రాష్ట్రీయం

రైల్వేలో అభివృద్ధి పనుల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. ద.మ.రైల్వేకి కొత్త జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన వికె యాదవ్ వివిధ విభాగాల్లో కొనసాగుతున్న పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు దక్షిణ మధ్య రైల్వేపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం వల్ల ముఖ్యంగా టెండర్ల ప్రక్రియ వేగంగా జరిగి వౌలిక అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగేందుకు వీలు కలిగింది. ద.మ.రైల్వే తెలిపిన సమాచారం ప్రకారం గత ఏడాది చేపట్టిన రికార్డు స్థాయి 168.5 కి.మీ దూరం కొత్త రైల్వే లైన్ల నిర్మాణం చెప్పుకోదగినదిగా నిలిచింది. దీనిలో 140.3 కి.మీ కొత్త లైను, 28.2 కి.మీ దూరం డబ్లింగ్ లైన్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ కొత్తలైన్ నిర్మాణంలో 91.4 కి.మీ దూరం తెలంగాణలో ఉంది. రూ.926 కోట్ల వ్యయంతో నిజామాబాద్-కరీంనగర్-పెద్దపల్లి కొత్త లైన్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుంతకల్-వాడి డబ్లింగ్ పనుల్లో భాగంగా మంత్రాలయం-మట్‌మర్రి 11.15 కి.మీ కొత్త లైను, కడప-బెంగళూరు కొత్త లైన్ ప్రాజెక్టులో భాగమైన 21 కి.మీ కడప-పెండ్లిమర్రి లైన్, నంద్యాల-ఎర్రగుంట్ల మధ్య చివరి స్ట్రెచ్ 28 కి.మీ కొత్త లైను పూర్తి చేసింది. ఈ రూట్లో బనగానపల్లి-నంద్యాల మధ్య కొత్త రైలు సర్వీస్ కూడా ప్రారంభమైంది. గుంతకల్లు-కల్లూరు డబ్లింగ్ పనులు, నడికుడి- శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ పనులు గత ఏడాది చేపట్టడం జరిగింది. హైదరాబాద్-కరీంనగర్‌ను కలుపుతూ మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు.
దేశ వ్యాప్తంగా రైల్వే పరిధిలో గత ఏడాది 2013 కి.మీ దూరం విద్యుదీకరణ పనులు పూర్తయితే, దానిలో 470 కి.మీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంది. గుంతకల్లు-డోన్ మధ్య 29 కి.మీ, వాడి-రాయచూర్ మధ్య 107.65 కి.మీ, నాన్‌చర్ల-మంత్రాలయం రోడ్‌లో 87 కి.మీ, నల్లపాడు-కంభం మధ్య 164.5 కి.మీ, పెండేకల్లు-గుత్తి మధ్య 28 కి.మీ దూరం విద్యుదీకరణ పూర్తయ్యింది. మనిషి కాపలా లేని 149 లెవెల్ క్రాసింగ్‌లను తొలగించగా, కాపలా ఉన్న 31 లెవెల్ క్రాసింగ్‌లను మూసివేసినట్లు ద.మ.రైల్వే వెల్లడించింది. సరుకు రవాణాకు ఉద్దేశించిన టెర్మినల్స్ దేశ వ్యాప్తంగా 45 చేపట్టగా, వాటిలో ద.మ.రైల్వేలో ఆరు టెర్మినళ్లు ఉన్నాయి. బనగానపల్లి, శంకరపల్లి, నర్సింగ్‌పల్లిలో టెర్మినల్స్ పూర్తి కాగా, బుగ్గనపల్లి, జాన్‌పహాడ్, తాండూరుల్లో పనులు జరుగుతున్నాయి.