రాష్ట్రీయం

దారి తప్పుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 6: అధికార పార్టీ నేతల వ్యవహారం ఆడింది ఆట..పాడింది పాటగా సాగుతోంది. అధికారంలో ఉంటూ వ్యాపారాలు చేసుకునే ఎమ్మెల్యేలు, నేతలు చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని కోట్లు ఆర్జిస్తున్నారు. విశాఖ జిల్లాలో తాజా సంఘటన దీన్ని మరోసారి రుజువు చేసింది. విశాఖ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు మద్యం దుకాణాలు చాలా ఉన్నాయి. వీటిలో చాలావరకూ నేషనల్ హైవే మీదే ఉన్నాయి. హైవేకి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు, బార్లు ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోగా వీటిని తొలగించాలని ఎక్సైజ్ అధికారులు ఆయా మద్యం వ్యాపారులకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలకు చెందిన
దుకాణాలు, బార్లు అధికంగానే పోతున్నాయి. దీంతో బెంబేలెత్తిన నాయకమ్మన్యులంతా ఏకమై నేషనల్ హైవే -16ని హైవేయే కాదనే ప్రయత్నం చేస్తున్నారు. కోల్‌కతా- చెన్నై మధ్య నేషనల్ హైవే-16 విశాఖ నగరంలో నుంచి వెళుతుంది. ఇది ఇప్పటికీ నేషనల్ హైవే అథారిటీ కిందే ఉంది. విశాఖ నగరం మధ్య నుంచి వెళుతున్న హైవేపై గ్రీనరీని గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ నిర్వహిస్తోంది. ఈ రోడ్డుపై వందల సంఖ్యలో మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. ఇవన్నీ హైవేని ఆనుకునే ఉన్నాయి. విశాఖ జిల్లా విషయానికి వస్తే తగరపువలస నుంచి పాయకరావుపేట వరకూ హైవే ఉంటుంది. ఇప్పుడున్న జివిఎంసి పరిధి విశాఖ శివారు మధురవాడ నుంచి కూర్మన్నపాలెం వరకూ ఉంది. అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలను జివిఎంసిలో విలీనం చేశారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ, కోర్టులో కేసు నడుస్తోంది. ఈ రోడ్డు హైవే అథారిటీ పరిధిలోనే ఉందని చెప్పడానికి కూర్మన్నపాలెం దాటిన తరువాత ఎన్‌హెచ్‌ఎఐకి చెందిన టోల్ గేట్ ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. అయితే ఇదంతా హైవే కాదని అధికార పార్టీ నేతలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
అనకాపల్లి బైపాస్ రోడ్డు మీదున్న దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి సిరసపల్లి, కొత్తూరు, లంకెలపాలెం, గాజువాక, ఎన్‌ఏడి, గురుద్వార్, ఇసకతోట ఆపై ప్రాంతమంతా హైవే కాదని అధికార పార్టీ నేతలు చట్టంలోని లొసుగులను పట్టుకుని నిరూపించారు. ఇప్పటి వరకూ జివిఎంసి పరిధిలోకి రాని దాడి ఇనిస్టిట్యూట్ ఆప్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద నుంచి కూర్మన్నపాలెం మధ్యలో ఉన్న హైవే కూడా జివిఎంసి పరిధిలోనిదేనని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. దీంతో ఎక్సైజ్ అధికారులు ఈ హైవేపై మద్యం దుకాణాలు, బార్లకు లైసెన్స్‌లను జూన్ వరకూ పొడిగించినట్టు తెలుస్తోంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అనకాపల్లి పట్టణ నడిబొడ్డునుంచి వచ్చే మార్గాన్ని స్టేట్ హేవేగా ఎక్సైజ్ అధికారులు గుర్తించి, దాన్ని ఆనుకుని 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను, బార్లను తొలగించమని హుకుం జారీ చేశారు. ఇది కొన్ని సంవత్సరాల కిందట స్టేట్ హైవే. ఇప్పుడు ఈ మార్గంలో ఆర్టీసి బస్సులు తప్ప లారీలు, ఇతర భారీ వాహనాలేమీ నడవవు. అసలు సిసలైన హైవేని కాదని, ఎప్పుడో మూసుకుపోయిన స్టేట్ హైవేని ఇప్పుడు గుర్తించి, అక్కడున్న మద్యం దుకాణాలను ఈ నెలాఖరుకు మూసేయమని చెప్పడం వెనుక రాజకీయ జోక్యం అధికంగా ఉన్నట్టు అర్థమవుతోంది. అనకాపల్లి పట్టణంలో దుకాణాలను మూసివేయిస్తున్నప్పుడు, విశాఖ నగర నడిబొడ్డు నుంచి వెళుతున్న హైవేపై దుకాణాలను ఎందుకు తొలగించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఆనందపురం నుంచి అనకాపల్లి వయా పెందుర్తి మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించామనీ, ఇప్పుడున్న నేషనల్ హైవే 16 డి నోటిఫైడ్ కాలేదనీ, ఇంకా ఈ మార్గం అంతా తమ అధీనంలోనే ఉందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీనివాస్ ‘ఆంధ్రభూమి’కి తెలియచేశారు.
అనకాపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై మద్యం దుకాణాలను తొలగించాల్సిన విషయమై ఎక్సైజ్ ఎస్పీ కురేష్‌ను వివరణ కోరగా, జాతీయ రహదారి, స్టేట్ హైవేకి 500 మీటర్ల లోపు ఉన్న సుమారు 130 మద్యం దుకాణాలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. జాతీయ రహదారిని జివిఎంసిలోకి పరిధిలోకి తెచ్చారా? లేదా? అన్న విషయం తనకు తెలియదని అన్నారు.

చిత్రం..విశాఖలోని ఇసుకతోట, మద్దిలపాలెం హైవేని ఆనుకుని ఉన్న మద్యం దుకాణాలు