రాష్ట్రీయం

డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు ఎసరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 13: లాభాల బాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ)ని ప్రైవేటుపరం చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మొట్టమొదటిదైన డిసిఐలో మెజార్టీ వాటాలను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. డిసిఐని 1976లో విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హాల్దియా, కొచ్చిన్‌లలో డిసిఐకి శాఖలు ఉన్నాయి. ఏడాదికి సుమారు 600 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తున్న ఈ సంస్థలో షేర్లను కేంద్రం ఎందుకు విక్రయించాలని భావిస్తోందో అర్థం కావడం లేదు. ఎన్డీయే ప్రభుత్వ సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్, బిహెచ్‌పివి, హిందుస్థాన్ షిప్‌యార్డులను ప్రైవేటీకరించాలని చూసింది. ఆ సమయంలో ఉద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఆయా సంస్థలకు ప్రైవేకరణ ముప్పు తప్పింది. తాజాగా డిసిఐ ఈ జాబితాలో చేరింది. ఇప్పటికే డిసిఐలోని 22 శాతం వాటాలను విక్రయించిన ప్రభుత్వం తాజాగా మరో 51 శాతం వాటాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలోని వాటాలను విక్రయించడం దేశంలో ఇదే ప్రథమం కావచ్చు. తమ సంస్థ ప్రైవేటుపరం కాబోతోందని తెలిసి ఆ సంస్థలోని ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంస్థలో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొద్ది నెలల కిందట సుమారు 150 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకున్నారు. సంస్థ ప్రైవేటుపరమైతే వీరి పరిస్థితి అగమ్యగోచరమే అవుతుంది.
ఇదిలాఉండగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్ట్‌లను మంజూరు చేసింది. ఇందులో అంతర్వేది వద్ద సుమారు 915 కోట్ల రూపాయలతో డ్రెడ్జింగ్ శిక్షణ యూనిట్ ఒకటి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇటువంటి సమయంలో డిసిఐని ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం ఎందుకు అడుగులు ముందుకు వేస్తోందో తెలియడం లేదు.
మినీరత్న హోదాలో ఉన్న డిసిఐ ప్రతి ఏటా లాభాలను ఆర్జిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 734.96 కోట్ల టర్నోవర్ చేసి 62.71 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. అలాగే 2015-16లో 665.86 కోట్ల టర్నోవర్ చేసి 79.67 కోట్ల లాభాలను సంపాదించింది. దేశంలోని మిగిలిన కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల పెట్టుబడితో పోల్చి చూస్తే, డిసిఐకి అధిక లాభాలు వస్తున్నాయి. ప్రపంచంలోని డ్రెడ్జింగ్ కంపెనీల్లో మొదటి 10 స్థానాల్లో డిసిఐ ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థలో షేర్లను నెమ్మదిగా విక్రయించుకుంటూ వస్తోంది. 1991-92లో 1.44 శాతం షేర్లను విక్రయించింది. 2003-04లో 20 శాతం, 2015-16లో ఐదు శాతం, 2016-17లో 0.09శాతం షేర్లను విక్రయించింది. ఇప్పుడు ఈ సంస్థ వద్ద 73.47 శాతం షేర్లు ఉన్నాయి. ఇందులో 51 శాతం షేర్లను విక్రయించేందుకు కేంద్రం ఆలోచన చేస్తోంది. అప్పుడు డిసిఐ చేతిలో కేవలం 22 శాతం షేర్లు మాత్రమే ఉంటాయి.
కాగా, లిస్టెడ్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న డిసిఐ షేర్లను విక్రయించాలని 2011లో అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే, షేర్ మార్కెట్‌లో డిసిఐ షేర్ విలువ తక్కువగా ఉన్నందున ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మళ్లీ ఇప్పుడు డిసిఐలో వాటాల విక్రయం అంశం తెరమీదకు వచ్చింది. ఈ అంశం కేంద్ర క్యాబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని నౌక మంత్రిత్వశాఖ అధీనంలో ఉన్న 12 మేజర్ పోర్టుల్లో డిసిఐ డ్రెడ్జింగ్ పనులు నిర్వహిస్తోంది. డిసిఐతోపాటు దేశంలోని మరికొన్ని ప్రైవేటు డ్రెడ్జింగ్ కంపెనీలతో ధరల విషయంలో డిసిఐ పోటీ పడుతోంది. ప్రైవేటు సంస్థలకు ఈ బాధ్యతను అప్పగించడం వలన పోర్టుల్లో భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
నేడు చైర్మన్‌తో ఉద్యోగుల భేటీ
సంస్థలో షేర్ల విక్రయాన్ని నిరసిస్తూ మూడు రోజులుగా డిసిఐ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. షేర్ల ఉపసంహరణకు సంబంధించి డిసిఐ చైర్మన్ రాజేష్ త్రిపాఠిని ఉద్యోగులు మంగళవారం కలవనున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆ తరువాత ప్రధాన మంత్రిని కలవనున్నట్టు వారు పేర్కొన్నారు.

చిత్రాలు.. డిసిఐ నౌక ద్వారా డ్రెడ్జింగ్ పనులు జరుగుతున్న దృశ్యం

*విశాఖలో నిరసన తెలియచేస్తున్న డిసిఐ ఉద్యోగులు