రాష్ట్రీయం

పద్దులపై స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలపై కొనసాగుతున్న కసరత్తు రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రగతి భవన్‌లో ఆదివారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల మంత్రులతో ముఖ్యమంత్రి కెసిఆర్ కసరత్తు చేశారు. సోమవారం సాయంత్రానికి బడ్జెట్ ప్రతిపాదనల అంచనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఇలా ఉండగా ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులుగా గతంలో బడ్జెట్‌ను ప్రతిపాదించడం అనవాయితీ. అయితే నీతి అయోగ్ సూచనల మేరకు వీటి స్థానంలో ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు అనే రెండు పద్దులు మాత్రమే ఇక నుంచి ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ స్వరూపం మారింది. ప్రగతి పద్దు కింద (అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు), నిర్వహణ పద్దు కింద (ఉద్యోగుల జీత భత్యాలు, ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ వ్యయం, రుణాలపై వడ్డీలు) కేటాయింపులతో రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంటుంది.
వచ్చే బడ్జెట్ దాదాపు రూ. లక్షా 40 వేల కోట్ల మేరకు ఉండవచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్ సంకేతం ఇచ్చారు. ఇది 2016-17 బడ్జెట్ అంచనా కంటే రూ. 10 వేల కోట్లు ఎక్కువ. 2015-16 వార్షిక బడ్జెట్ అంచనా రూ.1,15,689 కోట్లు కాగా 2016-17లో రూ.1,30,416 కోట్లకు ప్రతిపాదించారు. ఈ రెండు వార్షిక బడ్జెట్లలో పెరుగుదల 15 వేల కోట్లు కాగా ఈ ఏడాది నోట్ల రద్దు ప్రభావం వల్ల 10 వేల కోట్ల పెరుగుదలతో ప్రతిపాదించనున్నట్టు సమాచారం.
రూ.1,40,000 కోట్ల బడ్జెట్‌లో ప్రగతి పద్దు సుమారు లక్ష కోట్లు, నిర్వహణ పద్దు రూ.40 వేల కోట్లుగా ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ప్రగతి పద్దు కింద నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్లు, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ సంక్షేమానికి రూ.15 వేల కోట్లు, బిసి సంక్షేమానికి రూ.12 వేల కోట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. రోడ్లు భవనాల శాఖ సుమారు రూ.8500 కోట్లు, వైద్య ఆరోగ్యశాఖ రూ.7000 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రూ.7000 కోట్లు, వ్యవసాయశాఖ రూ.7000 కోట్లు (రూ.4200 కోట్లు పంట రుణాల మాఫీ చివరి వాయిదా), విద్యాశాఖ రూ.9000 కోట్లు, ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.5000 కోట్లు కలిపి లక్ష కోట్లుగా ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. ఇక నిర్వహణ పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలకు గాను ఏటా రూ.7000 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉదయ్ పథకంలో రాష్ట్రం చేరడం వల్ల ట్రాన్స్‌కో, జెన్కో అప్పుల భారం రూ. 8,923 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్లకు కలిపి నెలకు రూ.2500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుంది. వీటితో పాటుగా ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కార్యకలాపాల వ్యయాన్ని కలిపి రూ. 40 వేల నుంచి 45 వేల కోట్లుగా ప్రతిపాదించనున్నట్టు సమాచారం.