రాష్ట్రీయం

దోచుకోవడానికే మిషన్ కాకతీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: ప్రజాధనాన్ని దోచుకోవడానికే మిషన్ కాకతీయ చేపట్టారని, ప్రాజెక్టుల డిజైన్లు మార్చారని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పుల తడక, దగా అని కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పాలమూరు- రంగారెడ్డి ఎతపోతల పథకంపై కాంగ్రెస్ సోమవారం నగరంలోని ఒక హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ పాలమూరు- రంగారెడ్డి సాగు నీటి పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి తమకు కావాల్సిన వారికి టెండర్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని, గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. తట్టెడు మట్టి ఎత్తకుండా ప్రాజెక్టు అంచనాలను 50 వేల కోట్లకు పెంచడం భావ్యమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ చేపట్టిందని, అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిందని, మరికొన్ని 90శాతం పూర్తయ్యాయని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నదని ముఖ్యమంత్రితో సహా మంత్రులు, తెరాస నేతలు ఆరోపించడం విస్మయం కలిగిస్తున్నదని అన్నారు. ప్రాజెక్టుల కోసం ఎవరి కాళ్లు పట్టుకునేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కానీ ప్రాజెక్టుల పేరిట దోపిడీ చేయాలనుకుంటే తప్పకుండా అడ్డుకుంటామన్నారు. నవయుగ కంపెనీ అడిగిన పనులు మంజూరు చేయడంపై నిపుణుల కమిటీ అభ్యంతరం చెప్పిందన్నారు. భావి తెలంగాణ ప్రజల భవిష్యత్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ప్రాజెక్టులు కడుతుంటే, తప్పులు జరుగుతుంటే ప్రశ్నించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
భూసేకరణ 2013 చట్టం ప్రకారం చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని హైకోర్టు చివాట్లు పెట్టినా, కోర్టును తప్పుదారి పట్టిస్తున్నదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 60 ఏళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల కోట్ల అప్పులు చేస్తే, ఈ ప్రభుత్వం మూడేళ్ళు నిండకుండానే 60 వేల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నాడు ఖాసిం రజ్వీపై ప్రజలు తిరగబడినట్టే నేడు సిఎం కెసిఆర్‌పై ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు. ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయకుండానే 200 కోట్లు బిల్లులను డ్రా చేశారంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు గుప్పించారు. దోపిడీలో సిఎం, మంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫాంహౌస్‌ను ఎకరాకు 10 లక్షల చొప్పున విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారా? అని రేవంత్ ప్రశ్నించారు.
కోర్టుకు వెళ్లడం తప్పా?
రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పుపై మాజీ మంత్రి డికె అరుణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిపిఆర్ లేదు, పర్యావరణ అనుమతి లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు తాగు నీటి కోసమా? సాగు నీటి కోసమా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. పాలమూరు టెండర్లు పూర్తిగా సాగునీటి కోసమే పిలిచినా, గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఇది కేవలం తాగు నీటి కోసమేనని ప్రభుత్వం పేర్కొందని గుర్తు చేశారు. కమీషన్ల కోసమే రీ డిజైన్ చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని, కోర్టులకు వెళుతున్నారని మంత్రులు, తెరాస నేతలు విమర్శించడాన్ని తప్పుబట్టారు. తప్పులు జరిగితే కోర్టుకు వెళ్లడం తప్పా? అని ప్రశ్నించారు.
జైలుకు వెళ్ళక తప్పదు..
బిజెపి నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టు అవినీతిలో కెసిఆర్ జైలుకెళ్లక తప్పదన్నారు. తన ప్రశ్నలు తప్పని రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, మల్లు రవి, దాసోజు శ్రవణ్, సిపిఐ నాయకుడు రామకృష్ణ, పలువురు నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్లు మాట్లాడారు.

చిత్రం..పాలమూరు -రంగారెడ్డి పథకంపై కాంగ్రెస్ నిర్వహించిన రౌండ్ టేబుల్
సమావేశంలో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి