రాష్ట్రీయం

చెరువు మింగేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఏప్రిల్ 28: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. గుంతకల్లు మండలం వైటిచెరువు గ్రామ శివారులోని చెరువులో విహారానికి వెళ్లిన 13మంది ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగి మరణించారు. మరో బాలుడు గల్లంతయ్యాడు. ఈ దుర్ఘటనలో కేవలం ఒకే ఒక్క బాలిక ప్రాణాలతో బయటపడింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నారు. వీరిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ఇరవయ్యేళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో పెద్దవారికి రూ.3 లక్షలు, పిల్లలకు లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. వైటిచెరువు గ్రామంలోని రామాలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా తిర్లయ్యగారి సుంకన్న కుమారుడు రాముడు ఇంటికి సమీప బంధువులు వచ్చారు. శుక్రవారం సాయంత్రం వారంతా కలిసి సమీపంలోని వైటి చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ జాలర్లు బెస్తరాజు, బోయ రాజు తెప్ప నడుపుతూ కనిపించడంతో సరదాగా అలా వెళ్లివద్దామని బేరం మాట్లాడుకున్నారు. తొలుత ఏడుగురిని తెప్పలో చెరువు మధ్యలోని గుట్టపైకి చేర్చారు. రెండో విడతలో ఎనిమిది మందిని తెప్పలో తీసుకువెళ్లారు. కొద్దిసేపు అంతా అక్కడ గడిపిన తరువాత తిరుగుప్రయాణమయ్యారు. అయితే ఆలస్యం అవుతోందని అంతా కలిసి ఒకేసారి తెప్పలోకి ఎక్కారు. సగం దూరం రాగానే బరువుకు తట్టుకోలేక తెప్ప తిరగబడింది. దీంతో అంతా నీళ్లలో మునిగిపోయారు. తెప్ప నడిపిన బెస్త రాజు, బోయ రాజు ఈదుకుంటూ బయటకు వచ్చారు. వీరు నీళ్లలో మునిగిపోతున్న ఆరేళ్ల బాలిక సుమిత్రను కాపాడి తమతోపాటు ఒడ్డుకు చేర్చారు. విషయం తెలియగానే గ్రామస్థులు పెద్దసంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. శవాలు ఒక్కొక్కటిగా నీటిపై తేలాయి. ఇద్దరు గజ ఈతగాళ్లు నీళ్లలోకి దిగి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను దంచర్లకు చెందిన ఎర్రమ్మ (35), స్పందన (6), వైటిచెరువుకు చెందిన సుధాకర్ (4), లక్ష్మి (14), పెంచలపాడుకు చెందిన లావణ్య (14), దుర్గ (16), లలిత (20), నేత్ర (6), గోకుల్ (3), గుంతకల్లు పట్టణం పక్కీరప్పకాలనీకి చెందిన అనంతలక్ష్మి (30), నితిన్‌కుమార్ (4), బన్ని (7), రామాంజనేయులు (13)గా గుర్తించారు. వైటిచెరువుకు చెందిన రాజు అనే మూడేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ప్రాణాలతో బయటపడిన బాలికను చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా తమ వెంట వచ్చిన వారంతా చెరువులో మునిగి చనిపోయినట్లు తెలియగానే మొలకలపెంట గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలో శనివారం ఉత్సవం జరగాల్సి ఉండగా శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది.

చిత్రాలు..మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు