రాష్ట్రీయం

భగ్గుమన్న మిర్చి రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 7: ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మిర్చి కొనుగోళ్లను నిలిపివేయడంతో సుదూర ప్రాంతాల నుంచి గుంటూరు యార్డ్‌కు సరుకు తీసుకువచ్చిన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లభించక ఆందోళనకు గురవుతుంటే తెచ్చిన సరుకును కూడా కొనుగోలు చేయకపోతే ఎలా అంటూ ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన సుమారు 4 వేల మందికి పైగా రైతులు మిర్చియార్డు ఎదుట ధర్నా నిర్వహించారు. పాలకవర్గం, అధికార యంత్రాంగం దిగివచ్చి రైతులతో సంప్రదింపులు జరిపినా ససేమిరా అంటూ ఏకంగా భీష్మించుకు కూర్చున్నారు. ఈ సమయంలో పలువురు రైతులు మాట్లాడుతూ ఈ-మార్కెట్ విధానాన్ని సాకుగా చూపి వ్యాపారులు అకస్మాత్తుగా మిర్చి కొనుగోళ్లను నిలిపివేయడం దారుణమన్నారు. ఈ విధానం ద్వారా కొనుగోలు చేసిన ప్రతి కిలోకు పన్ను చెల్లించాల్సి వస్తుందన్న ఏకైక కారణంతో రైతులు తెచ్చిన సరుకును కొనుగోలు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. గత ఏడాది క్వింటాలుకు 13 నుంచి 15 వేల రూపాయలు ధర లభించగా ఈ ఏడాది సగానికి సగం పడిపోయిందన్నారు. ఎకరా సాగుకు లక్షా 75 వేల రూపాయల వరకు ఖర్చుకాగా ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న 7 వేల రూపాయల చొప్పున అమ్మితే 70 నుంచి 80 వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్లకు వెళితే కూలీలు, పురుగుమందుల షాపులోళ్లు, కౌలుకు ఇచ్చిన భూమి యజమానులు, అప్పులు ఇచ్చిన వారు వెంటబడి తరుముతున్నారని, కొనుగోళ్ల నిలిపివేతతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటూ ఆందోళన వ్యక్తంచేశారు. తాము తెచ్చిన సరుకును కొనుగోలు చేసే వరకు కదిలేది లేదని స్పష్టంచేశారు. గంటల తరబడి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డిఎస్‌పి శ్రీనివాస్ జోక్యం చేసుకుని పాలకవర్గం, వ్యాపారులతో సంప్రదించి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఎట్టకేలకు అంగీకరింపజేశారు. దీంతో అప్పటికే నీరసించిపోయిన రైతులు తమ సరుకును యార్డులోకి చేర్చేందుకు చమటోడ్చాల్సి వచ్చింది.

చిత్రం..మిర్చి యార్డు ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు