రాష్ట్రీయం

అటవీ, భూముల లెక్క ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: రాష్ట్రంలో అటవీ, ఖాళీ భూములు ఎంతమేరకు ఉన్నాయో లెక్క తేల్చేందుకు సర్వే చేపట్టాలని, ఆవెంటనే కంప్యూటరీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ‘్భ భారతి’ శాఖకు ఈ పనిని అప్పగించింది.
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) పర్యవేక్షణలో భూ భారతి ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. రాష్ట్రంలోని భూముల వివాదాల పరిష్కారానికే ప్రభుత్వం ఈ సర్వేకు ఉపక్రమించినట్లు సమాచారం. ప్రభుత్వం వద్ద ఇప్పటి వరకు ల్యాండ్ బ్యాంకులో ఉన్న ప్రభుత్వ భూములు ఎంత, ఆక్రమణకు గురైన భూములు ఎంత అనే స్పష్టమైన సమగ్ర సమాచారం లేదు. కేంద్ర డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడ్రనైజేషన్ ప్రొగ్రాం (డిఐఎల్‌ఎంపి) ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ సర్వేకు ఉపక్రమించింది. డిఐఎల్‌ఎంపి 150 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయంగా అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది రైతులకు, నిజమైన అర్హులైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మండల, రెవెన్యూ అధికారులు ఖాళీ భూముల వేట ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో 10,760 గ్రామాలు ఉన్నాయి. అయితే భూములపై సమగ్ర రికార్డులు 400 నుంచి 500 వరకు గ్రామాలకే ఉన్నట్లు అంచనా. ఇంకా 2,000 నుంచి 2,500 గ్రామాలకు సంబంధించిన కీలకమైన రికార్డులు గల్లంతయ్యాయని అధికారులు అనుమానిస్తున్నారు. 90 శాతం వరకు రికార్డులు సక్రమంగా లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యను దిగ్విజయంగా పూర్తి చేస్తే భవిష్యత్తులో భూ వివాదాలు ఉండవు. ఒకవేళ ఉత్పన్నమైనా పరిష్కారానికి ఈ రికార్డులు మార్గం చూపుతాయి.

శాసనసభను తెలుగులోనే నిర్వహించండి

స్పీకర్ కోడెలకు యార్లగడ్డ విజ్ఞప్తి, పంచెకట్టు హుందాగా ఉంటుందని సూచన

న్యూఢిల్లీ, మార్చి 5: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రారంభం అవుతున్న శాసనసభ సమావేశాలను తెలుగులో నిర్వహించటం ద్వారా చరిత్ర సృష్టించాలని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావును కోరారు. లక్ష్మీప్రసాద్ ఈ మేరకు ఆదివారం శివప్రసాదరావుకు ఒక లేఖ రాశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు అమరావతిలోని నూతన భవనంలో ప్రారంభం అవుతున్నాయి. లక్ష్మీప్రసాద్ ఈ సందర్భంగా స్పీకర్ శివప్రసాదరావుకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుకు తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఉఛ్వాస నిశ్వాసాలని, ఆయన స్పూర్తితో రాజకీయాలలోకి వచ్చిన మీరు రామారావుకు నివాళిగా శాసనసభలో అన్ని కార్యక్రమాలను తెలుగులో నిర్వహిస్తే బాగుంటుందని లక్ష్మీప్రసాద్ సూచించారు. శాసనసభ నిర్వహణలో తెలుగు వినియోగానికి సంబంధించిన ప్రస్తుతం వ్యవహరించే తీరు భావితరాలకు దిశా నిర్దేశం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సంవత్సరం గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంలో ప్రకటించిన విధంగా శాసనసభ కార్యక్రమాలన్నింటినీ తెలుగులో నిర్వహించాలని సూచించారు. గత ఏడాది తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర బడ్జెట్‌ను తెలుగులో ప్రవేశపెడితే ఏపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆంగ్లంలో ప్రతిపాదించారని, ఈ విషయంలో సిగ్గుతో తల దించుకోవలసి వచ్చిందని లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆయన శివప్రసాదరావును కోరారు. పార్లమెంటులో తమిళనాడు, కేరళకు చెందిన ఎంపీలు, విదేశాల్లో విద్యనభ్యసించిన చిదంబరం సైతం తమ రాష్ట్రాల సాంసృతిక వేషధారణలోనే వస్తారు. ఇదే విధంగా మన తెలుగు ఎంపీలు కూడా తెలుగు వేషధారణలో వెళితే బాగుంటుందని సూచించారు. దురదృష్టవశాత్తు మన తెలుగు ఎంపీలు ఒక్కరు కూడా పంచెకట్టుతో కనబడరని యార్లగడ్డ వాపోయారు. శాసనసభా పతిగా మీరు సభా స్థానంలో పంచెకట్టు, కండువాతో కూర్చుంటే ఎంతో హుందాగా ఉంటుందని శివప్రసాదరావును కోరారు. తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాశీన వైఖరిని మరోసారి ప్రస్తావిస్తానని ఆయన సూచించారు. కోట్లాది తెలుగు భాషా ప్రేమికుల నమ్మకాన్ని వమ్ము చేయరని విశ్వసిస్తానని ఆయన లేఖలో పేర్కొన్నారు.