రాష్ట్రీయం

మండే ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అత్యధికంగా నమోదవుతున్నాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 43 డిగ్రీలకు చేరుకుంటే, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు అత్యధిక ఉష్ణోగ్రతలు చేరాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో వేడిగాడ్పులు వీస్తున్నాయి. గత రెండు రోజుల పరిస్థితి పరిశీలిస్తే రోజూ ఒక డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. వేడిగాడ్పులకు తట్టుకోలేక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సోమవారం అందిన సమాచారం ప్రకారం ఏపీలోని కర్నూలు, కడపలలో 43 డిగ్రీల సెల్సియస్ నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి వివరించారు. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, రామగుండంలలో 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. సాధారణ ఉష్ణోగ్రతకన్నా ఇవి మూడు డిగ్రీలు అధికమని వైకె రెడ్డి తెలిపారు. ఉష్ణోగ్రత పెరుగుదల ఒకటి రెండు రోజులు కొనసాగే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతకన్నా మూడు డిగ్రీలు అధికంగా నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణంగా ఈ సమయంలో 37 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 40 డిగ్రీలకు చేరుకుంది. అలాగే భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 41 డిగ్రీలు, హన్మకొండ, నల్లగొండలలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో తేమశాతం సాధారణం కన్నా తక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంది. ఏపీలోని అరకులోయలో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదుకాగా, తెలంగాణలోని ఏ జిల్లాలోనూ సోమవారం వర్షంకాని జల్లులుకాని నమోదు కాలేదని ఐఎండి ప్రకటించింది.
ఉభయ రాష్ట్రాల్లో వేడిగాడ్పులు ప్రారంభం కావడం, ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో రెండు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం పనివేళల్లో మార్పులు, చేర్పులు చేపట్టారు. జిల్లాల్లో వాతావరణ పరిస్థితి, ఎండలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జిల్లా కలెక్టర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని అధ్యయనం చేస్తున్నారు. ఎండలు ఇంకా ఎక్కువైతే ఏంచేయాలన్న అంశంపై ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నారు. తీవ్రమైన ఎండలు నమోదయ్యే ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమావళికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఇప్పటికే సూచనలు వెళ్లాయి. తీవ్రమైన ఎండలవల్ల మరణాలు లేకుండా పత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాఉండగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి, వరంగల్, కర్నూలు తదితర నగరాలు, పట్టణాల్లోని రద్దీ ప్రదేశాల్లో ప్రైవేట్ సంస్థలు, ఛారిటబుల్ సంస్థలు, దాతలు ‘చలివేంద్రాల’ను ఏర్పాటు చేస్తున్నారు. సత్యసాయి సంస్థలు, హైదరాబాద్‌లోని నిర్దోష్ తదితర సంస్థలు పెద్దఎత్తున చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండే కొంతమంది దాతలు కూడా చలివేంద్రాలను ప్రారంభించారు.