రాష్ట్రీయం

బలిపీఠంపై అన్నదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 28:ఎన్ని బోర్లు వేసినా పాతాళగంగమ్మ పైకిరాననడంతో అన్నదాత గుండె పగిలిపోతోంది. పచ్చని పంటలు నిలువునా ఎండిపోతుంటే నిస్సహాయంగా ఏడవడం తప్ప ఆదుకునే ఆపన్నహస్తం కరవైంది. అప్పులవాళ్లు గడపతొక్కడంతో పరువు బజారునపడుతోంది. ఫలితంగా ఇంటిల్లిపాది భారాన్ని భగవంతుడిపై మోపి కరవుకొయ్యకు వేలాడుతున్నాడు రైతన్న. అనంతపురం జిల్లాలోని మరో కరవు కోణం ఇది. జిల్లాలో రైతుల బలవన్మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలోనే జిల్లాలో 237 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అంచనా. ఒక్క 2016లోనే 129మంది బలవన్మరణం పాలైనట్లు అనధికారిక లెక్కలు తేలుస్తున్నాయి. ఈ ఏడాది రెండు నెలల్లోనే 29మంది రైతులు పురుగుల మందు తాగి, ఉరి వేసుకుని ఊపిరి వదిలారు. అయితే అందరి మరణాలూ రికార్డులకు ఎక్కడం లేదు. జిల్లాలోని నంబులపూలకుంట, తనకల్లు, తలుపుల, గాండ్లపెంట, నల్లచెరువు, పెనుకొండ, లేపాక్షి, పరిగి, నార్పల, శింగనమల, ఉరవకొండ మండలాల్లో అధికంగా బలవన్మరణాలు సంభవించాయి.
ఫిబ్రవరి 26, 2017:గోరంట్ల మండలం గుంతపల్లికి చెందిన రైతు మదన్‌మోహన్‌రెడ్డి(42) ఫిబ్రవరి 26వ తేదీ తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు ఎకరాల పొలంలో పంట సాగు కోసం రూ.6 లక్షల అప్పు చేశాడు. తీర్చేదారి తెలియక ప్రాణాలు తీసుకున్నాడు.
ఫిబ్రవరి 20:పామిడి మండలం సొరకాయలపేటకు చెందిన కౌలురైతు కుమ్మర మహేష్(28) ఫిబ్రవరి 20వ తేదీ ఆత్మహత్య చేసుకున్నాడు.
జనవరి 12: రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు (62) జనవరి 12న బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఆయన రెండు బోర్లు వేశాడు. పెట్టుబడులతో కలిపి రూ.5.20 లక్షలైంది. అది తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
అదే రోజు గుమ్మఘట్ట మండలం నేత్రపల్లికి చెందిన రామాంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు. మెట్ట సేద్యంలో నష్టం రావడం, రూ.2 లక్షల అప్పు చెల్లించాల్సి రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జనవరి 9:పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామస్తుడు షౌకత్ (39) జనవరి 9న చనిపోయాడు. ఆయన ఆరు బోర్లు వేశాడు. మొత్తం మూడు లక్షల రూపాయల అప్పు ఉంది.
జనవరి 8:పుట్లూరు మండలం కుమ్మనమల గ్రామస్తుడు అంజి (32) జనవరి 8న ప్రాణాలు వదిలాడు. నాలుగు బోర్లు వేసి, పంట పెట్టుబడులు పెట్టడం వల్ల నాలుగు లక్షల వరకు అప్పయింది. ఆ భారం మోయలేక బలవన్మరణం పాలయ్యాడు.
జనవరి 7:విడపనకల్లు మండలం మలాపురం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి (60) పంట పెట్టుబడులు, మూడు బోర్ల కోసం చేసిన రూ.3.5 లక్షల అప్పు తీర్చలేక 7వ తేదీ బలవంతంగా ఊపిరి తీసుకున్నాడు.
జనవరి 1:కొత్తచెరువు మండలం కేశాపురానికి చెందిన రైతు కురబ నాగేంద్ర (45) నాలుగు బోర్లు వేశాడు. అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.4 లక్షలైంది. అప్పులవాళ్ల వేధింపులు ఎక్కువ కావడంతో జనవరి 1వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఏడాది రైతన్నలు పాల్పడిన బలవన్మరణాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
1600 కోట్ల పరిహారం ఏదీ?
విభజన అనంతరం హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అయితే అందులో సవాలక్ష ఆంక్షలు పెట్టి, ఆఖరుకు అర్హులైన బాధిత కుటుంబాలకు కేవలం రూ.50 వేలు ఇచ్చేలా నిబంధనలు రూపొందించడంపై రైతాంగం ఆక్రోశం వెళ్లగక్కుతోంది. జిల్లాకు ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా సొమ్ము పంపిణీ నేటికీ అతీగతీ లేదు. అలాగే హెక్టారుకు రూ.1500 నష్టపరిహారం ఇస్తామన్న హామీ నెరవేర్చనే లేదు. వాతావరణ బీమాపై రాష్ట్ర ప్రభుత్వం రైతన్నకు ధీమా కల్పించలేకపోయింది.
పెన్షన్లు, ప్రభుత్వ పథకాలకు మోకాలడ్డు
మరోవైపు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లోని బాధిత మహిళలకు పెన్షన్లు ఇవ్వకుండా, ప్రభుత్వ పథకాలను వర్తింపచేయకుండా రాజకీయ పార్టీల పేరుతో జన్మభూమి కమిటీలు ఆటలాడుకుంటున్నాయి. సిఎం, జిల్లా మంత్రులు అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెబుతున్నా, జన్మభూమి కమిటీలు టిడిపికి చెందని వారన్న కారణంగా దరఖాస్తు చేసుకున్నా అధికారులపై ఒత్తిడి తెచ్చి పెన్షన్లు తొలగింపజేస్తుండటం రివాజుగా మారింది.

చిత్రం..అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లాకాలువలో ఎండిపోయిన కర్భూజ పంట