిరుద్యోగులు కన్నీళ్లతో తిరుగుముఖం పట్టడం కనిపించింది. మంచిర్యాలకు చెందిన ఓ నిరుద్యోగి తన చేతిలోని రెజ్యూమెను విసిరికొట్టి, కంటతడి పెట్టాడు. జాబ్ మేళాకోసమని ఒక రోజు ముందే వచ్చామని, వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చిన తమను ఉద్యోగాల ఆశచూపి మోసం చేసిన బోగస్ సంస్థపై చర్యలు తీసుకోవాలని అతను డిమాండ్ చేశాడు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేటు బోగస్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ అనే బిటెక్ విద్యార్థి కోరాడు.

చిత్రం..ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ కళాశాల వద్ద ఆందోళనకు దిగిన నిరుద్యోగులు. రిజిస్ట్రేషన్ స్లిప్ (ఇన్‌సెట్‌లో)