రాష్ట్రీయం

దుబాయి అడ్డాగా బంగారం స్మగ్లింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: దుబాయిలో తిష్ఠవేసిన చైనా, ఇథియోఫియా స్మగ్లింగ్ ముఠాలు తెలుగు రాష్ట్రాలకు యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్ కోసం ఈ ముఠాలు తెలుగు రాష్ట్రాలకు తిరిగి వెళుతున్న వలస కార్మికులనే సాధనంగా వాడుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై విమానాశ్రయంలో అనేకసార్లు కస్టమ్స్ తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం బయటపడి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. బంగారం ఏ స్థాయిలో రవాణా జరుగుతోందంటే ఒక్క రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఈ ఏడాది ఇప్పటివరకు 18 కేసులు నమోదు చేశారు. కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ నిఘా నేత్రాల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు చేయని ప్రయత్నం లేదు. దుబాయిలోని ఈ ముఠాలు అక్కడ స్థానికంగా ఉన్న పరిచయాలతో తెలుగు రాష్ట్రాలకు వస్తున్న వలస కార్మికులను ఎంచుకుని వారికి రకరకాల పార్సిళ్ల రూపంలో బంగారం అందజేస్తున్నారు. తమ వాళ్లు ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చి ఈ పార్సిల్ తీసుకుంటారని చెప్పి అప్పగిస్తున్నారు. కొందరు ఏమీ తెలియకుండా అమాయకంగా తీసుకుని వస్తుంటే మరికొంతమంది స్మగ్లర్లు ఇచ్చే డబ్బుకు ఆశపడి తీసుకువస్తూ కస్టమ్స్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోతున్నారు. ఇటీవల దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని తనిఖీ చేసిన కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు షాక్ అయ్యారు. అతని లగేజీ తనిఖీ చేస్తే ఎలక్ట్రిక్ ఇస్ర్తి పెట్టె కనిపించింది. అనుమానం వచ్చి మొత్తం విప్పి చూస్తే దాదాపు 7 లక్షల విలువైన 247 గ్రాముల బరువైన బంగారు బిస్కెట్లు ప్యాకింగ్‌లో ఉన్నాయి. ఇలా సెల్‌ఫోన్ బ్యాటరీలు, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లోకూడా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ ముఠాలు హైదరాబాద్‌లోని పాతబస్తీ, ఉత్తర తెలంగాణ జిల్లాల వాసులు, ఆంధ్రప్రదేశ్‌లో ఉభయగోదావరి, కడప జిల్లాలకు వచ్చే దుబాయి వలస కార్మికులతో తమ స్మగ్లింగ్ దందా కొనసాగిస్తున్నట్లు అధికార వర్గాలు గుర్తించినట్లు సమాచారం. నమోదైన కేసుల్లో 40 శాతం ఈ ప్రాంతాల వారే నిందితులుగా ఉంటున్నారు. బంగారం బిస్కెట్లను థిన్ ఫాయిల్స్‌లో ప్యాకింగ్ చేసి కస్టమ్స్ స్కానర్లకు దొరక్కుండా ముఠాలు జాగ్రత్తపడుతున్నాయి. డిఆర్‌ఐ, కస్టమ్స్ ఇంటరాగేషన్‌లో పట్టుబడిన వారికి తమ వద్ద ఉన్న పార్సిల్‌లో ఏముందో కూడా తెలియని వాళ్లు ఉంటున్నారు.
ఇదిలా ఉంటే పట్టుబడిన బంగారానికి కస్టమ్స్, డిఆర్‌ఐ అధికారులు విధించే జరిమానా తప్పకుండా చెల్లించాల్సిందే. 20 లక్షలు లేదా అంతకు మించి విలువైన బంగారంతో పట్టుబడితే బంగారం విలువలో 20 శాతం జరిమానా విధింపుతో పాటు కస్టమ్స్ చట్టం కింద స్మగ్లర్‌ను అరెస్టు చేస్తారు.
అదే 5 లక్షల నుంచి 20 లక్షల లోపు విలువైన బంగారంతో పట్టుబడితే కస్టమ్స్ అదనపు కమిషనర్ స్థాయి అధికారి కేసు నమోదు చేసి జరిమానా విధిస్తారు. అలాగే రూ.5 లక్షల లోపు అయితే దొరికిన బంగారం విలువలో 70 శాతం జరిమానా, కస్టమ్స్ డ్యూటీ కలిపి విధిస్తారు. ఇలా దుబాయి కేంద్రంగా కొనసాగుతున్న విదేశీ స్మగ్లింగ్ ముఠాల వలలో పడకుండా అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చే వలస కార్మికులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.