ఆంధ్రప్రదేశ్‌

వకుళామాత ఆలయానికి శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 5: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని మాతృమూర్తి కొలువైన పాతకాల్వ గ్రామం ఇకపై వకుళాపురం క్షేత్రంగా భాసిల్లుతూ యావత్ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని, ఇక్కడి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు. తిరుపతి రూరల్ మండలం, పేరూరు బండపై వెలసిన వకుళమాత ఆలయ భూమిపూజ ఆదివారం ఉదయం భక్తుల జయజయధ్వానాల నడుమ ఘనంగా జరిగింది. ముందుగా ఆలయానికి ఈశాన్య దిక్కులో పూజలు నిర్వహించారు. అక్కడనుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, అధికారులు, భక్తులు వెంటరాగా పరిపూర్ణానంద స్వామి పూజా సామగ్రి, సారెను తీసుకుని కొండపై ఉన్న అమ్మవారి ఆలయంలోకి వెళ్లి వకుళమాత చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం కొండ కింద సభ జరుగుతున్న సమయంలో ఆలయ నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని, తమ ఉపాధి పరిస్థితి ఏమిటంటూ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి ప్రజల సంక్షేమ బాధ్యతను తాను తీసుకుంటానని లిఖితపూర్వకంగా ఇచ్చానని, ఆందోళన చెందవద్దని వారిని శాంతపరిచారు. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్‌ఐ సెల్‌ఫోన్ కెమెరాతో గ్రామస్థుల ఆందోళనలను చిత్రీకరించడంపై చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సభనుద్దేశించి ప్రసంగించిన పరిపూర్ణానంద స్వామి పాతకాల్వ గ్రామస్థులపై వరాల జల్లు కురిపించారు. పేరూరు బండపైన వకుళమాత ఆలయం నిర్మాణం వెనుక తమకు ఎలాంటి స్వార్థం లేదన్నారు. ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి తొలిసారిగా వచ్చిన తనను గ్రామస్థులు వ్యతిరేకించి వారి ఆవేదనను వ్యక్తం చేశారని, వారే నేడు ఆలయ నిర్మాణం సిద్ధం కావడంతో రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా రంగవల్లులు వేసి అలంకారాలు చేసి భూమిపూజలో భాగస్వాములు అయ్యారన్నారు. ఇది ఆ భగవంతుని ఆదేశమని అన్నారు. ఆలయ నిర్మాణం జరిగితే తమ పరిస్థితి, తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాతకాల్వ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని అన్నారు. గుడికన్నా ముందు బడి కట్టిస్తానని, గ్రామస్థుల పిల్లలను గొప్ప సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతానని గ్రామస్థుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అలాగే ఆలయం వద్ద ఉన్న కోనేరును పుష్కరిణిగా తీర్చిదిద్దే చర్యలు చేపడతామన్నారు.
తిరుమల కొండపై ఉన్న వేంకటేశ్వరునికి పాతకాల్వనుంచే ధాన్యం, అన్నం పంపించేవారన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడే నిద్రించేవారని, వారికి సైతం స్థానికులే ఆహారం, బస కల్పించేవారని ఇవన్నీ మాటలు కాదని, శాసనాల్లో ఉన్నాయని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. 400ఏళ్ల క్రితం ఈ ఆలయం నుంచి స్వామివారికి నైవేద్యం వెళ్లేదన్నారు. ఆ పరిస్థితి పునరావృతం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి, త్రిదండి అహోబిల జీయర్ స్వామి, ప్రణవానంద తీర్థస్వామి, ప్రణవాత్మకానంద స్వామి, స్వస్వరూపానంద స్వామి, రమ్యయోగిన, షిర్డీ సంస్థాన్ ట్రస్టు, సబిన్ భాగవత్ తాంబే, ఇస్కాన్ ప్రతినిధి లీలాపారాయణ ప్రభు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, జస్టిస్ నరసింహారెడ్డి, టిటిడి పాలకమండలి సభ్యులు, హిందూధర్మ ప్రచార ట్రస్ట్ కార్యదర్శి పివిఆర్‌కె ప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుతదితరులు పాల్గొన్నారు.

చిత్రం... వకుళామాత ఆలయ నిర్మాణానికి
భూమి పూజ చేస్తున్న పరిపూర్ణానంద స్వామి