రాష్ట్రీయం

తోసుకున్నారు.. తిట్టుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) మార్చి 21: అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం టిడిపి, వైకాపా మహిళా ఎమ్మెల్యేలు తోపులాటకు దిగి రగడ సృష్టించారు. మహిళా సమస్యలను టిడిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తోందంటూ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యేలు అనిత, మీసాల గీత, తంగిరాల సౌమ్య మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుండగా వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కళావతి, పుష్ప శ్రీవాణి, రాజేశ్వరి అక్కడికి చేరుకున్నారు. మహిళా సమస్యలను తాను సభలో ప్రస్తావిస్తుంటే మైక్ కట్ చేయటం వల్లనే విధిలేని పరిస్థితుల్లో మీడియా పాయింట్ వద్దకు రావాల్సివచ్చిందని ఈశ్వరి చెప్పారు. పక్కనే వున్న టిడిపి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోటంతో గందరగోళం నెలకొంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరుపక్షాల మహిళా ఎమ్మెల్యేలు ఎవరికి వారు మీడియా పాయింట్ వద్ద మహిళా సమస్యలపై గళం విప్పటం తీవ్ర గందరగోళానికి దారితీయటంతో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష, అధికారపక్ష ఎమ్మెల్యేల సవాళ్ళు, ప్రతిసవాళ్ల మధ్య వాతావరణం వేడెక్కింది. ఈలోగా డిడిపి ఎమ్మెల్యేలు కెఏ నాయుడు, జవహర్ తదితరులు మహిళా మార్షల్స్‌ను మీడియా పాయింట్ వద్దకు తీసుకొచ్చారు. మహిళా మార్చల్స్ అధికార, ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేలకు నచ్చజెపి శాంతింపచేశారు. అనంతరం గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ మహిళలపై దాడులు, అత్యచారాలు పెరిగిపోయినా తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎమ్మార్వో వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసినా, రిషితేశ్వరి ర్యాగింగ్‌కు బలైపోయినా, నారాయణ కళాశాలలో విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, విజయవాడలో కాల్‌మనీ వ్యాపారుల విషకోరల్లో మహిళలు లైంగికంగా నలిగిపోయినా, గుంటూరు జిల్లాలో ఎస్సీ మహిళా సర్పంచ్‌ను సభకు రానీయకుండా బంధించినా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. విజయవాడలో మహిళా పార్లమెంట్ సదస్సుకు ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను ఆహ్వానించిన ప్రభుత్వం పోలీసు వ్యాన్‌లో ఎక్కించి ఊరూరా తిప్పినమాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఏడాది పాటు రోజాను అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి మర్చిపోయి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని శాసనసభలో మంత్రులు చెప్పటం వేదాలు దెయ్యాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఈలోగా పక్కనే వున్న టిడిపి ఎమ్మెల్యే అనిత మైక్‌లను లాక్కోవటంతో మళ్లీ వాతావరణం వేడెక్కింది. మహిళా మార్షల్స్ వైకాపా ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఆయేషా మీరాను హత్యచేసినా, విజయవాడలో చిన్నారి నాగవైష్ణవిని నిప్పుల కొలిమిలో వేసి నిర్దాక్షిణ్యంగా చంపినా, వరంగల్‌లో ప్రణీత అనే మహిళపై యాసిడ్ దాడి చేసినా నాటి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని జైలుపాలు చేసింది వైఎస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. చంద్రబాబు ఆర్‌కె రోజాకు రాజకీయ భవిష్యత్తునిస్తే ఆమె చంద్రబాబు పట్ల ఎలా మాట్లాడుతోందో లోకానికి తెలుసునన్నారు. మరో టిడిపి ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ వైసీపీది కండబలం అయితే మాది నైతిక బలం అన్నారు. ఏదిఏమైనా అధికార,ప్రతిపక్ష మహిళా శాసనసభ్యులు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రవర్తించిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

చిత్రం..అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వాగ్వాదం, తోపులాటకు దిగిన టిడిపి, వైకాపా మహిళా ఎమ్మెల్యేలు