రాష్ట్రీయం

రవాణాపై సర్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: మూడేళ్లుగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య నలుగుతున్న అంతర్ రాష్ట్ర రవాణా ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, బుధవారం తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశంలో సానుకూల చర్చ సాగింది. సమస్యపై రెండు రాష్ట్రాల రవాణా శాఖల మంత్రులు భేటీ అయినప్పటికీ ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకున్నా, సింగిల్ పర్మిట్ల అంశంలో ఇద్దరు మంత్రులు, అధికారుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం. ఈ అంశంపై విస్తృత చర్చకు మరోమారు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ జరిగిన చర్చల్లో ప్రధానంగా ఐదు అంశాలు చర్చకు రాగా, నాలుగు అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఇక ఆర్టీసీ సర్వీసుల నిర్వహణపై మరింత విపులంగా చర్చించుకుందామని నిర్ణయించారు. ఈ అంశంపై జాప్యం చేయకుండా గురువారం రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశం కావాలని మంత్రులిద్దరూ ఆదేశించారు. నేడు జరిగే చర్చల్లో రోడ్ మ్యాప్ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరున కాని, వచ్చే నెల ప్రారంభంలోగాని హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పి మహేంద్రరెడ్డి సమావేశం అనంతరం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ సమావేశంలో అంతర్ రాష్ట్ర రవాణాకు పరస్పర ఒప్పందం కుదుర్చుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్ర, తెలంగాణ విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి పరస్పర ఒప్పందం జరగలేదు. తాత్కాలిక పర్మిట్లతో రవాణా సాగుతోంది. సరకు రవాణా వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చామని మంత్రులు తెలిపారు. ఈ రెండింటి విషయంలో పెద్ద సమస్యలేవీ లేవని, అన్నీ పరిష్కరించగలిగేవేనని పేర్కొన్నారు. సమావేశంలో కొత్తగా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలకు నిర్వహిస్తున్న ఆయా సంస్థల బస్సులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించామని, ఇది కూడా పరిష్కరించేలా చర్యలుంటాయని ఆంధ్ర రవాణా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. ఇక రెండు రాష్ట్రాల ఆర్టీసీలో పని చేస్తున్న సిబ్బందిలో భార్యలు ఒక రాష్ట్రంలో, భర్త మరో రాష్ట్రంలో పని చేస్తున్నారని, అలాగే స్థానికత కూడా ప్రస్తావనకు వచ్చిందని ఈ అంశంలో పరిష్కారానికి పెద్దగా అవరోధాల్లేవని మంత్రి తెలిపారు. ఇక మిగిలిందల్లా ఆర్టీసీ సమస్య అని, ఈ సమస్యపట్ల మరింత లోతుగా చర్చించి పరిష్కారం అమలుకు మార్గదర్శని తయారు చేయాల్సి ఉందన్నారు. పరిష్కరించలేని సమస్య కాదని, ఎప్పటికీ సమస్య లేకుండా చూడాలని మరింత చర్చకు నిర్ణయించామని వెల్లడించారు. హైదరాబాద్‌తో ఆంధ్రలోని ప్రతి ప్రాంతవాసికీ ఎదోక రూపంలో సంబంధం ఉందని, అందుకే రాష్ట్రంలోని ప్రతి డిపో నుంచి హైదరాబాద్‌కు ఒకటో రెండో బస్సు సర్వీసులు నడుస్తున్నాయని మంత్రి వివరించారు. ఇది ఈ మూడేళ్లలో వచ్చింది కాదని, అంతకుముందు నుంచే దశలవారీగా ఏర్పాటైనవేనని తెలిపారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు బస్సులున్నా, వాటి సంఖ్య కొంత తక్కువేనన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆంధ్రకు నడుస్తున్నా (హైదరాబాద్ -విజయవాడ) అవి ఎక్కువ దూరం తెలంగాణాలోనే ప్రయాణించేలా రాష్ట్ర సరిహద్దు ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విషయానికి వస్తే రాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ దూరం ఎక్కువ ఉండటం వల్ల తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు నడుస్తున్నట్టయ్యిందని వివరించారు. ఫలితంగా ఆంధ్ర, తెలంగాణ ఆర్టీసీ సర్వీసుల మధ్య కిలోమీటర్ల తేడా వస్తోంది. ఈ విషయమై ఒక నిర్ణయానికి వస్తాం. మనం కొంత కుదించుకోవడం, వారు కొంత పెంచుకోవడంలో సర్దుబాటు ధోరణిలో వ్యవహరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎవరికీ నష్టం లేకుండా చూడటానికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ కిందిస్థాయి అధికారుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఒక బస్సు వెనక మరో బస్సు వెళ్ళేలా కాకుండా రాష్ట్ర సర్వీసులకు వేళలను నిర్ణయించేందుకే సమావేశాన్ని నిర్వహించాలని అధికారులకు తెలిపామన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మంత్రుల సమావేశం జరగడం ఇదే తొలిసారి అని మంత్రి పేర్కొన్నారు. వచ్చే సమావేశంలో ఒప్పందం కుదురుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న ఎపీఎస్ ఆర్టీసీ ఎండి మాలకొండయ్య మాట్లాడుతూ జూన్ నెలలో ఆర్టీసీ రూట్ల విషయంలో సాధారణంగా పునఃసమీక్ష జరుగుతుందని, అప్పటిదాకా యథాస్థితి కొనసాగించి, పునఃసమీక్షలో సర్వీసుల కుదింపు, పొడిగింపు గురించి నిర్ణయం తీసుకుందామని, ఆలోగా మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో మంత్రులతోపాటు రెండు రాష్ట్రాల రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు సుమితా దావ్రా (ఏపీ), సునీల్ శర్మ (తెలంగాణ), రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం (ఏపీ), తెలంగాణ ఆర్టీసీ ఎండి రమణరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు, మహేందర్‌రెడ్డి