రాష్ట్రీయం

ఆదరాబాదరా పట్టిసీమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 31: వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన చెల్లింపులు, ఖర్చు, కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వ తీరును కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక తప్పుపట్టింది. శుక్రవారం విడుదల చేసిన కాగ్ నివేదికలో ఆ వివరాలను పొందుపరిచింది. నీటిపారుదల ప్రాజెక్టులలో అధిక చెల్లింపులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జెన్‌కో చేపట్టిన థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ల్లో కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు జరిగాయని ఆక్షేపించింది. పోలవరం, పట్టిసీమ, హంద్రీ-నీవా, గురురాఘవేంద్ర వంటి కీలక ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులనూ కాగ్ ప్రశ్నించింది.
కాగ్ అభ్యంతరాలు ఇవీ..
పోలవరం కుడికాలువ, దాని డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకుండా, పారిశ్రామిక, గృహ వినియోగదారులను గుర్తించకుండానే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీంతోపాటు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోవడంతో ఈ ప్రాజెక్టులో లబ్ధి- వ్యయ నిష్పత్తి ప్రతికూలంగా మారింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో టెండరు ప్రీమియం గరిష్ఠ పరిమితిని సడలించడం, పోలవరం కుడికాలువ, దాని డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకుండానే అధిక టెండరు ప్రీమియంతో పనులను అప్పగించడం వల్ల రూ.199 కోట్ల మేర అదనపు భారం పడింది.
జాతీయ రైతు కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్రంలో 2000 మార్కెట్లు అవసరముండగా కేవలం 301 మార్కెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతమున్న మార్కెట్ యార్డుల్లో కూడా అవసరమైన వౌలిక వసతులు లేవు. మచ్చుకు తనిఖీ చేసిన జిల్లాల్లోని 99 మార్కెట్ యార్డులకు గాను 90 మార్కెట్ యార్డుల్లో 2011-16 మధ్యకాలంలో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. నమూనా చట్టంలో సూచించిన విధంగా 10 మార్కెట్లలో ఇ-ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికి ఈ మార్కెట్లలో గ్రేడింగ్, నాణ్యతా ధృవీకరణ వంటి అవసరమైన సౌకర్యాలు లేవు.
మూడు రోడ్ల ఉన్నతీకరణ పనుల్లో జాప్యం చేసిన గుత్తేదార్లపై రూ.34.82 కోట్ల పరిహారాన్ని విధించలేదు. రద్దు చేసిన రెండు ప్యాకేజీల్లో మిగిలిపోయిన పనులపై రూ.159.96 కోట్ల అదనపు వ్యయాన్ని గుత్తేదారుల నుంచి ఇంకా రాబట్టవలసి ఉంది.
దీర్ఘకాలిక పనితీరు ఆధారిత నిర్వహణ ఒప్పందాల (ఎల్‌టిపిబిఎమ్‌సి) కోసం రోడ్లను నిర్దిష్ట పరిమితులేవీ లేకుండానే గుర్తించారు. రోడ్ల ఎంపిక సరిగా లేనందున తనిఖీ చేసిన ఎల్‌టిపిబిఎమ్‌సి పనుల్లో చేపట్టిన 2,011 కి.మీలలో 472.208 కి.మీల రోడ్లను ఒప్పందాల పరిధి నుండి తొలగించినట్టు తేలింది. అయితే వాటి బదులుగా ప్రత్యామ్నాయ రోడ్లను చేపట్టలేదు.
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు (రెండోదశ) ప్యాకేజీ-53లో పనుల పరిధి తగ్గినా ఒప్పంద విలువను తగ్గించకపోవడం వల్ల రూ.6.47 కోట్ల మిగులు ధనం ప్రభుత్వ ఖజానాకు చేరలేదు. ఈ ప్రాజెక్టు రెండవ దశలోని ప్యాకేజీ-6, ప్యాకేజీ-10లలో గుత్తేదారు చేయని లైనింగ్ పనులకు కేటాయించిన మొత్తాలను తగ్గించి ముందుగా చేసే సొరంగం/అప్రోచ్ కాలువ తవ్వకం పనులకు చెల్లించే మొత్తాలను పెంచడం వల్ల గుత్తేదారు సంస్థకు రూ.4.97 కోట్ల మేర అధిక చెల్లింపులు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం వద్ద శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసినప్పటికీ రూ.1.17 కోట్లను కన్సల్టెంట్లకు చెల్లించారు. ప్రాజెక్టు వ్యయం పెరగటం వల్ల 52.64 కోట్ల మేరకు వడ్డీ భారం పడింది. సూపర్‌వైజరీ ఛార్జీలను పెంచడం వలన ఏపి జెన్‌కోకు రూ.84 కోట్ల మేర వృథా చెల్లింపులు జరిగాయి. బొగ్గు రవాణాలో చెల్లించిన ఖర్చుల కారణంగా 44.19 కోట్ల మేర గుత్తేదారుకు అనుచిత ప్రయోజనం చేకూరింది. పేలవమైన నిర్వహణ వల్ల కంపెనీకి 9,251 కోట్ల రూపాయల విలువైన అమ్మదగిన విద్యుత్ వృధా అయింది.
