ఆంధ్రప్రదేశ్‌

టిడిపికి ఉపసెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల సీటు వెరీ హాటు బాబును కలిసిన అఖిల, శిల్పా బ్రదర్స్
24న అభ్యర్థిని ప్రకటిస్తామని అఖిల ఏకపక్ష ప్రకటన
పోటీ ఖాయమని తేల్చి చెప్పిన శిల్పా సీటు ఇవ్వకపోతే వైసీపీలోకి..

అమరావతి, ఏప్రిల్ 19: నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిలా పరిణమించింది. మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి మధ్య జరుగుతున్న అధిపత్యపోరు చివరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వరకూ వెళ్లింది. తనకు టికెట్ ఇవ్వకపోతే వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న శిల్పా మోహన్‌రెడ్డి అందుకు ఈనెల 21న ముహుర్తంగా నిర్ణయించుకున్నారు. ఇది తెలియడంతో అప్రమత్తమైన పార్టీ అధినేత.. సీనియర్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి శిల్పాతో మాట్లాడి సమస్యను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. దానితో సోమిరెడ్డి బుధవారం ఉదయం శిల్పా నలుగురు సోదరులను తన ఇంటికి అల్పాహారానికి పిలిచి, సమస్యలు విచారించారు. ఆ సందర్భంగా సీటు తనకే ఇవ్వాలని, గత ఎన్నికల్లో కూడా తానే పోటీ చేసినందున ఈసారి కూడా తనకే ఇవ్వటం న్యాయమని శిల్పా సోదరులు వివరించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమాను ఎదుర్కొన్న తాను, బాబు హామీ మేరకు నాగిరెడ్డి పార్టీలో చేరినా వౌనంగానే ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు నాగిరెడ్డి లేనందున స్థానికంగా ఉన్న తమ కుటుంబానికే సీటు ఇవ్వాలని వాదించారు. మంత్రి అయిన వెంటనే అఖిల తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. తాను మళ్లీ పోటీ చేయకపోతే తమ ఉనికి ఉండదని, తనపైనా కార్యకర్తల ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని, వారిని కాదని తాము సొంత నిర్ణయాలు తీసుకోలేమని వారు సోమిరెడ్డికి వివరించారు. అయితే, ఆవేశంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, తాను పార్టీ అధినేత దృష్టికి సమస్యను తీసుకువెళతానని సోమిరెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. నంద్యాలలో పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని బాబు కూడా చెప్పారని శిల్పాకు నచ్చచెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్డుబడి ఉండాలని సూచించారు. ఆ తర్వాత శిల్పా సోదరులతో తన భేటీ వివరాలను సోమిరెడ్డి పార్టీ అధినేతకు వివరించారు.
ఈలోగా విజయవాడలో పున్నమిఘాట్‌ను పరిశీలించిన మంత్రి భూమా అఖిలప్రియ అక్కడ మీడియాతో మాట్లాడుతూ చేసిన ప్రకటన సమస్యను మరింత జటిలం చేయడంతోపాటు, శిల్పా సోదరులను రెచ్చగొట్టినట్టయింది. నంద్యాలలో తమ కుటుంబమే పోటీ చేస్తుందని, ఈనెల 24న అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె చేసిన ప్రకటనతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని కూడా చెప్పారు. దీనిపై పార్టీ నాయకత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
తర్వాత వేదిక ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. శిల్పా సోదరులు, బాబు మాట్లాడుతుండగానే మంత్రి అఖిల అక్కడకు చేరుకున్నారు. అయితే శిల్పా సోదరులు అక్కడున్న విషయం తనకు తెలియదని, తాను నంద్యాల సీటు గురించి మాట్లాడేందుకు రాలేదని, పర్యాటక శాఖ అంశాలు చర్చించేందుకు వచ్చానని తర్వాత అఖిల మీడియాకు చెప్పారు.
కాగా రాత్రి పదిన్నర వరకూ బాబుతో సుదీర్ఘంగా భేటీ అయిన శిల్పా సోదరులు స్థానికంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోటీ చేయకపోతే క్యాడర్‌పరంగా వచ్చే సమస్యలను బాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఉప ఎన్నికలో తమకే అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా శిల్పా సోదరులు పట్టుపట్టినట్లు సమాచారం. భూమా కుటుంబంలోనే విభేదాలున్నాయని, పైగా నాగిరెడ్డి మృతి తర్వాత ఆ వర్గం బలం కోల్పోయిందని, అఖిల తమ పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారని కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఎట్టి పరిస్థితిలోనూ తాను పోటీ చేసి తీరతానని వారు బాబుకు స్పష్టం చేసినట్లు తెలిసింది. తాను క్యాడర్ మాట వినకతప్పదని, వారి మనోభావాలకు భిన్నంగా వ్యవహరించలేనని, వారిని పోగొట్టుకోలేనని, ఈ విషయంలో మీరే సానుకూల నిర్ణయం తీసుకోవాలని బాబుతో అన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా బాబు శిల్పా సోదరుడైన శిల్పా చక్రపాణికి మండలి చైర్మన్ ఇస్తానని ఆఫర్ చేసినా దాన్ని కూడా తిరస్కరించినట్టు సమాచారం. మీరు నా బ్రదర్‌కు చైర్మన్ పదవి ఇచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే క్యాడర్ చెదిరిపోతుంది. ఈ విషయంలో ఇక నిర్ణయం మీదే. నేనైతే క్యాడర్‌ను కాదని ఏ నిర్ణయం తీసుకోనని ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజుల్లో చర్చించి నిర్ణయం చెబుతానని, ఈలోగా ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బాబు చెప్పినట్లు తెలిసింది. మొత్తంగా బాబుతో శిల్పా భేటీ ఆశించినంత సంతృప్తినివ్వలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. భూమా కుటుంబానికే సీటు ఇచ్చేందుకు బాబు సుముఖంగా ఉన్నట్లు ఆయన వైఖరి చాటిందని వెల్లడించారు.
కచ్చితంగా పోటీ చేస్తా: శిల్పా
కాగా బాబుతో చర్చించి బయటకు వచ్చిన శిల్పా తాను ఉప ఎన్నికలో నూటికి నూరు శాతం బరిలో ఉంటానని మీడియా వద్ద ఖరాఖండీగా చెప్పారు. క్యాడర్‌ను పోగొట్టుకోలేనని, ఇదే విషయాన్ని, తన నిర్ణయాన్ని బాబుకు చెప్పానని, నాలుగురోజుల్లో నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానన్నారు. ‘నేను క్యాడర్‌ను పోగొట్టుకోలేను. నంద్యాల సీటు టిడిపిది. నేను సంప్రదాయాన్ని పక్కకుపెట్టడం లేదు. అభ్యర్థిత్వంపై అఖిల చేసిన వ్యాఖ్య ఆమె వ్యక్తిగతం. నా సోదరుడికి మండలి చైర్మన్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే సీటివ్వకపోతే క్యాడర్ ఎలా సహిస్తుంది?’ అని శిల్పా ప్రశ్నించారు.