రాష్ట్రీయం

మరో ఏడాది వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 4: ముఖ్యమంత్రిని అనుచిత పదజాలంతో దూషించిన వ్యవహారంలో ఇప్పటికే ఏడాది సస్పెన్షన్‌కు గురైన వైకాపా ఎమ్మెల్యే రోజాపై పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు అంశంలో మరో ఏడాది సస్పెన్షన్ పొడిగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. శనివారం వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభా హక్కుల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూడుసార్లు హాజరు కావాలని ఆదేశించినా పట్టించుకోని రోజా నాలుగోసారి ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై ఇచ్చిన వివరణ తమకు సంతృప్తి కలిగించలేదని, అందువల్ల ఆమెపై మరో ఏడాది సస్పెన్షన్‌ను కొనసాగించాలని స్పీకర్‌కు కమిటీ సిఫార్సు చేసినట్లు
సమాచారం. దీనిని పరిశీలించిన తర్వాత స్పీకర్ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులను ఈనెల 7 సభ ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశంపై నాటి సభలో దురుసుగా ప్రవర్తించిన 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు సభాహక్కుల సంఘం నోటీసులిచ్చింది. కమిటీ ఎదుట హాజరైన ఆ ఎమ్మెల్యేలు తాము కేవలం ప్రత్యేక హోదాపై ప్రజల ఆకాంక్షను సభ దృష్టికి తీసుకురావాలన్న తపనతోనే ఆవిధంగా వ్యవహరించామే తప్ప, వేరే దురుద్దేశం లేదని చెప్పి విచారం వ్యక్తం చేశారు. అయితే వారిలో కొందరి ప్రవర్తన, వివరణ తమకు సంతృప్తి కలిగించలేదని, వారిని కూడా సస్పెండ్ చేయాలని కమిటీ తీర్మానించినట్లు సమాచారం. అయితే, దానిని కూడా సభలో ప్రవేశపెడతారా? లేక మరికొంత సమయం తీసుకుంటారా? అన్నది చూడాలి. 12మందిపై చర్యలు తీసుకోరని తాము భావిస్తున్నామని, తాము హోదా కోసం ఆవిధంగా వ్యవహరించామే తప్ప మరో ఉద్దేశం లేదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అదేవిధంగా రోజాను మరో ఏడాది సస్పెండ్ చేస్తారని తాము భావించడం లేదన్నారు.
2015 డిసెంబర్ నాటి సభలో.. విజయవాడలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసుపై సభలో మాట్లాడిన రోజా ముఖ్యమంత్రి, సభానాయకుడైన చంద్రబాబునాయుడుపై అనుచిత పదజాలం వాడి దూషించినందుకు ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా సభ్యురాలు అనిత కూడా సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కమిటీ ముందు హాజరైన రోజా లేఖ సమర్పించి, క్షమాపణ కోరారు. ఆ తర్వాత అనిత ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన వ్యవహారంలో ఆమెకు తన ప్రవర్తన బాధ కలిగించినట్లయితే విచారం వ్యక్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కమిటీకి చెప్పారు. అయితే, తాజాగా భేటీ అయిన సభా హక్కుల సంఘం.. అనిత విషయంలో రోజా పశ్చాత్తాపం చెందినట్లు కనిపించనందున, మరో ఏడాది సస్పెన్షన్ పొడిగించాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో రోజా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ 2016 డిసెంబర్‌తో ముగిసింది. అయితే, ఆ తర్వాత సభ జరగనందున, రోజా తిరిగి సభకు హాజరయ్యే అవకాశం రాలేదు.
రోజాను అనుమతించే చాన్స్
రోజాను సభకు అనుమతించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెపై ఏడాది సస్పెండ్ చేసి అనవసర ప్రచారం ఇచ్చామన్న భావనతో ఉన్న ప్రభుత్వం, తాజా సమావేశాలకు అనుమతించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే, ఆ తర్వాత అనిత చేసిన ఫిర్యాదును అనుసరించి కమిటీ ఇచ్చిన ఏడాది సస్పెన్షన్ అంశంపై ఏం చేయాలన్న దానిపై సభలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు చెప్పాయి.
మళ్లీ కోర్టుకు రోజా?
ఇదిలాఉండగా తనను మరో ఏడాది సస్పెండ్ చేస్తే తిరిగి కోర్టును ఆశ్రయించేందుకు రోజా సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, అనిత తనపై చేసిన వ్యాఖ్యల అసలు సీడీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని, అదేవిధంగా మీడియాపాయింట్‌లో అనిత తనపై చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దానితోపాటు జాతీయ స్థాయిలోని మహిళానేతలను కలసి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.