రాష్ట్రీయం

‘రోజా’పై సందిగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 7: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది సస్పెన్షన్ వేటు తప్పదా? శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తోంది. ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరైన రోజా ఇచ్చిన వివరణతో కమిటీ సంతృప్తి చెందక పోవటంతో ఆ కమిటీ చేసిన సిఫార్సులపై మార్చి 13న సభలో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ విధించాలన్న ఆలోచనపై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రోజా సభలో ఉండకూడదని, ఉంటే రోజాను నిలువరించేందుకే ఉన్న సమయమంతా కేటాయించాల్సి వస్తోందన్న భావన నాయకత్వంలో ఉంది. అదీ గాకుండా రోజా ఎక్కువగా సిఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తుండటంతోపాటు, పరుష పదజాలం వాడటాన్ని నాయకత్వం భరించలేకపోతోంది. అందువల్ల మరో ఏడాది సస్పెండ్ చేస్తే సభ ప్రశాంతంగా జరుగుతుందన్న భావనలో ఉన్నట్లు సమాచారం.
అందులో భాగంగా ఈనెల 13న సభలో ఆమె వ్యవహారంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రోజా తన ప్రవర్తనకు కచ్చితంగా క్షమాపణ చెబితేనే ఆమెను సభకు అనుమతించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆమె క్షమాపణలో నిజాయితీ కనిపించాలని, అందులో షరతులు ఉండరాదన్న భావనతో ఉన్నారు. ఇదే విషయాన్ని మంగళవారం మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం రోజా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అందులో షరతులు ఉండరాదని, బుధవారం సభా హక్కుల కమిటీ నివేదిక ఇస్తుందని, దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దీన్నిబట్టి రోజా తప్పనిసరిగా క్షమాపణ చెబితేనే ఆమెను సభకు అనుమతిస్తారన్న విషయం స్పష్టమవుతోంది.
కాగా, ఈసారి రోజా సస్పెన్షన్ విషయంలో అధికారికంగా, ఆమె కోర్టుకు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా, ఆమెపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే అనితతో మాట్లాడిస్తారని చెబుతున్నారు. రోజా తనను దూషించిన వ్యవహారంలో ఆమె క్షమాపణ చెప్పిన వైనంపై సభ సంతృప్తి చెందినా, తాను సంతృప్తి చెందే సమస్య లేదని, తనను అవమానించిన రోజాపై సస్పెన్షన్ వేటు వేయాల్సిందేనని ఆమె పట్టుపట్టే అవకాశం ఉంది. అయితే పలువురు మంత్రులు, సీనియర్లు మాత్రం రోజా వ్యవహారాన్ని ఇంతటితో ముగిస్తే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు.
ఇప్పటికే ఆమెకు విపరీతమైన ప్రచారాన్ని మనమే ఇచ్చామని, మళ్లీ మరో ఏడాది ఆమెకు ఉచిత ప్రచారం ఇచ్చి మనమే ఎదురు అస్త్రాలు అందిస్తున్నామని వాదిస్తున్నారు. ఇప్పటికే ఆమెకు మహిళలల్లో బోలెడంత సానుభూతి తెచ్చిపెట్టామని, అది సరిపోక మళ్లీ మరో ఏడాది సస్పెండ్ చేస్తామా? అని ప్రశ్నిస్తున్నారు. అదీకాకుండా ఆమె వీడియో ఫుటేజీల అంశాన్ని తెరపైకి తీసుకురావడం కూడా ఇబ్బందేనంటున్నారు. స్పీకర్‌కు తెలియకుండా ఎలాంటి డాక్యుమెంటు బయటకు పోయే అవకాశం లేనందున, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆ ఫుటేజీని పార్టీ ఆఫీసు నుంచి విడుదల చేసిన అంశాన్ని కోర్టులో ప్రస్తావిస్తే అసలుకే ఎసరు వస్తుందంటున్నారు. ‘ఆనాటి వీడియో ఫుటేజీని ఇస్తే స్పీకర్ అనుమతితో విడుదల చేయాలి. కానీ ఆయన తనకు సంబంధం లేదని అప్పుడే చెప్పారు. ఆయన కాకపోతే అసెంబ్లీ లైవ్ కవరేజీ కాంట్రాక్టు ఇచ్చిన మీడియా సంస్థ అయినా లీకు చేసి ఉండాలి. ఆ ప్రకారంగా ఆ సంస్థనూ విచారించాలి. ఈ ఇద్దరూ కాకుండా కాల్వకు ఏ విధంగా వీడియో ఫుటేజ్ దొరికిందని ఒకవేళ రోజా కోర్టును ఆశ్రయిస్తే మాకే ఇబ్బంది.’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
క్షమాపణ చెప్పే ప్రస్తకిలేదు: రోజా
‘నేనేం తప్పుచేశానని క్షమాపణ చెప్పాలి? అసలు స్పీకర్‌కు తెలియకుండా, ఆయనకు సమాచారం లేకుండా అసెంబ్లీ వీడియో బయటకు ఎలా వచ్చింది? అసెంబ్లీ అంతా స్పీకర్ నియంత్రణలో ఉంటుంది. చిన్న పేపర్ ముక్క బయటకు వెళ్లాలన్నా ఆయన పర్మిషన్ కావాలి. అలాంటిది వీడియో ఎలా బయటకు లీకయింది? ముందు దానిపై విచారణ చేయకుండా నన్ను క్షమాపణ అడగటం అన్యాయం కదా’ అని రోజా వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. తనను సస్పెండ్ చేస్తే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తానన్నారు.
‘ఇప్పుడు మీకు అధికారం ఉందని మమ్మల్ని రెండేళ్లు సస్పెండ్ చేస్తే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని నాలుగేళ్లు సస్పెండ్ చేస్తాం. మీరు నేర్పిన విద్యే కదా’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు తెలియకుండా ఫుటేజీని మీడియాకు లీక్ చేసిన కాల్వ శ్రీనివాసులుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తాను మాట్లాడిన విషయాలను ఎడిట్ చేసి చూపారని, అలాకాకుండా మొత్తం వీడియోను ఫోరెన్సిక్‌కు పంపించి దాని ఆధారంగా చర్య తీసుకుంటే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని రోజా స్పష్టం చేశారు. టెలికాస్టు చేసేందుకు అసెంబ్లీలో కేవలం ఒక్క చానెల్‌కు మాత్రమే అధికారికంగా అనుమతి ఇచ్చారని, మరి వీడియో ఫుటేజీలు బయటకు వెళ్లినందున ఆ సంస్థకు ఇచ్చిన అనుమతులు రద్దుచేస్తారా? అని ప్రశ్నించారు.