రాష్ట్రీయం

జంబ్లింగ్‌లో గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణలో పదో తరగతి పరీక్షల జంబ్లింగ్ విధానం ప్రహసనంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి కార్పొరేట్ స్కూళ్లు తమ యాజమాన్యంలోని వేరే కేంద్రాలకే జంబ్లింగ్ పేరిట తమ విద్యార్థులను పరీక్షలకు కేటాయించుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో లక్షలాది రూపాయిలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు డిఇఓలు వ్యవహారాన్ని దగ్గరుండి కార్పొరేట్ స్కూళ్లకు అనుకూలంగా కేంద్రాలు కేటాయించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం ఇక్కడితో ముగియలేదు. విద్యార్థులకు పాఠాలు చెప్పిన టీచర్లను సైతం పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా కార్పొరేట్ స్కూళ్లు నియమించుకున్నాయి. జంబ్లింగ్ వ్యవహారం ఇందుకు కూడా బాగా ఉపయోగపడింది. ఒకే యాజమాన్యం పరిధిలో రెండు స్కూళ్లు ఉంటే, ‘ఎ’ స్కూల్లోని విద్యార్థులను ‘బి’ స్కూల్‌లో పరీక్ష రాసేందుకు కేటాయించారు. ఎవరైనా అడిగితే జంబ్లింగ్ జరిగింది కదా అంటున్నారు. అసలు వ్యవహారం లోతుగా పరిశీలిస్తే కానీ తెలియదు. ‘ఎ’ స్కూల్‌లో పనిచేసిన టీచర్లే ‘బి’ స్కూల్ కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా, డిపార్టుమెంటల్ ఆఫీసర్లుగా, చీఫ్ సూపరింటెండెంట్లుగా నియమితులయ్యారు. అంటే ‘బి’ కేంద్రంలో విద్యార్థులకు ‘ఎ’ రూమ్‌లో ఎవరు ఉండాలనేది అంతా ఆ యాజమాన్యం చెప్పినట్టే జరుగుతుంది. బయటికి మాత్రం తమకేమీ తెలియదని, జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు జరుగుతున్నాయని చెప్పి అధికారగణం తప్పించుకుంటోంది. హాల్‌టిక్కెట్ల జారీలో పంపించిన డాటా షీట్లలో చాలా స్పష్టంగా విద్యార్థులు ఏ పాఠశాలకు చెందినవారో, ఏ పరీక్ష కేంద్రానికి జంబ్లింగ్‌లో వెళ్తున్నారో కూడా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అది చూసి కూడా అధికారులు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరించడం వెనుక పెద్ద రాకెట్ ఉందనేది సుస్పష్టమని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జంట నగరాలతో పాటు సరిహద్దు ప్రాంతంలో అత్యధిక పాఠశాలలు పది కార్పొరేట్ సంస్థలకు చెందినవే. పరీక్షల దూరదృష్టితో ఒక్కో ప్రాంతంలో రెండు పేర్లతో పాఠశాలలను కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేశాయి. అమీర్‌పేటలో దాదాపు స్కూళ్లు అన్నీ రెండు కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. అధికారులు వారికి సహకరించి సొంత స్కూళ్లలోనే విద్యార్ధులు వచ్చేలా కథ నడిపినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై సిఐడి దర్యాప్తు నిర్వహిస్తే ఎమ్సెట్ పేపర్ లీక్ మాదిరి పెద్ద డొంకే కదులుతుందని చెబుతున్నారు.
చర్యలు తీసుకుంటాం: పరీక్షల కమిషనర్
జంబ్లింగ్‌లో గోల్‌మాల్ వ్యవహారం గురించి పరీక్షల కమిషనర్ డాక్టర్ సురేందర్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా, అలాంటి లోపాలుంటే చర్యలు తీసుకుంటామని, సొంత టీచర్లే ఇన్విజిలేటర్లుగా నియమితులైతే వారిని తొలగించి కొత్త వారిని నియమిస్తామని పేర్కొన్నారు.