రాష్ట్రీయం

కోనసీమ పంట పండింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 12: కల్పవృక్షంగా పేరొందిన కొబ్బరి చెట్టు నిజంగానే రైతుల ఇంట సిరులు కురిపించనుంది. కొబ్బరి చెట్టు నుండి తీసే ‘కల్పరస’కు ఆబ్కారీ చట్టం నుండి మినహాయింపు లభించడంతో ఇక ఉత్పత్తి ఊపందుకోనుంది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఆబ్కారీ చట్టం నుంచి కల్పరసను మినహాయించడంతో ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా ఉత్పత్తి మొదలైంది. రైతులు ఇతోధికంగా లాభాలు సంపాదిస్తున్నారు. మన రాష్ట్రంలో కొబ్బరికి పేరొందిన కోనసీమ రైతుల విజ్ఞప్తి, ప్రజా ప్రతినిధుల చొరవతో ఎట్టకేలకు రాష్ట్రంలో కూడా ఆబ్కారీ చట్టం నుండి మినహాయింపు లభించింది. దీనితో రాష్ట్రంలోని కొబ్బరి రైతుల దశ తిరగనుంది.
ఏమిటీ కల్పరస...
కల్పరసను కొబ్బరి చెట్టు మొవ్వు నుంచి సేకరిస్తారు. కొబ్బరి మొవ్వును సూదిగా మొనదేరేలా చెక్కి, కత్తితో గాట్లు పెట్టి, ఆ మొవ్వుకు ఐస్ బాక్సును తగిలించి చుక్క చుక్కగా కారే కల్పరసను సేకరిస్తారు. ఇది మొవ్వునుంచి కారేటపుడే శీతలీకరణ విధానంలో సేకరిస్తారు. ఏడాదికి కేవలం ఆరు నెలలే కల్పరస వస్తుంది. మిగిలిన ఆరు నెలల పాటు
కొబ్బరి దిగుబడి తీసుకోవచ్చు. కల్పరసలో ప్రోటీన్లు, కార్బొహైడ్రేడ్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కల్పరసతో తయారుచేసే పంచదార, బెల్లం, తేనెకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. కల్పరస ధర మార్కెట్‌లో 100 మిలీ ధర సుమారు రూ.15 వరకు ఉండొచ్చు. కల్పరస నుంచి తయారుచేసే పంచదార కిలో రూ.850 వరకు పలుకుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు కూడా నిరభ్యంతరంగా ఈ పంచదారను వినియోగించవచ్చు. సాంప్రదాయ ఆరోగ్య పానీయంగా ప్రపంచవ్యాప్తంగా కల్పరసకు పేరుంది. ప్రధానంగా ఇందులో యాంటి కేన్సర్ గుణం, 14-15 శాతం షుగర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వుంటాయి. ఈ కల్పరస నుంచి బిస్కట్లు, చాక్‌లెట్లు వంటి ఉప ఉత్పత్తులు కూడా తయారు చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
జీరో ఆల్కహాల్ కలిగి హెల్త్ డ్రింక్‌గా ఉన్న కల్పరసకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ వుంది. కల్లు తరహాలో పులిస్తే దీనికి ఆల్కహాల్ లక్షణాలు ఉంటాయి. అందుకే దీనికి ఆబ్కారీ చట్టంలో స్థానం కల్పించారు. దీనితో ఉత్పత్తి, వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. అయితే దీన్ని చెట్టు నుంచి పులియకుండా తీసే ప్రక్రియ అందుబాటులోకి రావడంతో ఆల్కహాల్ లక్షణాలు ఉండనే ఉండవు. కాబట్టి దీన్ని ఆబ్కారీ చట్టం నుండి తొలగించాలని ఎప్పటి నుండో రైతులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆబ్కారీ చట్టం నుండి కల్పరసను మినహాయించడంతో రైతులంతా ఉత్పత్తికి శ్రీకారం చుట్టడానికి అవకాశం కలిగింది. ఇప్పటికే కొంత మంది రైతులు కోనసీమలో కల్పరస తయారీకి శ్రీకారం చుట్టారు.
కల్పరస తయారీ వల్ల కొబ్బరి రైతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారిపోయే అవకాశముంది. ఇప్పటివరకు కొబ్బరి చెట్టు నుంచి ఏడాదికి సుమారు రూ.6000 ఆదాయం లభిస్తే కల్పరస తయారు చేయడంవల్ల ఒక్కో చెట్టుకు ఆరు నెలల కాలంలో రూ.30 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు ఎన్నో ఏర్పాటయ్యేందుకు మార్గం లభిస్తుంది. కల్పరస తయారీకి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. దీనికి అనుబంధంగా చిల్లింగ్ పాయింట్లు కూడా పెరుగుతాయి.
కొబ్బరి ఉప ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమల కోసం రాజమహేంద్రవరం సమీపంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రీసెర్చి సెంటర్‌ను (సిపిసిఆర్‌ఐ) ఏర్పాటుచేస్తున్నారు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సిపిసిఆర్‌ఐ) ఆధ్వర్యంలో కల్పరస తయారీకి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

చిత్రాలు..కొబ్బరి చెట్టుకు అమర్చిన కల్పరస సేకరించే బాక్సు.
*సేకరించిన కల్పరసను పరిశీలిస్తున్న శాస్తవ్రేత్తలు