రాష్ట్రీయం

స్విస్ చాలెంజ్‌కి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2:రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద నాలుగు లక్షల ఇళ్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఉన్న స్టార్టప్ ఏరియా అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కన్సార్టియం (ఎసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్) సమర్పించిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మిగిలిన మంత్రివర్గ నిర్ణయాలు ఇలా ఉన్నాయి:
ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కార్యక్రమం కింద 2017-18, 2018-19 సంవత్సరాల్లో నిర్మాణం చేపట్టేందుకు 4 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ గృహ నిర్మాణాన్ని చేపట్టనున్నది. లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకునే పద్ధతిలో గృహ నిర్మాణం జరుగుతుంది. ఒక్కొక్క యూనిట్‌కు రూ.లక్షన్నర వ్యయం అవుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.92వేలు, ఐహెచ్‌హెచ్‌ఎల్ కోసం రూ.3వేలు, నరేగా నిధుల కింద రూ.55వేలు వెచ్చిస్తారు. మొత్తం 200 నుంచి 500 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 800 పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి మంత్రిమండలి ఆమోదం. వీరిని నేరుగా నియమిస్తారు. ఈ నియామకాల ద్వారా 600 సివిల్ కానిస్టేబుళ్లు, 200 ఎఆర్ కానిస్టేబుళ్లు ఖాళీలను భర్తీ చేస్తారు. విశాఖ రూరల్, విశాఖ సిటీ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సమానంగా పోస్టులను కేటాయించారు.
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులను డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. మొత్తం 25 పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.2.25 కోట్ల భారం పడనున్నది.
విశాఖపట్నం, కడప సెంట్రల్ జైళ్లలోనూ కర్నూలు, విజయవాడ, గుంటూరు, ఏలూరు జిల్లా జైళ్లలోనూ పోస్టుల సృష్టికి మంత్రిమండలి నిర్ణయం. జైళ్ల శాఖలో 14 పోస్టులను కొత్తగా సృష్టిస్తున్నారు. రాజమండ్రి, రాజోలు, ఆలమూరు, కందుకూరు, భీమునిపట్నం, ఆలూరు, రాయదుర్గం, మడకశిర, పొదిలి సబ్ జైళ్లను మూసివేయాలని ప్రతిపాదన.
ఒలింపిక్స్ విజేత పివి సింధును గ్రూప్-1 సర్వీస్‌లో నియమించేందుకు వీలుగా ఏపి (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్ట్ఫా పాట్రన్ అండ్ పే స్ట్రక్చర్) యాక్ట్ 2-1994కు సవరణలు చేసి శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని సర్వే నెంబర్ 17, రిషికొండ గ్రామంలోని సర్వే నెంబర్ 37, 38లలో గల 36.07 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీకి కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం. గీతం యూనివర్సిటీ ఇక్కడ ఇన్నోవేటివ్ కోర్సుల నిర్వహణతోపాటు దూరవిద్య కేంద్రం ఏర్పాటు చేస్తుంది.
మంత్రులు, అధికారులు, ప్రముఖుల వాహనాలపై నీలి, ఎర్ర రంగు బుగ్గల వినియోగాన్ని ఉపసంహరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో పకడ్బందీగా అమలుచేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

చిత్రం..మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశ దృశ్యం