రాష్ట్రీయం

వారసత్వ ఉద్యోగాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16:సింగరేణిలో వారసత్వ ఉద్యోగ నియామకాలపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేందుకు ఉద్దేశించిన పథకాన్ని, అలా రిటైరైన వారి స్థానంలో వారి పిల్లల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే నోటిఫికేషన్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం రద్దు చేసింది. గోదావరిఖనికి చెందిన కె సతీష్ కుమార్ అనే వ్యక్తి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 14, 16, 21 అధికరణల్లో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు, సమాన అవకాశాలకు భంగం వాటిల్లే విధంగా ఈ నోటిఫికేషన్ ఉందని పిటిషనర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 2016 డిసెంబర్ 20న ఇచ్చిన ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ వారసత్వ ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ పథకంలోనూ, నోటిఫికేషన్‌లోనూ పలు లోపాలు ఉన్నట్టు పేర్కొంది. సంస్థ రాజ్యాంగంలోని 14, 16 అధికరణలను ఉల్లంఘించిందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఫిట్‌నెస్ లేని వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లుగా లేదన్నారు. వైద్యకారణాలపై అనర్హులయ్యే అవకాశాలున్న ఉద్యోగులను దృష్టిలో పెట్టుకున్నారని, వీరు మామూలుగా రిటైరయ్యే వరకు సర్వీసులో కొనసాగగలుగుతారని హైకోర్టు పేర్కొంది. మరో రెండేళ్లలో రిటైరయ్యే అవకాశం ఉన్న ఉద్యోగులకు అనుకూలంగా ఈ పథకాన్ని ఖరారు చేశారని, తద్వారా వారిస్థానంలో వారి పిల్లల్లో ఒకరిని ఉద్యోగానికి ఎంపిక చేసే అవకాశం ఇచ్చారని హైకోర్టు పేర్కొంది. వారసత్వ నియామకాల్లో మగపిల్లలు, ఆడపిల్లలకు మధ్య వ్యత్యాసం చూపించారన్నారు. గనుల్లో మహిళలు పనిచేయలేరంటూ కారణం చూపించారని, మహిళలపై వివక్ష తగదనే రాజ్యాంగ స్ఫూర్తికి ఈ నిబంధన విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. సింగరేణిలో పనిచేసే ఒంటరి ఉద్యోగులకు, తమ భార్యలతో కలిసి పనిచేసేవారికి మధ్య ఈ స్కీం వ్యత్యాసం చూపించిందన్నారు. దివ్యాంగులపట్ల కూడా వివక్ష చూపించారన్నారు. నిబంధనల్లో దివ్యాంగుల్లో వివిధ రకాల వైకల్యాలను పేర్కొనలేదని ధర్మాసనం ఎత్తిచూపింది. పిల్లలను దత్తత తీసుకున్న వారి ప్రస్తావనే లేకపోవడాన్ని తప్పుపట్టింది. వాస్తవానికి వారసత్వ కారుణ్య నియామకాలను ఉద్యోగుల పిల్లలకు వర్తింప చేయదలుచుకుంటే, రాజ్యాంగంలోని 14, 15, 16 అధికరణలకు విరుద్ధంగా మార్గదర్శకాలు ఉండరాదన్న సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు ఉదహరించింది.