రాష్ట్రీయం

జిఎస్‌టితో మనకు లాభమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టం వల్ల మన రాష్ట్రానికి లాభమేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాసనసభలో ఆదివారం ఆయన స్టేట్ జిఎస్‌టి బిల్లును ముఖ్యమంత్రి తరఫున ప్రవేశపెడుతూ, వ్యవసాయ ఉత్పత్తులపై జిఎస్‌టి ఉండబోదని స్పష్టం చేశారు. ప్రపంచంలో 196 దేశాలు ఉండగా, 160 దేశాల్లో ఈ తరహా చట్టం అమల్లో ఉందని పేర్కొన్నారు. ‘ఒక దేశం-ఒకే పన్ను-సింగిల్ మార్కెట్’ విధానం జిఎస్‌టి వల్లనే సాధ్యమన్నారు. ప్రస్తుతం ఒక రాష్ట్రంలో ఒక తరహాపన్ను, మరొక రాష్ట్రంలో ఇంకొక తరహా పన్ను విధానం అమల్లో ఉందన్నారు. కేంద్రం విధిస్తున్న పన్నులు, రాష్ట్రం విధిస్తున్న పన్నుల వల్ల వినియోగదారుడిపై అధికభారం పడుతోందన్నారు. ఈ విధానానికి స్వస్తి చెప్పేందుకు జిఎస్‌టి వీలుకల్పిస్తుందని వివరించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలు, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం జిఎస్‌టి పరిధిలోకి రాబోవన్నారు. ఈ రెండింటి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 48 శాతం సమకూరుతోందన్నారు. అందువల్ల ఈ రెండింటిని జిఎస్‌టి పరిధి నుండి మినహాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, అలాగే ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని కోరాయని గుర్తు చేశారు.
జిఎస్‌టి బిల్లును తెచ్చేందుకు 2000 సంవత్సరంలో ఎన్‌డిఎ ప్రభుత్వం, ఆ తర్వాత యుపిఎ-1, యుపిఎ-2 ప్రభుత్వాలు ప్రయత్నించాయని, ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసిందన్నారు. రాష్ట్రాలు కూడా తమతమ చట్టసభల్లో ఈ బిల్లును ఆమోదించాల్సి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ చట్టం అమలుకు సంబంధించి జిఎస్‌టి కౌన్సిల్ (కేంద్రం-రాష్ట్రాలు కలిసి) ఉందని, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఒక కమిటీ ఉందన్నారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం (2015-16 ఆధారంగా తీసుకుని) తగ్గితే ఆ మేరకు కేంద్రం భర్తీ చేసేందుకు అంగీకరించిందని ఈటల గుర్తు చేశారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యాట్, ఎంటర్‌టైన్‌మెంట్ పన్ను, వాహనాల ఎంట్రీపన్ను, సరుకులపై పన్ను, విలాసపన్ను, గుర్రాల రేసు-పందెం చట్టం, గ్రామీణాభివృద్ధి చట్టం, ప్రకటన పన్నులు స్టేట్ జిఎస్‌టి పరిధిలోకి వస్తాయని వివరించారు. జిఎస్‌టి అమల్లోకి వస్తే పన్ను ఎగవేత తగ్గిపోతుందని పేర్కొన్నారు. మన రాష్ట్రం వినియోగ రాష్ట్రం (కన్స్యూమర్ స్టేట్) కావడం వల్ల జిఎస్‌టి వల్ల తెలంగాణ ప్రభుత్వానికి లాభమేనని వివరించారు. ఎస్‌జిఎస్‌టి అమల్లోకి వచ్చే ముందే అందరితో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నియమావళి ఉండేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
జిఎస్‌టిలో నాలుగు శ్లాబులు (5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) ఉన్నాయని, ఇన్ని శ్లాబుల్లో పన్ను వసూలు చేయడం సరైంది కాదని, ఒకే శ్లాబు ఉండాలని కాంగ్రెస్ సభ్యుడు జి.చిన్నారెడ్డి పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై జిఎస్‌టి లేదన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చే ముందు అందరితో చర్చించి, ఎలాంటి లొసుగులు లేకుండా నియమావళిని రూపొందించాలని ఆయన సూచించారు. ఆ తర్వాత ఎస్‌జిఎస్‌టి బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.