రాష్ట్రీయం

పోలవరంతో మీ పని సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 16:పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు పుట్టగతులుండవనే భయంతోనే రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాష్ట్రానికి గత యుపిఏ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవంకాదా?. ప్రస్తుతం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారంటే ఆనందించాల్సింది పోయి సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు. ఐదుకోట్ల మంది ప్రజలకు కేంద్రం చేసిన మంచి పనులు వివరిస్తున్నా.. మీకోసం కాద’ని వైకాపా సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించినందుకు గురువారం శాసనసభలో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సిఎం, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పరస్పర ఆరోపణలకు దిగారు. సిఎం స్పందిస్తూ పోలవరానికి, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించిన చారిత్రాత్మకమైన రోజున అలజడి సృష్టించటం తగదన్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన కేంద్ర మంత్రులను ఈ సందర్భంగా అభినందించారు. ఇప్పటివరకు రెవిన్యూలోటు భర్తీ కింద 1177 కోట్లు, రాజధానికి 1450 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 7 జిల్లాలకు ఏటా 50 కోట్ల చొప్పున కేంద్రం అందిస్తోందని సిఎం వివరించారు. పోలవరానికి ఇప్పటివరకు 10,461 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ప్రాజెక్టు అంచనాల ప్రకారం 2014 నాటికి 16వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా ఉందన్నారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో కేంద్రం నిధులు ప్రకటించిందని, ఏడాదిలోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. నూరుశాతం నిధులు కేంద్రం మంజూరు చేస్తుందని చెప్పారు. ఇప్పటివరకు ప్రాజెక్టుపై 8998.99 కోట్లు ఖర్చుచేశామన్నారు. భూ సేకరణపై కూడా కేంద్రంతో చర్చిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ హయాంలో మధుకాన్, ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని పనులు పూర్తికాకుండా అడ్డుకుని మరో సంస్థలకు కట్టబెట్టారని, ఈ రకంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. కనీసం మట్టిపనులు కూడా పూర్తికాకుండా ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి అప్పగించారన్నారు. అయితే 2018 వరకు ఈ సంస్థ ఒప్పందం ఉన్నందున తాము పనులు కొనసాగిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. ‘ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతను పక్కదారి పట్టిస్తున్నారు. మీరు ఏ చదువులు చదివారో నాకు తెలీదు. జావా యూనివర్శిటీలో చదువుకున్నట్లు ఉన్నార’ని సిఎం వ్యంగ్యోక్తి విసిరారు. తాను తిరుపతి ఎస్‌వి వర్శిటీలో ఎకనమిక్స్‌లో ఎంఫిల్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. ప్యాకేజీ, హోదాలో ఏ రకమైన నిబంధనలు ఉన్నాయో నిరూపించాలని సవాల్ విసిరారు. గండికోట, వెలుగొండ ప్రాజెక్టులను కూడా పూర్తిచేస్తామని ప్రకటించారు. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించక పోతే చరిత్రహీనులవుతారని వైసిపిపై మండిపడ్డారు.
‘సభలో రౌడీయిజం చెల్లదు. హుందాగా ఉండాలి. కేంద్రం సహకరిస్తోంది. మిమ్మల్ని ప్రజలు నమ్మరు. డిపాజిట్లు గల్లంతయ్యేరోజు వస్తుంద’ని విమర్శించారు. దేశం మొత్తంగా 29 రాష్ట్రాలలో జాతీయ ప్రాజెక్టులు 16 ఉన్నాయని, పోలవరంపై మాత్రమే కేంద్రం శ్రద్ధ తీసుకుందని చంద్రబాబు తెలిపారు. మూడున్నరేళ్ల కాలంలో ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం 3541 కోట్లు ఖర్చుచేస్తే వైఎస్ హయాంలో నాలుగువేల కోట్లకు పైగా ఖర్చుచేసినా ప్రయోజనం సాధించలేదన్నారు.

చిత్రం..గురువారంనాడు అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు