రాష్ట్రీయం

నిషిత్ మృతిపై నేతల దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వ్యవహారాల మంత్రి డాక్టర్ నారాయణ కుమారుడు నిషిత్ (23) బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంపై రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఎపి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిషిత్ ఆత్మకు శాంతి చేకూరాలని కె చంద్రశేఖరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే నిషిత్ ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు.
బాధాకరం: చంద్రబాబు
నారాయణ కుమారుడు నిషిత్ చనిపోవడం చాలా బాధాకరమని, తామంతా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబునాయుడు పేర్కొనగా, హఠాన్మరణం బాధాకరమని నారా లోకేష్ పేర్కొన్నారు. నిషిత్ ఆత్మకు శాంతి కలగాలని తెలంగాణ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి, నటుడు చిరంజీవి అపోలో ఆస్పత్రికి చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పగవారికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని ఆయన అన్నారు.
నిషిత్ మరణ వార్త తెలియగానే తెలంగాణ మంత్రి హరీష్‌రావు, నామా నాగేశ్వరరావు, ఏపి డిప్యూటీ సిఎం చిన్నరాజప్ప తదితరులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాల పంచనామా, ఇతర ఆస్పత్రి వ్యవహారాలను పర్యవేక్షించారు. అనంతరం చిన్నరాజప్ప నెల్లూరు పయనమయ్యారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అపోలో ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి వెళ్లి నిషిత్ తల్లి రమాదేవి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన పోలీసులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సిపిఐ నేత నారాయణ, తెరాస నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, డి శ్రీనివాస్, తెలంగాణ టిడిపి నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, ఎల్ రమణ తదితరులు అపోలో ఆస్పత్రికి వెళ్లి నిషిత్ మృతదేహానికి నివాళులు అర్పించారు. మంత్రి నారాయణ వియ్యంకుడు గంటాశ్రీనివాసరావు వైజాగ్ నుండి హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదే ప్రమాదంలో మరణించిన నిషిత్ స్నేహితుడు రాజారవివర్మ కుటుంబ సభ్యులనూ నేతలు పరామర్శించారు. నిషిత్ మరణవార్తతో దిగ్భ్రాంతి చెందిన నేతలు, నారాయణ విద్యాసంస్థల సిబ్బంది పెద్ద ఎత్తున మంత్రి నారాయణ నివాసానికి చేరుకున్నారు.
ఆ బాధ నాకు తెలుసు: హరికృష్ణ
నిషిత్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై టిడిపి నేత నందమూరి హరికృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కన్న కొడుకును కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. మూడేళ్ల క్రితం హరికృష్ణ కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు.
నేనే అనుకున్నారు: సిపిఐ నారాయణ
నారాయణ కుమారుడు మరణించాడని తెలిసి కొంత మంది తనకుమారుడే అనుకుని ఫోన్ చేశారని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు డాక్టర్ కె నారాయణ తెలిపారు. తర్వాత మంత్రి నారాయణ కుమారుడని అర్థమయిందని చెప్పారు.
బిజెపి నేతల సంతాపం
నారాయణ కుమారుడి మృతి పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి, జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి , ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.

చిత్రాలు.. నిషిత్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు, చిరంజీవి.
* కారు యాక్సిడెంట్ అయన స్పాట్ ఇదే.