బొగ్గు సేకరణ ఆర్డర్‌లో సరైన నిబంధనలు పొందుపరచకపోవటం వలన, కంపెనీ 2014 నుండి 2016 సంవత్సరాలకు గాను అన్‌గ్రేడెడ్ బొగ్గు, గ్రేడ్ వ్యత్యాసాలున్న బొగ్గు సేకరణపై రూ.918.61 కోట్ల నివారించగల చెల్లింపులు చేయాల్సి వచ్చింది. విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు అవసరాలపై సరైన పర్యవేక్షణ లేకపోవటం వలన 2011-15 మధ్య కాలంలో బొగ్గు మళ్లింపు వలన రవాణా ఛార్జీల కింద రూ.186.77 కోట్ల వృథా వ్యయం చేశారు.
పంచాయతీల్లో అంతర్గతంగా జరిగే పనులను యాంత్రీకరించాలనే ఈ-పంచాయతీ ప్రధాన లక్ష్యాన్ని ప్రాజెక్టు మొదలు పెట్టి మూడేళ్లు గడచిన తర్వత కూడా సాధించలేకపోయారు. సర్వీసు ప్లస్ అప్లికేషన్‌ను అమలు చేయకపోవడంతో, గ్రామ పంచాయతీల్లో పౌర సేవలను అందించలేకపోయారు. పంచాయతీరాజ్ సంస్థల వార్షిక వద్దుల ముగింపును చేయకపోవడం, కార్యకలాపాలను నవీకరించకపోవడంతో స్థానిక వ్యయం పాలనా సంస్థల్లో పరిపాలనను మెరుగు పరచాలన్న లక్ష్యం నెరవేరలేదు. పంచాయతీరాజ్ సంస్థల్లో చాలాచోట్ల, ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన కంప్యూటర్ సిస్టంలను ఏర్పాటుచేయకపోవడంతో ఈ ప్రాజెక్టు సరిగా అమలు కాలేదు.
ఈస్టరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ హామీ, ఎపిఇఆర్‌సి సమ్మతి లేకపోయినప్పటికీ, సింగిల్ బల్బు రాయితీ కొనసాగిస్తుండడం వలన రూ.13.24 కోట్ల ఆదాయ నష్టం.
సరస్ ఏవియేషన్ సర్వీసెస్ సంస్థ ప్రయాణపు సమయంపై ఆంధ్రప్రదేశ్ విమానయాన కార్పొరేషన్ లిమిటెడ్ సరైన అంచనా లేకుండా హెలికాప్టర్ అద్దెకు తీసుకొనడం వలన రూ.14.33 కోట్లు ఆ సంస్థకు చెల్లించింది. అద్దెకు తీసుకున్న వారి దగ్గర నుంచి అద్దె వసూలు చేయకపోవడం వలన కంపెనీ ఆదాయ మూలాన్ని (వనరు) కోల్పోయింది.
2014-15 సంవత్సరానికి రెస్టారెంట్లు, బార్‌లలో అదనపు మద్య సేవన ప్రదేశాలకు 36.9 లక్షల అదనపు లైసెన్స్ రుసుం విధించలేదు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులకు సంబంధించి 1998లో పేర్కొన్న నియతకాలిక మార్కెట్ విలువల సవరణను రిజిస్ట్రేషన్ శాఖ పాటించలేదు.
మార్కెట్ విలువలు తప్పుగా స్వీకరించటం, ఆస్తుల విలువ కూడా తక్కువగా లెక్కించటం కారణంగా 2.95 కోట్ల మేర తక్కువగా సుంకాలను విధించారు. 78 దస్తావేజుల్లో ఆస్తుల విలువ తక్కువగా లెక్కగట్టిన ఫలితంగా ఐదు జిల్లా రిజిస్ట్రార్లు, 30 సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిలో 2.68 కోట్ల రూపాయల మేర స్టాంపు డ్యూటీ తక్కువగా విధించినట్లు తేలింది.
పటిష్టమైన ఆర్థిక నిర్వహణకు ముందస్తు ప్రణాళిక, రాబడులు-వ్యయాల కచ్చితమైన అంచనాలు ఉండాలి. ఈ ఏడాది కేటాయింపులను మించి ఖర్చు చేసిన సందర్భాలూ, కేటాయించిన నిధులు ఖర్చు కాకుండా భారీగా మిగుళ్ళు ఏర్పడిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని పద్దుల కింద రూ.16,375.88 కోట్ల మిగుళ్ళు ఏర్పడ్డాయి. మరికొన్ని పద్దుల కింద కేటాయింపులను మించి జరిగిన రూ.36,856.98 కోట్ల అధిక ఖర్చు మిగుళ్లను భర్తీచేసిన ఫలితంగా, 2015-16లో మొత్తంమీద 20,481.10 కోట్ల రూపాయల అధిక వ్యయం జరిగింది.