రాష్ట్రీయం

అడ్డుకుంటే అడవిబాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 13: రాష్ట్రంలో తమను ఎక్కడా మాట్లాడనీయకుండా చేస్తున్నారని, అసెంబ్లీకి రానివ్వకపోగా ప్రజల మధ్యలో కూడా ఉండనియ్యడం లేదని, అవసరమైతే అడవికి వెళ్ళైనా ప్రజలను సమీకరించి ఉద్యమబాట పడతామని టిడిఎల్‌పి నేత రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుపోరు దీక్ష పేరుతో శనివారం ఖమ్మంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తట్టుకోలేక అడ్డుకుంటున్నారన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను అప్పటి ప్రభుత్వాలు అడ్డుకుంటే వారంతా అడవికి వెళ్ళి ప్రభుత్వంపై పోరుబాట పట్టారని గుర్తు చేశారు. ఇప్పటి పాలకులు నాటి ప్రభుత్వాల విధానాలను గుర్తు చేస్తూ అందరినీ అడవికి వెళ్ళేలా చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాను ఎక్కడికైనా వెళ్ళగలనని, అడ్డుకునే ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు. ప్రభుత్వం వేసుకోమన్న పంటలు వేసుకున్నందుకే రైతులకు శిక్ష విధించారన్నారు. పత్తి వేసుకోవొద్దని.. మిర్చి, పప్పు దినుసులు వేసుకోవాలని సూచించిన పాలకులు ఆ పంటకు మద్దతు ధర కల్పించలేకపోయారని దుయ్యబట్టారు. మద్దతు ధర కోసం అడిగిన వారిని రౌడీలు, గుండాలంటూ జైలుకు పంపారన్నారు. తమ సమస్యను చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వక, నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో తిరుగుబాటు చెయ్యక తప్పదని వెల్లడించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం నిధులు ఇస్తే కొనుగోలు చేస్తామని చెప్పడం బాధాకరమన్నారు. తాను ఇంద్ర భవనం కట్టించుకునేందుకు, బతుకమ్మ ఆడేందుకు నిధులు, పార్టీ ఫిరాయింపుదారులకు ఇచ్చిన కోట్లు, కాంట్రాక్టర్లకు ఇస్తున్న వేల కోట్లు కేంద్రం ఇవ్వకుండానే ఎలా చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఆ నలుగురు కుటుంబ సభ్యులే సంతోషంగా ఉన్నారని, కావాల్సినంత దోచుకుంటున్నారని ఆరోపించారు. మాయమాటలతో ప్రజలను మాయ చేయాలనుకుని ఖమ్మం ఘటనతో తిరుగుబాటు తట్టుకోలేక ప్రభుత్వ పెద్దలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు. బతుకునిచ్చిన పార్టీకి, జెండాకు ద్రోహం చేసిన నాయకులు ఇప్పుడు తమపై ఆరోపణలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖమ్మం మార్కెట్‌లో దేశమంతా గుర్తించే సంఘటన జరిగితే జిల్లా కలెక్టర్‌తో పాటు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ కనీసం మార్కెట్‌ను సందర్శించలేదన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజల్లో ఎవ్వరూ సంతోషంగా లేరని, ఆ నలుగురు మాత్రం ఛాయ్‌లు, ఐస్‌క్రీమ్‌లు అమ్మి లక్షలు సంపాదిస్తున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయిన ప్రభుత్వం రుద్రమదేవి, శాతకర్ణి, బాహుబలి చిత్రాలకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించిందని ఆరోపించారు. కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటించేంత వరకు ఉద్యమిస్తామన్నారు. రైతుల సమస్యల ద్వారా అన్ని పక్షాలు ఒకే వేదికపైకి వచ్చాయని, ఇకనుంచి అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. టిడిపి రైతుపోరు దీక్షకు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి పార్టీల నేతలతో పాటు పలు విద్యార్థి, యువజన, స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలికాయి. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ధర్నాలో ఎమ్మెల్యే వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ధర్నాలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య