రాష్ట్రీయం

పాతికేళ్లు దాటినా నీట్ రాయొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కళాశాలల్లో యుజి కోర్సులో చేరేందుకు నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు) వయోపరిమితిని సడలించారు. ఇంతవరకూ 25 సంవత్సరాల లోపు వారు మాత్రమే రాయాలన్న నిబంధనను సడలించడంతో వేలాది మందికి మరో అవకాశం ఇచ్చినట్టయింది. వయోపరిమితి నిబంధనను సడలిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిసస దీపక్ మిశ్రా, ఎఎం ఖాన్‌విల్కర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించడంతో తాజాగా దరఖాస్తు గడువును ఏప్రిల్ 5 వరకూ పొడిగించారు. నీట్ ప్రవేశ పరీక్షను మే 7న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు గడువు మార్చి 1నే ముగిసింది. వయోపరిమితి ఆంక్షలతో ఇంత వరకూ పరీక్షకు దరఖాస్తు చేయని వారందరికీ మరో అవకాశం దక్కింది. కేవలం ఒక నోటీసుతో గరిష్ట వయోపరిమితిని నిర్ణయించి, మిగిలిన వారికి అవకాశం లేకుండా చేయడం సరికాదు, అందరికీ అవకాశం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 5లోగా సమర్పించాలని, లేకుంటే సిబిఎస్‌ఇకి ఇబ్బంది అవుతుందని కూడా బెంచ్ పేర్కొంది. అదనపు అభ్యర్ధుల కోసం కొత్త కేంద్రాలు అవసరమైతే సంబంధిత జిల్లాల కలెక్టర్లు లేదా కమిషనర్లు సహకరించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఎస్‌ఇ నీట్ పరీక్షకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏ ఇతర రాష్ట్రాల హైకోర్టులు జోక్యం చేసుకున్నా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడి ఉండాలని కూడా పేర్కొంది.
కేంద్రాలు పెంచండి: కవిత
తెలంగాణలో నీట్ పరీక్షకు హాజరయ్యే తెలంగాణ విద్యార్ధుల సౌలభ్యం కోసం మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న 80 పరీక్ష కేంద్రాలను 103 కేంద్రాలకు పెంచడం మంచి నిర్ణయమని అన్నారు. అయితే రాష్ట్రాల వారీ పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయంలో సహేతుకత లోపించిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు పరీక్ష కేంద్రాలు ఉండగా, తాజాగామరో మూడు కేంద్రాలను పెంచారని తెలిపారు. అలాగే చిన్న రాష్ట్రం అయిన కేరళలో ఇప్పటికే మూడు కేంద్రాలు ఉండగా మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని, ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, విజయవాడ పరీక్ష కేంద్రాలకు తోడుగా మరో రెండు గుంటూరు, తిరుపతి ఇచ్చారని, ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్ధులు, పేరెంట్స్ సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న రెండు కేంద్రాలకు అదనంగా ఆదిలాబాద్, కరీంనగర్‌లలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని కవిత కోరారు. కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత విద్యార్ధులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉంటారని చెప్పారు.