రాష్ట్రీయం

కరవు ఇక పరారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: రాష్ట్రాన్ని సుభిక్షం చేసే శక్తి సామర్థ్యాలు పోలవరం ప్రాజెక్టుకు ఉన్నాయని, ఏడాదిపాటు వర్షాలు లేకున్నా, కరవు పరిస్థితులు నెలకొన్నా నీటి సమస్య తలెత్తే అవకాశమే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని 2018 కల్లా పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరందించి తీరతామని చెప్పారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకు లేనంతగా అత్యంత పొడవైన అప్రోచ్ చానల్, ఎత్తయిన గేట్ల ఏర్పాటు, అత్యంత లోతు నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పోలవరం ప్రాజెక్టు ఘనతలుగా పేర్కొన్నారు. చైనాలోని త్రీగోర్జెస్ ప్రాజెక్టుకు ఏమాత్రం తీసిపోదని చెప్పారు. సోమవారం శాసనసభ కమిటీ హాలు-2లో పోలవరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన అవగాహన సమావేశంలో పోలవరం, అమరావతి రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమని ముఖ్యమంత్రి అన్నారు. పోలవరం
నుంచి ఏయే ప్రాజెక్టులకు ఎలా నీటిని ఎలా తరలిస్తాం, ఎలా వినియోగించుకుంటాం అనే అంశాలను స్వయంగా ముఖ్యమంత్రి వివరించారు. సోమవారం అంటేనే పోల‘వారం’ అనుకునేంతగా ముద్రపడిపోయేలా ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ఇలా రాయలసీమలో ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయడం పోలవరం ప్రాజెక్టుతో సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 40 టిఎంసిల నీటిని రిజర్వాయర్‌లో నిల్వచేసి, నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తరలిస్తామన్నారు. అమరావతికి ఎగువన 10 టిఎంసిల సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మాణానికి యోచిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి అమరావతి నగర భవిష్యత్ నీటి అవసరాలను ఈ నిర్మాణంతో తీర్చాల్సి ఉందన్నారు.
అటు అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని, స్పిల్ వే - స్పిల్ చానల్ తదితర నిర్మాణాల వివరాలను సభ్యులను ఆసక్తి కలిగించేలా తెలియజేశారు. వివిధ దశలుగా జరుగుతున్న పనులను చీఫ్ ఇంజనీర్ రమేష్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం పనులతో పాటు గేట్ల ఫాబ్రికేషన్ పనులు సమాంతరంగా సాగుతున్నాయని ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు చెప్పారు.
కుడి కాలువ, ఎడమ కాలువ, హెడ్ వర్క్‌తో కలిపి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 40.65% పనులు పూర్తయ్యాయని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అన్నారు. పోలవరంతో విశాఖకు 23.44 టిఎంసిల నీటిని తరలించడం, 540 గ్రామాల్లో 28.5 లక్షల నుంచి ప్రజల దాహార్తిని తీర్చడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. పొరుగు రాష్ట్రాలకు పోలవరం వరప్రదాయనిగా అభివర్ణించిన శశిభూషణ్ ఒడిశాకు 5 టిఎంసిలు, ఛత్తీస్‌గఢ్‌కు 1.5 టిఎంసిల నీటిని ఇచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో మంత్రులు, ఉభయ సభల సభ్యులు, జలవనరుల శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ గుప్తా, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం.... పోలవరం ప్రాజెక్ట్‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు