రాష్ట్రీయం

ఎత్తిపోతలు.. కోతలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10:అమరావతిని ప్రపంచ దేశాల్లోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నానంటున్నారు. అయితే రాజధానికి సమీపాన పొంచి ఉన్న కొండవీటి వాగు వరద ముంపు నివారణకు మాత్రం శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నారు. ఈ విషయమై అత్యున్నత న్యాయస్థానాల్లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి తప్పించుకునేందుకా అన్నట్లు తాజాగా రూ.237 కోట్ల అంచనాలతో ప్రకాశం బ్యారేజి సమీపంలో ఉండవల్లి వద్ద తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు స్వయంగా శంకుస్థాపన కూడా చేశారు. పైగా అటు పులిచింతల, ఇటు పట్టిసీమ నుంచి నీరు అందుబాటులో లేని రోజుల్లో ఈ ఎత్తిపోతల పథకం ద్వారా కొండవీటి వాగు వరదనీటిలో ఐదువేల క్యూసెక్కుల నీటిని కృష్ణాడెల్టా ఆయకట్టు ప్రయోజనాలు కాపాడేందుకు బ్యారేజి ఎగువకు ఎత్తిపోస్తామని సిఎం చెబుతున్నారు. దీనికి టెండర్లు పిలవటం.. మెగా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ రూ.222.44 కోట్లకు కాంట్రాక్ట్ దక్కించుకోటం అన్నీ చకచకా జరిగాయి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రాజధాని ప్రాంతంలో కనీసం 11వేల ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్రాంతాలను ముంపు బారినుంచి రక్షించుకోవచ్చంటున్నారు. అయితే 1989 ప్రాంతంలో
నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వేలాది ఎకరాల పంట భూములను కొండవీటి వాగు వరదల ముంపు నుంచి కాపాడేందుకు దాదాపు రూ.300 కోట్ల అంచనాలతో ఓ పథకానికి ఉండవల్లిలో ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. నాటి కార్యక్రమంలో మంత్రులు రోశయ్య, మహ్మద్ జానీ తదితరులు పాల్గొన్నారు. కృష్ణానదికి కొద్దిపాటి వరద సంభవిస్తే కొండవీటి వాగు ప్రవహించే ప్రాంతానికి 15 అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉంటుంది. దీనివల్ల వాగు ఉగ్రరూపం దాల్చి వేలాది ఎకరాలను ముంచెత్తుతుంది. అందుకే ఉండవల్లి కొండలను తొలచి వాటి దిగువ నుంచి వాగు నీరు బ్యారేజి దిగువకు ప్రవహించేలా నాడు కసరత్తు చేశారు. అయితే కొండను తొలిస్తే ఏకంగా బ్యారేజికే ముప్పని పలువురు ఇంజనీర్లు చెప్పటంతో ఆ ప్రయోగానికి స్వస్తి చెప్పారు. ఆ తర్వాత సిఎంలుగా వచ్చిన కోట్ల విజయభాస్కరరెడ్డి, తర్వాత చంద్రబాబునాయుడు ఎంతో కసరత్తు చేసి ఓ ఛానెల్ నుంచి కృష్ణానదిలోకి, మరో ఛానెల్ నుంచి బకింగ్‌హామ్ కెనాల్‌కు కొండవీటి వాగు వరదనీటిని మళ్లించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఏ విధమైన ప్రయోజనం కన్పించలేదు.
సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే వరదలు సంభవిస్తాయి. అప్పటికి కొమ్ముమూరు కెనాల్ ఆయకట్టులో వరి పంట కోతకు వస్తుంది. భారీ వరదలు సంభవించినప్పుడు కాలువలన్నీ కట్టివేస్తుంటే.. కొండవీటి వాగు వరదను మళ్లిస్తే పంట పొలాలన్నీ ముంపునకు గురవుతాయి. దీంతో ఈ ప్రయోగం కూడా పూర్తిగా విఫలమైంది. 1998, 2009 సంవత్సరాల్లో వరదలు వచ్చినప్పుడు కృష్ణానదిలో 21 అడుగులు పైగా నీరు నిలువటమే గాక కరకట్టలకు సైతం ప్రమాదం ముంచుకొచ్చింది. అందుకే శివరామకృష్ణన్ కమిటీ కూడా ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఆలోచన సరైంది కాదని స్పష్టం చేసింది.
అసలు వరద అనేది ఏనాడూ చెప్పిరాదు. అర్ధరాత్రి వేళ వచ్చినా సరే.. కృష్ణానదిలోకి యంత్రాలతో ఎత్తిపోస్తామని చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు కృష్ణానదికి వచ్చే వరదనీరే కరకట్టను ముంచెత్తే ప్రమాదం ఉంటే ఇక ఎత్తిపోతల సాధ్యమేనా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఎత్తిపోతల పథకంలో 16 శక్తిమంతమైన పంపులు ఏర్పాటు చేసినప్పటికీ 2009 నాటి పరిస్థితులు పునరావృతమైతే ఆ పంపులు కూడా కొట్టుకుపోతాయనటంలో ఎలాంటి సందేహం లేదు.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం, పేరేచర్ల ప్రాంతాల్లోని కొండవీడు కొండల్లో పుట్టిన కొండవీటి వాగు అక్కడ నుంచి మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ప్రవహించి ఉండవల్లి గ్రామం పరిధిలోని ప్రకాశం బ్యారేజి ఎగువ కృష్ణానదిలో కలుస్తుంది. దాదాపు 30 కిమీ దూరం సాగే ఈ ప్రయాణంలో కొండవీటి వాగుకు ఎర్రవాగు, కోటేళ్లవాగు, పాలవాగు వంటి చిన్న వాగులు జత కలుస్తాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు 22వేల క్యూసెక్కుల గరిష్ఠ నీటిమట్టానికి వరదనీరు చేరుతుంది. ఆ సమయంలో కనీసం 25వేల ఎకరాల పంట భూములు నీట మునుగుతాయి. అయితే రాజధాని ప్రాంత రైతులు తెలివిగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పంట లేకుండా జాగ్రత్తపడుతూనే పది మాసాల్లో ఉల్లి, మునగ, శనగ, మినుము వంటి వాణిజ్య పంటలు సాగుచేయటంలో నేర్పరితనం సాధించారు.

చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాగు నీటి మళ్లింపు పథకానికి శంకుస్థాపన చేస్తున్న దృశ్యం (ఫైల్‌ఫోటో)

ఇటీవల కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన దృశ్యం (ఫైల్‌ఫొటో)