రాష్ట్రీయం

టిటిడి ఇఓగా సింఘాల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్తి సుబ్రహ్మణ్యం
అమరావతి, ఏప్రిల్ 27: ఇప్పటివరకూ తెలుగువారికే పరిమితమైన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పదవి ఇకపై ఉత్తరాది అధికారుల సొంతం కాబోతోంది. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఏపి కేంద్రమంత్రి ఒకరు, ఢిల్లీలో కీలకస్థానాల్లో ఉన్న సొంత సామాజికవర్గ ప్రముఖుల దన్నుతో చేసిన లాబీయింగ్ దాదాపు ఫలించినట్టు సమాచారం. టిటిడి ఇఓగా ఉత్తరాదికి చెందిన ఏపి క్యాడర్ అధికారి ఎకె సింఘాల్ నియామకం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. దీనిపై తెలుగువారైన ఐఏఎస్‌లతోపాటు, కర్నాటక, తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారుల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ ఏనాడూ ఉత్తరాది అధికారికి టిటిడి పగ్గాలు ఇచ్చిన దాఖలాలు లేవనీ, ఒకసారి ఉత్తరాదికి చెందిన అధికారికి టిటిడి ఇఓ పదవి అప్పగిస్తే, ఇకపై అదే సంప్రదాయం కొనసాగుతుందని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌లకు అవకాశాలు ఏమాత్రం ఉండవని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రం పుణ్యమాని ఉత్తరాది హవా పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిష్ఠాత్మక టిటిడి ఇఓ పదవి కూడా వారి ఖాతాలోకి వెళితే, ఇక దక్షిణాది ఉనికి పూర్తిగా కనుమరుగయిపోతుందన్న ఆవేదన తెలుగు అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు స్పందించపోతే, ప్రతిష్ఠాత్మకమైన టిటిడిపై రాష్ట్రం పట్టు కూడా పోతుందని స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపి భవన్‌లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సింఘాల్‌కు టిటిడి ఇఓ పదవి ఇప్పించే బాధ్యతను టిడిపికి చెందిన ఓ కేంద్రమంత్రి భుజానికెత్తుకున్నారన్న వ్యాఖ్యలు సొంత పార్టీవర్గాల్లోనే చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవలి కాలంలో పలు మీడియాల్లోనూ కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. సదరు కేంద్రమంత్రి ఢిల్లీలో ప్రముఖ స్థానాల్లో ఉన్న, సొంత సామాజికవర్గ ప్రముఖుల దన్నుతో సింఘాల్‌కు ఆ పదవి ఇప్పించేందుకు చేస్తున్న కృషి దాదాపు ఫలించిందని, త్వరలో సింఘాల్ పేరు ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాగా సదరు కేంద్రమంత్రికి ఆయన పేరును సీబీఐకి చెందిన ఒక ఉన్నతాధికారి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ఆ కేంద్రమంత్రికి సాయం చేసినందుకు కృతజ్ఞతగానే, ఇప్పుడు ఆ సీబీఐ అధికారి సిఫార్సు చేసిన అధికారికి టిడిడి ఈఓ పదవి ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. కాగా సదరు సీబీఐ అధికారికి, ఇఓ పదవి ఆశిస్తున్న అధికారితో బంధుత్వం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎంతోమంది సమర్థులైన తెలుగు ఐఏఎస్‌లు ఉన్నప్పటికీ, ఏరికోరి ఉత్తరాది అధికారిని అత్యున్నతమైన టిటిడి ఈఓకు ఎంచుకోవడం ఏమిటని దక్షిణాది ఐఏఎస్‌లు ప్రశ్నిస్తున్నారు.
రాజుగారి రూటే వేరు
ఇదిలాఉండగా ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినా టిటిడి జెఇఓగా చేస్తున్న శ్రీనివాసరాజు మాత్రం కొనసాగుతుండటంపై అధికారవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పదవీబాధ్యతలు స్వీకరించిన రాజు, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయి చంద్రబాబునాయుడు సీఎం అయి దాదాపు మూడేళ్లవుతున్నా, ఇంకా ఆయనే కొనసాగుతుండటంపై అటు పార్టీ వర్గాలు, ఇటు అధికారవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. బాబు సీఎం అయ్యాక, గత ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో పనిచేసిన ఐఏఎస్‌లను బదిలీ చేసినా శ్రీనివాసరాజును మాత్రం ఇంకా కొనసాగుతుండటం చర్చనీయాంశమయింది.
ఎపిఎండిసీలో ఆ అధికారిదే హవా
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ఓ అధికారి కూడా, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నియమితులై ఇంకా కొనసాగుతున్న వైనాన్ని అధికారవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ స్థానంలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అధికారులు అదే విభాగంలో పనిచేస్తున్నప్పటికీ, నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్న గత ప్రభుత్వం నియమించిన అధికారే కొనసాగించటం బట్టి, అధికారుల హవా స్థాయి ఏమిటన్నది స్పష్టమవుతోంది.