ఆంధ్రప్రదేశ్‌

సర్వపాప హరణం.. అప్పన్న నిజరూప దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఏప్రిల్ 29: వైశాఖ శుద్ధ తదియ పర్వదినం సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి నిజరూప దర్శనం (చందనయాత్ర) శనివారం కన్నుల పండువగా జరిగింది. వరాహ వదనం, మానవ శరీరం, సింహవాలంతో విలక్షణ మూర్తిగా దర్శనమిచ్చిన వరాహ లక్ష్మీ నారసింహుని కనులారా వీక్షించిన భక్తులు ఆనందంతో పరవశించిపోయారు. దేవాలయ సంప్రదాయాన్ని అనుసరించి ఆనువంశిక ధర్మకర్త హోదాలో కేంద్రమంత్రి అశోకగజపతిరాజు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి దర్శనం చేసుకున్నారు. దేవస్థానం ఈవో రామచంద్రమోహన్, అర్చక పరివారంతో కలిసి ధర్మకర్త కుటుంబానికి ఆలయ మర్యాదలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున గవర్నర్ ఇఎల్ నరసింహన్, మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, కమిషనర్ వైవి అనూరాధ, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పోలీస్ కమిషనర్ యోగానంద్ గవర్నర్ దంపతులను దగ్గరుండి తీసుకువెళ్ళి దర్శనం చేయించారు. తెల్లవారు జామున రెండు గంటల నలభై అయిదు నిమిషాలకు సాధారణ భక్తులకు సింహాచలేశుని నిజరూప దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి 11 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభించింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో సహస్రఘటాభిషేకం ప్రారంభించారు. వందల సంఖ్యలో వచ్చిన శ్రీ వైష్ణవ సంప్రదాయ రుత్విక్కులు గంగధార జలాలను తీసుకురాగా దేవాలయ వైదికులు సింహాచలేశుని మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత స్వామివారిని అర్చకులు సుప్రభాత సేవతో మేల్కొలిపారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తకోటి దర్శనానికి స్వామివారిని సంసిద్ధులను చేసారు. విశాఖ శారదా పిఠాధిపతి శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి, విశ్వయోగి విశ్వంజీ మహరాజ్, శాసన సభాధిపతి కోడెల శివప్రసాదరావుతో పాటు పలువురు ప్రముఖులు సింహాచలేశుని నిజరూప దర్శనం చేసుకుని తరించారు. విఐపిల ప్రాబల్యం తగ్గించేందుకు అధికార యంత్రాంగం అనుసరించిన వ్యూహం సత్ఫలితానిచ్చింది. నిర్దేశించిన సమయంలో మినహా మిగిలిన సమయాలలో విఐపిలను అనుమతించక పోవడంతో సాధారణ భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. ఉచిత దర్శనం భక్తులు సుమారు రెండు గంటలు పట్టింది.

పట్టువస్త్రాలు సమర్పిస్తున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు * స్వామి సన్నిధిలో విశ్వయోగి విశ్వంజీ