రాష్ట్రీయం

బీసీల్లో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9:అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబిసి) కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బిసి వర్గాల్లో కలకలం రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న తమ జనాభాలో అనైక్యత తీసుకువచ్చి రాజకీయంగా తమ మధ్య చిచ్చు పెట్టడానికే ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారంటూ బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. బడ్జెట్‌లో బిసి కార్పొరేషన్‌కు నయా పైసా కేటాయించకుండా ఎంబిసి కార్పొరేషన్‌కు మాత్రం వెయ్యి కోట్లు కేటాయించడంతో తమ వర్గానికి నిధులు కేటాయించినట్టా? లేనట్టా? అనే గందరగోళ పరిస్థితి ప్రస్తుతం బిసి వర్గాల్లో నెలకొంది. ఇదే విషయమై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశ్నించారు. ఎంబిసికి కేటాయించిన వెయ్యి కోట్ల పరిధిలోకి ఏయే కులాలు వస్తాయో తేలిన తర్వాత ఆ కులాలకు పోను మిగిలిని నిధులు బిసి వర్గాలకే చెందుతాయని ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. ప్రభుత్వ వాదన బిసి వర్గాలను మరింత గందరగోళ పరిస్థితిలోకి నెట్టేసిందని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటుతో భవిష్యత్‌లో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన (ఎంబిసి) వర్గాల మధ్య వర్గీకరణ చిచ్చు రాజేస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిసిలలో ఇప్పటికే ఎ,బి,సి,డి,ఇ అంటూ ఐదు గ్రూపులు చట్టబద్ధత కలిగి ఉన్నాయి. వీరికి విద్యా ఉద్యోగ అవకాశాలలో ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ప్రామాణికంగా రూపొందించిన వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బిసిలలో చట్టబద్ధత కలిగిన వర్గీకరణను పక్కన పెట్టి ప్రభుత్వం కొత్తగా బిసి, ఎంబిసి పేరిట పరోక్షంగా రెండు గ్రూపులను వర్గీకరించింది. ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఇకనుంచి బిసిలలో ఉన్న ఐదు గ్రూపులు కాకుండా బిసి, ఎంబిసి అనే రెండు గ్రూపులు మాత్రమే ఉండబోతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ఎంబిసిలోని కులాలన్నీ బిసి ‘ఎ’ గ్రూపులో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ లెక్కన బడ్జెట్‌లో కేటాయించిన వెయ్యి కోట్లు బీసీల్లోని ‘ఎ’ గ్రూప్‌నకు మాత్రమే
వర్తించనుండగా, మిగిలిన బి, సి, డి, ఇ గ్రూపుల్లోని కులాల సంగతి ఏమిటన్నది వౌలిక ప్రశ్న. కాగా బిసి బి గ్రూపులోని గౌడ, పద్మశాలి కులాలు మినహాయించి మిగిలిన కులాలన్నీ ఎంబిసి పరిధిలోకి వస్తాయని ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం బిసి బి గ్రూపులోని మిగతా కులాలను ఎ గ్రూపులో చేర్చాలన్నది ప్రభుత్వ ఆలోచన కావచ్చు. దీనికి ఎ గ్రూప్ అంగీకరిస్తుందా? తమ గ్రూపులో కొన్ని కులాలను మాత్రమే ఎంబిసిలుగా గుర్తించి తమను వదిలేయడానికి బిసి సామాజిక వర్గాల్లో బలమైన వర్గాలైన గౌడ, పద్మశాలి కులాలు అంగీకరిస్తాయా? అన్నది ప్రస్తుతం బిసి వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎంబిసిలో చేర్చబోయే కులాలను ఏ ప్రాతిపాదికన గుర్తిస్తారు? వీరి సామాజిక, ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఎంత కాలం పడుతుంది? ఈ అధ్యయనానికి బిసి కమిషన్‌కు చాలినంత వ్యవస్థ ఉందా? అన్నవి ప్రధానమైన సమస్యలు. బిసి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి గడిచిన మూడు సంవత్సరాలుగా మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం కొత్తగా ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆర్ కృష్ణయ్య నిలదీస్తున్నారు. ఎస్‌సి వర్గీకరణ పేరుతో మాదిగ, మాల కులాల మధ్య చిచ్చు రేగినట్టుగానే, ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు బిసి కులాల మధ్య చిచ్చు రాజేయబోతోందా అని బిసి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇలా ఉండగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటున్న ప్రభుత్వం వీరికి బిసిల కోటాలోనే సర్దుబాటు చేయాలని యోచిస్తుంది. ఇప్పటికే బిసి ఇ గ్రూపులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొన్ని కులాలు ఉన్నాయి. బిసీల కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బిసి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిసిలకు అన్యాయం జరుగకుండా ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు కల్పించబోతున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా, ఇది ఎలా సాధ్యమని బిసి సంఘాల ప్రశ్నిస్తున్నాయి.