ఆంధ్రప్రదేశ్‌

నిర్మాణ రంగం కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్పత్తి ధర పెరగకపోయినా..రేటు ఎందుకు పెరిగింది?

సిమెంట్ ధరల నియంత్రణలో కానరాని కఠిన వైఖరి ప్రభుత్వానికి రూ.230కే ఇవ్వాలంటూ బేరసారాలు
బహిరంగ మార్కెట్ ధరపై అస్పష్టత నేడు మంత్రుల కమిటీ మరోసారి భేటీ

విశాఖపట్నం, ఏప్రిల్ 26: రాష్ట్రంలో సిమెంట్ కంపెనీలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. కంపెనీలన్నీ ఒక్కటై, అనూహ్యంగా ధరలను పెంచేసినా వాటిని తగ్గించే విషయంలో ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో కూడా సిమెంట్ ధరలను కంపెనీలు అనూహ్యంగా పెంచాయి. కానీ, కంపెనీ యాజమాన్యాలతో చర్చలు జరిపినప్పుడు ప్రభుత్వం కఠిన వైఖరినే ప్రదర్శించింది. ఏపి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వానికి ఇచ్చే సిమెంట్ ధర గురించే మాట్లాడింది కానీ, బహిరంగ మార్కెట్‌లో ఏ ధరకు విక్రయించాలన్న స్పష్టత ఇవ్వలేదని క్రెడాయ్ ప్రతినిధులు తెలియచేస్తున్నారు. అసలు సిమెంట్ ఉత్పత్తి ధర ఏమాత్రం పెరగనప్పుడు మార్కెట్‌లో సిమెంట్ ధరను వంద రూపాయల వరకూ ఎందుకు పెంచాల్సి వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. దేశంలో సుమారు 20 ప్రముఖ సిమెంట్ కంపెనీలు మార్కెట్‌లో 70శాతం వాటాను చేజిక్కించుకున్నాయి. ఏటా ఈ కంపెనీల యాజమాన్యాలు రింగ్ అయి, ధరలను అనూహ్యంగా పెంచేస్తున్నాయి. గతంలో కూడా సిమెంట్ యాజమాన్యాలు ఇలాగే వ్యవహరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) వీటికి భారీగా అపరాధ రుసుము విధించింది. అయినా, ఈ సంవత్సరం సిమెంట్ కంపెనీలు యథావిధిగా ధరలను భారీగా పెంచేశాయి. సిమెంట్ కంపెనీలకు అవసరమైన మైనింగ్, విద్యుత్, రుణాల్లో పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. ఈ రాయితీలు తగ్గించలేదు. ముడి సరుకు ధర కూడా పెరగలేదు. అయినా సిమెంట్ ధరలు ఎందుకు పెంచుతున్నారన్నది ప్రధాన ప్రశ్న.
శ్లాగ్ సిమెంట్ బస్తా 230 రూపాయలకు బహిరంగ మార్కెట్‌లో విక్రయించినప్పుడు సిమెంట్ కంపెనీ యాజమాన్యాలకు మంచి లాభాలే వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. దీన్ని ఇప్పుడు 330 రూపాయలకు పెంచాల్సిన అసరం ఎందుకు వచ్చింది? గతంలో సిమెంట్ కంపెనీలు ధరలను పెంచినప్పుడు, కొన్ని కంపెనీలు మధ్యలోనే ఎందుకు దిగి వచ్చి, పాత ధరకే సిమెంట్‌ను విక్రయించడానికి అంగీకరించాయి. అంటే, అప్పటికే కంపెనీలు ప్రాఫిట్‌లో ఉన్నాయన్నమాట. ఇక గ్రేడెడ్ సిమెంట్ గురించి చెప్పనక్కర్లేదు. మార్కెట్‌లో దానికి నిర్దిష్టమైన రేటు లేకపోవడం గమనార్హం. కొద్ది నెలల కిందట 325 నుంచి 340 రూపాయల వరకూ విక్రయించిన గ్రేడెడ్ సిమెంట్ ఇప్పుడు 400 నుంచి 420 రూపాయలకు చేరుకుంది. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టిస్తూ హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ధరలను పెంచుకుంటూ పోతున్నారు. సిమెంట్‌తో పాటు, ఇసుక, ఐరన్ ధరలు పెరిగిపోవడంతో నిర్మాణ వ్యయం ఎస్‌ఎఫ్‌టికి 100 నుంచి 150 రూపాయలు పెరిగిపోయింది. అంటే 1000 ఎస్‌ఎఫ్‌టి ఉన్న ఫ్లాట్ నిర్మాణ ఖర్చు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకూ పెరిగిపోయింది. దీంతో రాష్ట్రంలో దాదాపూ 2000 ప్రాజెక్ట్‌లు నిలిచిపోయాయి. ఒక్క విశాఖలోనే సుమారు 400 ప్రాజెక్ట్‌లు నిలిచిపోయాయి.
ఇదిలా ఉండగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ సిమెంట్ ధర పెంపు విషయంలో సిఎం సీరియస్‌గా ఉన్నారని, ఇది 240 రూపాయలకు తగ్గించాలని చెప్పారు. సిమెంట్ ధర తగ్గింపునకు కంపెనీ యాజమాన్యాలతో చర్చించేందుకు ఐదుగురు మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. 24న జరిగిన సమావేశంలో ప్రభుత్వ భవనాలు, ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు బస్తా 230 రూపాయలకే విక్రయించాలని, బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం పెంచిన ధరలో 60 రూపాయలు తగ్గించాలని సూచించింది. ఏ ప్రాతిపదికన 60 రూపాయల మాత్రమే తగ్గించాలని మంత్రులు కమిటీ తన ప్రతిపాదనను సిమెంట్ కంపెనీల ముందు ఉంచిందని క్రెడాయ్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. దీనికి కంపెనీ యాజమాన్యాలు అంగీకరించినా, బస్తాకు 40 రూపాయలు పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు ఈ భారాన్ని భరించలేరు.
ఈ విషయంపై చర్చించేందుకు మంత్రుల కమిటీ గురువారం మరోసారి భేటీ కానుంది.