తెలంగాణ

అక్కడంతా ‘ఓపెన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, ఏప్రిల్ 17: నిజాబాద్ జిల్లా బాన్సువాడలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ పరీక్షల్లో చూచిరాతల పర్వం బాహాటంగానే సాగుతోంది. గైడులు ముందు పెట్టుకుని మరీ విద్యార్థులు సమాధానాలు రాస్తున్న చిత్రాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈనెల 17 నుంచి 27 వరకు ఓపెన్ పరీక్షలు జరుగనుండగా, తొలిరోజైన సోమవారం నుంచే చూచిరాతల పర్వం మొదలైంది. కాపీయింగ్‌ను నిరోధించాల్సిన బాధ్యత విస్మరించి పలువురు ఇన్విజిలేటర్లే గైడులు సమకూరుస్తూ విద్యార్థులతో పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు, పదవ తరగతి పరీక్షలను బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రభుత్వ హైస్కూల్‌లో నిర్వహిస్తుంన్నారు. అయతే, కొన్ని పరీక్షా కేంద్రాల్లో బయట నుండి గేట్లు మూసివేసి, లోపల నిర్భీతిగా చూచిరాతల తతంగాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షల్లో కాపీయింగ్‌కు సహకరించేందుకు ఒక్కో విద్యార్థి నుంచి పరీక్ష ఫీజులుపోను అదనంగా రెండు వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అడ్మిషన్ల సమయంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత ఫీజు రుసుము కంటే 500 నుంచి వెయ్య రూపాయల వరకు ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్టు సమాచారం. పరీక్షా కేంద్రాల వద్ద నకలు చీటీలు అందించేందుకు విద్యార్థుల కుటుంబీకులు, బంధువులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని వారించకుండా ఇన్విజిలేటర్లు కూడా తమవంతు తోడ్పాటు అందించడం చర్చనీయాంశమైంది. ఇక మరో పరీక్షా కేంద్రంలోనైతే ఏకంగా ప్రశ్నపత్రం బయటకు తెచ్చుకుని వాటి సమాధానాలను వెతికి మరీ విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి చేరవేశారు. రెగ్యులర్ విద్యాభ్యాసానికి అవకాశం లేని వారు, అర్ధాంతరంగా చదువు మానివేసిన వారు, కింది తరగతుల్లో ఫెయిలైన వారు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో దిగువ స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం వారు ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ కోర్సులను పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానం ద్వారా పరీక్షలను నిర్వహిస్తోంది. దీన్ని వెసులుబాటుగా తీసుకుని అనేకమంది కాపీయింగ్ పైనే ఆధారపడి ఓపెన్ విధానం ద్వారా ఎంతో సులభంగా ఎస్సెస్సీ, ఇంటర్ సర్ట్ఫికెట్లను పొందగల్గుతున్నారు. రెగ్యులర్ పరీక్షల్లో ఈ తరహా మాస్ కాపీయింగ్, చూచిరాతల పర్వానికి అంతగా ఆస్కారం లేకపోవడాన్ని గమనించిన కొంతమంది రెగ్యులర్ విద్యార్థులు కూడా ఓపెన్ విధానం ద్వారానే ఎస్సెస్సీ, ఇంటర్ కోర్సులను పూర్తి చేసేందుకు అడ్డదారిగా ఉపయోగించుకుంటున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు. దీనివల్ల కష్టపడి చదివే రెగ్యులర్ విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని, చదువులో ఏమాత్రం ప్రతిభ లేనప్పటికీ సర్ట్ఫికెట్లు సమకూర్చుకుని ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, పదోన్నతుల్లో తమతో పోటీకి వస్తున్నారని పలుము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ తరహాలోనే ఈ పరీక్షలనూ పకడ్బందీగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ప్రతి ఏటా చూచిరాతల పర్వం షరా మామూలుగా కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చిత్రం.. బాన్సువాడ పట్టణంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులు.
కేంద్రాల్లో బాహాటంగానే కొనసాగుతున్న చూచిరాతల పర్వం