రాష్ట్రీయం

అసంతృప్తి సెగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 1:మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి, ఆగ్రహజ్వాలలకు దారితీస్తోంది. ఎప్పటినుంచో జెండాను మోసి, పార్టీ టికెట్‌పై గెలిచిన వారిని కాదని, వైసీపీ నుంచి వచ్చిన వారికి పట్టం కడుతున్నారంటూ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి స్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు నేతలు నేరుగా చంద్రబాబునాయుడు వద్దే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు తమ జిల్లా ఇంచార్జి మంత్రుల వద్ద నిరసన వెళ్లగక్కారు. కొత్త క్యాబినెట్‌పై కసరత్తు చేస్తున్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుకు సీనియర్ల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ నుంచి గెలిచి తెదేపాలో చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై సొంత జిల్లాల్లో అసంతృప్తి, ఆగ్రహంగా మారి, అది జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాస్‌ను తాకింది. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారని తెలుసుకున్న కడప జిల్లా నేతలు, హుటాహుటిన విజయవాడలోని గంటా ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆదినారాయణరెడ్డి చేరికను ఆది నుంచీ వ్యతిరేకిస్తున్న మాజీ
మంత్రి రామసుబ్బారెడ్డి పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఉగ్రరూపం దాల్చారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అయితే, అంతకుముందే మంత్రి గంటాతో మాట్లాడిన బాబు.. రామసుబ్బారెడ్డికి ఆర్టీసీ చైర్మన్ ఇస్తామన్న విషయాన్ని ఆయనకు చెప్పాలని సూచించారు. అదే విషయం రామసుబ్బారెడ్డి వద్ద గంటా ప్రస్తావించగా ‘నాకు అవేమీ వద్దు. నాకూ ఆత్మగౌరవం ఉంద’ని ఆయన తిరస్కరించారు.
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కూడా బాబు నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యేనయిన తనను కాదని, ఆదినారాయణరెడ్డికి ఎలా ఇస్తారని గంటాను నిలదీశారు. జిల్లా నేతలు లింగారెడ్డి, సతీష్‌రెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం తెలిసిన బాబు.. ఎంపి సీఎం రమేష్‌కు వారిని బుజ్జగించే పని అప్పగించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మేడా పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేను తాను కాబట్టి తనకు ఇవ్వాలని అడిగానని, అయితే బాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తర్వాత అంతా బాబు వద్దకు వెళ్లిన సందర్భంగా ఆయన వారిని బుజ్జగించారు. జిల్లాలో జగన్‌ను ఎదుర్కోవలసి ఉందని, అందువల్ల అంతా కలసి పనిచేయాలని, ఎవరి గౌరవం వారికి ఉంటుందని హామీ ఇచ్చారు. అయినా ఎవరూ సంతృప్తి చెందినట్లు కనిపించలేదు.
ఇక శ్రీకాకుళం జిల్లా సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ కూడా పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది. బాబు వద్ద కూడా సరైన స్పందన లేకపోవడంతో తాను, జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తన కుమార్తె రాజీనామా చేస్తామని చెప్పారు. దానితో బాబు మంత్రి అచ్చెన్నాయుడును ఆయన వద్దకు బుజ్జగింపులకు పంపించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొగిడిన నాయకత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
విజయనగరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వైసీపీ నుంచి వచ్చిన సుజయ కృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారంపై అక్కడి ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా కేంద్రమంత్రి, జిల్లాకు పెద్ద దిక్కయిన అశోక్‌గజపతి రాజు అభిప్రాయంతో నిమిత్తం లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వవద్దని ఎమ్మెల్యేలు అప్పలనాయుడు, మీసాల గీత, కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి ఇప్పటికే బాబుకు స్పష్టం చేశారు. ఓసీ అయిన సుజయకు ఇస్తే బీసీలు దూరమవుతారని, ఆయనకు తప్ప ఎవరికిచ్చినా ఫర్వాలేదని బాబుకు స్పష్టం చేశారు. అయితే, అశోక్‌గజపతిని సంప్రదించకుండానే సుజయకృష్ణకు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

చిత్రం..విజయవాడలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లు