రాష్ట్రీయం

ఈ రాజ్యం రైతన్నదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేస్తామని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్ఘాటించారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే కాదు, రైతును రాజును చేసి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచి దేశంలోనే సంపన్న రైతులుగా చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీ సందర్భంగా శుక్రవారం కొంపల్లి ఏజిఆర్ గార్డెన్స్‌లో వేలాది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. తొలుత కెసిఆర్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ప్లీనరీ వేదికపై వ్యవసాయం, రైతుల బాగోగులూ ప్రధాన ఎజెండాగా ప్రసంగించిన కెసిఆర్, రైతులకు మరో వరం ప్రకటించారు. ఎరువుల కొనుగోలుకు ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఇటీవలే ప్రకటించిన ముఖ్యమంత్రి, తాజాగా రెండు పంటలకు (ఖరీఫ్, యాసంగి) నాలుగేసి వేల చొప్పున ఎనిమిది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. పలు అంశాల్లో భారతదేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కోసం సాయం అందించడమే కాదు... రైతును రాజుగా చేసేందుకు రైతు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ‘చెత్తకుండీల్లో ఇనుప ముక్కలు ఏరుకునే వారికి కూడా సంఘాలు ఉన్నాయి. అలాంటిది రైతులకు సంఘాలు లేకపోవడం దురదృష్టకరం. ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వమే గ్రామ స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేస్తుంది. గ్రామ సంఘాలన్నీ కలిసి మండల సమాఖ్యలుగా, అవన్నీ కలిసి జిల్లా సమాఖ్యలుగా ఏర్పడతాయి. జిల్లా సమాఖ్యలన్నీ కలిసి రాష్ట్ర రైతు
సమాఖ్య ఏర్పడుతుంది’ అని కెసిఆర్ వివరించారు. వచ్చే బడ్జెట్‌లో రైతు సమాఖ్యకు రూ.500 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. రివాల్వింగ్ ఫండ్‌తోపాటు రైతు పంట అమ్మినప్పుడు క్వింటాలుకు రూపాయో, రెండు రూపాయలో వసూలు చేసి రివాల్వింగ్ ఫండ్‌లో జమ చేయనున్నట్టు చెప్పారు. రెండు మూడేళ్లలో రెండు, మూడు వేల కోట్ల రూపాయల నిధి సమకూరుతుందని, రైతులకు అత్యవసరమైనప్పుడు ఈ నిధి నుంచి రుణాలు ఇవ్వవచ్చునని అన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా విభజించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఒకే పంట వేయడం కాకుండా ఉష్ణోగ్రత, భూసారం, నేల స్వభావం వంటి అనేక అంశాలను పరిశీలించి పంటల కాలనీలను నిర్ణయిస్తారని, ఆ ప్రాంతంలో నిర్ణయించిన పంటనే వేయాలని, ఈ అంశంలో రైతు సంఘాలు కీలక పాత్ర వహిస్తాయని చెప్పారు. ఎకరానికి నాలుగు వేల రూపాయల సహాయం చేస్తామని ప్రకటించగానే ఇది మా పథకమే.. కాపీ కొట్టారని కాంగ్రెస్ చెబుతోందని, వారు అనుకుంటున్నట్టు ఒక పంటకు మాత్రమే కాదు, రెండు పంటలకు నాలుగేసి వేల రూపాయల చొప్పున చెల్లించనున్నట్టు చెప్పారు. ఖరీఫ్‌కు మేలో, యాసంగి పంట కోసం అక్టోబర్‌లో ఆ సొమ్మును రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా వేయనున్నట్టు చెప్పారు. ఈ డబ్బుతో ఎరువులు, క్రిమిసంహారకమందులు, విత్తనాలు వంటివి ఏవైనా కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. గ్రామ రైతు సంఘం అధ్యక్షుడు, వ్యవసాయ అధికారి, విఎఓ ముగ్గురూ సంతకం చేసి ధ్రువీకరించిన తరువాతనే రైతులను గుర్తించి వారికి సహాయం అందించనున్నట్టు చెప్పారు.
5 ఎకరాలకో వ్యవసాయ అధికారి
‘దేశంలో సంపన్న రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ పేరు చెప్పాలి. దేశంలో సంపన్న యాదవులు, గొల్ల కురుమలు ఎక్కడంటే మన రాష్ట్రం పేరు చెప్పాలి. నెలకు కనీసం 20వేల ఆదాయంతో బతికే చేనేత పనివారు ఎక్కడున్నారంటే మన రాష్ట్రం పేరు చెప్పాలి. ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంద’ని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 700 మంది గ్రామ వ్యవసాయ విస్తరణాధికారులు ఉండేవారని, ఇప్పుడు 2107 పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ఐదువేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ అధికారి ఉంటారన్నారు.
ధనిక రైతులకు ఎకరానికి నాలుగు వేలు ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారని, రాష్ట్రంలో 97 శాతం మంది సాధారణ రైతులే ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ సాకారం కావాలంటే పచ్చని తెలంగాణతోనే సాధ్యం అని, రైతులు సంతోషంగా, సంపన్నులుగా ఉండాలని అన్నారు. బాధలు లేని, ఆకలి లేని తెలంగాణను సాకారం చేసుకుందామని అన్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తుంటే కాంగ్రెస్ వాళ్లు అడ్డుకుంటున్నారని విమర్శించారు. విభజనకు ముందు తెలంగాణలో 2,500 కిలో మీటర్ల జాతీయ రహదారులు ఉండేవని, ఇప్పుడు 5,800 కిలో మీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు.

చిత్రాలు..టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ *తెరాస ప్లీనరీకి హాజరైన పార్టీ శ్రేణులు