రాష్ట్రీయం

చారిత్రక పల్లెగా బమ్మెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 28: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని మరుగున పడేశారని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. చివరకు తేట తెనుగు కవిత్వాన్ని అందించిన బమ్మెర పోతన కూడా మనవాడేనని, కడప జిల్లా ఒంటిమిట్ట నివాసిగా తప్పుడు ప్రచారానికి దిగారని విమర్శించారు. పోతన నివసించిన బమ్మెర గ్రామంతోపాటు పాలకుర్తి, వల్మిడి గ్రామాలను 40 కోట్లతో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కెసిఆర్, భాగవతాన్ని తెలుగులో ప్రజలకు అందించిన పోతన స్వగ్రామం బమ్మెరను సందర్శించారు. ఆయన సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. పోతనామాత్యుడు సేద్యానికి ఉపయోగించిన మోట బావిని సందర్శించారు. పోతనకు చెందిన 4.32 ఎకరాల స్థలాన్ని ఆధ్యాతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కుదుర్చుకున్న ఎంఓయును సిఎం సమక్షంలో భారత హెరిటేజ్ సంస్థ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగారావు, పర్యాటక శాఖ తరపున కలెక్టర్ దేవసేన మార్చకున్నారు. ఈ సందర్భంగా పోతన కవితను వినిపించిన సిఎం, ఇది ఆయన సమాధి కల్పించిన ప్రేరణగా అభివర్ణించారు. రాష్ట్రం ఆవిర్భవిస్తే పోతనలాంటి మహానుభావుల ఆత్మలు శాంతిస్తాయని అనేకమంది చెప్పేవారని, రాష్ట్రం సిద్ధించాక ఆమేరకు ప్రయత్నాలు మొదలు పెట్టామన్నారు. అందులో భాగంగానే బమ్మెర, పాలకుర్తి, వల్మిడి గ్రామాలను, జఫర్‌గఢ్, ఖిలేషాపూర్ కోటలు అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామన్నారు. బమ్మెర గ్రామాన్ని, పోతన స్మారకాన్ని టూరిజం నిధులతోపాటు, గ్రామానికి మంజూరు చేస్తున్న ప్రభుత్వ నిధులను కలిపి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పాలకుర్తి నుంచి బమ్మెరకు వెళ్లడానికి బైపాస్ నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ, ఎంపీ దయాకర్, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఊరిది ఒకేమాటవ్వాలి: కెసిఆర్
సమష్టికృషి, ఐక్యతతోనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయనడానికి వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ఉదాహరణ అని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. పల్లెల అభివృద్ధికి నిధులొక్కటే మార్గం కాదన్నారు. పల్లెల అభివృద్ధి కుటుంబాల నుంచే మొదలవుతుందని, ఒక దీపం సాయంతో మరో దీపం వెలిగినట్టు ఒక గ్రామాన్ని చూసి మరో గ్రామం అభివృద్ధిపథంలో పయనించాలన్నారు. పాలకుర్తి మండలంలో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటున్న రాఘవపూర్‌ను సిఎం కెసిఆర్ సందర్శించారు. మిషన్ భగీరథ కింద నిర్మించిన మంచినీటి ట్యాంకు ప్రారంభించి మంచినీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఊరి జనమంతా ఒకమాటపై నిలబడితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామాల్లో కుటుంబాల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇంటింటా పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గంగదేవిపల్లి మాదిరిగా రాఘవాపూర్‌ను అభివృద్ధి చేయాలన్న ప్రజల తపనను ప్రశంసిస్తూ ఏడాదిలో మళ్లీ వస్తానని, అప్పటికి కల నెరవేర్చుకోవాలని ఆకాంక్షించారు. గ్రామానికి 30 ఇళ్లు ఇస్తున్నామని, సిసి రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు కోటి నిధులు మంజూరు చేశారు.

చిత్రం..పోతనామాత్యుని సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్