రాష్ట్రీయం

10మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 28: మరో మూడు గంటల్లో గమ్యస్థానాలకు వెళ్లాల్సినవారంతా నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన దివాకర్ టావెల్స్ బస్సు గమ్యం చేరకుండానే 10 మంది ప్రయాణికులు ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రుల హాహాకారాలతో నేషనల్ హైవే మార్మోగింది. ప్రభుత్వాసుపత్రిలో భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఇవీ దివాకర్ ట్రావెల్స్ బస్సు మిగిల్చిన విషాద దృశ్యాలు. మంగళవారం తెల్లవారుజాము ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు నందిగామ సమీపంలోని పెనుగంచిప్రోలు వద్ద జాతీయ రహదారిపై రెండు వంతెనల మధ్యకు దూసుకుపోయింది. 40 అడుగుల లోతులోని కాల్వలోకి పడటంతో డ్రైవర్ సహా పదిమంది ప్రయాణికులు మృతి చెందారు. 38మందికి తీవ్ర గాయాలయ్యాయి. వంతెనల మధ్య కాల్వలో కూరుకుపోయిన బస్సులో ఇరుక్కుపోయిన బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు చాలా సమయమే పట్టింది. వోల్వో బస్సు వెనుక ఇన్నోవా వాహనంలో హైదరాబాద్ వెళ్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ప్రమాదాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కొనకంచి, ముండ్లపాడు గ్రామస్థులను సంఘటనా స్థలానికి తీసుకొచ్చి వారి సాయంతో బస్సును పైకి తీశారు. అయితే అప్పటికే 8మంది మృతి చెందగా, బస్సు నుంచి బయటకు రాలేక క్షతగాత్రులు హాహాకారాలు చేస్తున్నారు. వారిని అంబులెన్సుల్లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించగా, నందిగామ ఆస్పత్రిలో పంజాబ్‌కు చెందిన బలదేవ్‌సింగ్, విజయవాడ ఆసుపత్రిలో సూర్యాపేట మండలం నేరేడుచర్లకు చెందిన నలబోలు కృష్ణారెడ్డి చికిత్స పొందతూ మృతి చెందారు.
అంకుముందు తాడిపత్రికి చెందిన డ్రైవర్ ఆదినారాయణ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన పంగా తులశమ్మ (45), హైదరాబాద్‌కు చెందినక కోట మధుసూదన్‌రెడ్డి, విజయవాడకు చెందిన గేక్ బాషా, ఒడిశాకు చెందిన విద్యాపతి (34), కడపకు చెందిన నల్లబోతు శేఖర్‌రెడ్డి, గుంటూరు జిల్లా నాదెండ్లకు చెందిన పట్టంశెట్టి పృధ్వీ, హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఎంపి తాయబ్ అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆంధ్ర ఆసుపత్రి, హెల్ప్ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించారు. అందులో ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో క్షతగాత్రుడు మృతి చెందారు. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం, ఆ సమయంలో మంచు కురుస్తుండటం, డ్రైవర్ నిద్రవంటి కారణాలే ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు. రెండో డ్రైవర్ ఆ సమయానికి లేడని ప్రచారం జరిగినప్పటికీ, అతను కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని అధికారులు చెప్పారు. బస్సు ప్రమాదం తెలిసిన వెంటనే మధ్యాహ్నానికి బాధిత కుటుంబాలు నందిగామ ప్రభుత్వ, విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు.
జగన్‌ను అడ్డుకున్న తెదేపా కార్యకర్తలు
కాగా, ప్రమాద ఘటన తెలిసిన వెంటనే వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హుటాహుటిన నందిగామ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. బాధితులతో మాట్లాడి తానున్నానంటూ భరోసా ఇచ్చారు. అయితే జగన్ ఆసుపత్రిలోకి వెళ్లకుండా స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి అడ్డుకున్నారు. వైకాపా నేతలు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైకాపా నేతలు పార్ధసారథి, సామనేని ఉదయభాను అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ల చేతిలో ఉన్న పోస్టుమార్టమ్ రిపోర్టును జగన్ లాగేసుకోగా, జోక్యం చేసుకన్న కలెక్టర్ బాబు సర్దిచెప్పి జిరాక్సు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే తమ నాయకులను ఆసుపత్రి బయట నిలిపివేయడంపై జగన్ జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులకు జరుగుతున్న చికిత్స, అధికారుల అత్యుత్సాహంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబును వివరాలు అడిగి తీసుకున్నారు. కాగా చంద్రన్నబీమా కింద మృతుల కుటుంబాలకు ఏపీకి చెందిన వారైతే 3 లక్షలు, పక్క రాష్ట్రాల వారికైతే 2 లక్షలు ఇస్తామనడాన్ని ఒప్పుకోమని, యాజమాన్యం నుంచి 20 లక్షలు ఇప్పించాలని, క్షతగాత్రులకు 10 లక్షలు ఇప్పించాలని, అలా చేస్తేనే ప్రైవేట్ ట్రావెల్స్ మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించబోవని జగన్ స్పష్టం చేశారు.
పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
కాగా, ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలు, బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో చంద్రన్నబీమా ఉన్నవారికి 5 లక్షలు, అది వర్తించని వారికి 3 లక్షలు, ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు.

చిత్రాలు..వంతెనల మధ్య ఇరుక్కుపోయన బస్సు, బస్సును, మృతదేహాలను పైకి తీస్తున్న దృశ్యం