రాష్ట్రీయం

ఉసురు తీసిన వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ బుధవారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని 9వ మెట్రో పిల్లర్‌ను వేగంగా కారుతో ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న నిషిత్‌తోపాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ సైతం అక్కడికక్కడే మృతిచెందారు. మెర్సిడెస్ బెంజ్ కారులో మితిమీరిన వేగంతో వెళ్తుండటమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. మరో రెండు నిముషాల్లో ఇంటికి చేరతారనగా ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా నిషిత్ వ్యవహరిస్తున్నారు. రాజా రవివర్మ ప్రముఖ వ్యాపారవేత్త కామని బాలమురళీకృష్ణ కుమారుడు. ప్రమాదం సంభవించిన సమయానికి మంత్రి నారాయణ లండన్ పర్యటనలో ఉన్నారు. సంఘటనా వివరాలు తెలుసుకున్న నారాయణ హుటాహుటిన పర్యటన రద్దు చేసుకుని నెల్లూరుకు బయలుదేరారు. కాగా నిషిత్ హైదరాబాద్‌లోని నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీతో మంగళవారం రాత్రి 11.30 వరకు అడ్మిషన్లు, ఫ్యాకల్టీ, రిక్వైర్‌మెంట్ వంటి అంశాలపై సిబ్బందితో చర్చించారు. స్నేహితుడు రవివర్మతో హోటల్‌లో డిన్నర్ పూర్తి చేసుకుని, జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి బయలుదేరిన సమయంలో తెల్లవారుజాము 2.30కు ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ కారులో పరిమితికి మించి వేగంగా వెళ్తుండటంతో, అదుపు తప్పిన కారు 9వ మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొంది. సంఘటనా స్థలంలో భారీ శబ్దం రావడంతో, అప్పటికే విధుల్లోవున్న జిహెచ్‌ఎంసి సిబ్బంది, స్థానికులు సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే సరికే ఇద్దరూ మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఊపిరితిత్తులకు బలమైన గాయాలవ్వడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణ కుటుంబం, వ్యాపారవేత్త రాజా రవివర్మ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతదేహాలకు అపోలో వైద్య కళాశాలలో ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. నిషిత్ భౌతికకాయాన్ని నెల్లూరుకు, రాజా రవివర్మ భౌతిక కాయాన్ని ప్రకాశం జిల్లా టంగుటూరుకు తరలించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేడు అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, వ్యాపారవేత్త బాలమురళీకృష్ణ కుమారుడు రాజా రవివర్మ భౌతిక కాయాలకు గురువారం అంత్యక్రియలు జరుగనున్నాయి. నిషిత్ భౌతిక కాయానికి నెల్లూరులో, రవివర్మ భౌతికకాయానికి టంగుటూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయా కుటుంబాలు తెలిపాయి.
మృత్యువులోనూ..
మృత్యువులోనూ వారి స్నేహం వీడలేదు. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ఉండే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, రాజా రవివర్మ ఒకేసారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రవివర్మ, నిషిత్ క్లాస్‌మేట్లు. అది కాస్తా ప్రాణస్నేహితులుగా మారారు. వీరి మరణం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

చిత్రాలు..ప్రమాదంలో నుజ్జునుజ్జయిన మెర్సిడెస్ బెంజ్,
*ఇన్‌సెట్లో నిషిత్ (ఫైల్ ఫొటో)