రాష్ట్రీయం

చిన్నారిని కబళించిన క్యాన్సర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 14: చిన్నారి మాదంశెట్టి సాయిశ్రీ (13) మృతి చెందింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సరైన వైద్యం అందక చివరికి తన జ్ఞాపకాలు తల్లికి వదిలి వెళ్లిపోయింది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ క్షణక్షణం చావుకు చేరువవుతున్న తనను దయచేసి బతికిలంచాలంటూ ‘సెల్ఫీ’ వీడియో ద్వారా తండ్రి మాదంశెట్టి శివకుమార్‌ను సాయిశ్రీ ఇటీవల ప్రాధేయపడింది. తన బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, అందుకు కారణం పరోక్షంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తన మాజీ భర్త మాదంశెట్టి శివకుమార్‌లేనంటూ తల్లి సుమశ్రీ ఆరోపిస్తోంది. ఖరీదైన వైద్యం అందించలేని దైన్యస్థితిలో కొట్టుమిట్టాడుతున్నా తమను అనాథల్లా వదిలేసి బిడ్డ చావును కోరుకున్నాడని శివకుమార్‌ను శపించింది. తను ఉంటున్న ఇల్లు సైతం కబ్జా చేయడం వల్ల ఇంటిని అమ్ముకుని కుమార్తెకు వైద్యం చేయించే అవకాశం కూడా లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయింది. దుర్గాపురంలోని తన నివాసంలో బిడ్డ మృతదేహం వద్ద ఆదివారం సాయంత్రం సుమశ్రీ విలేఖరులతో మాట్లాడుతూ పోలీసులూ తన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
కృష్ణలంకకు చెందిన మాదంశెట్టి శివకుమార్ 2004లో సుమశ్రీని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సాయిశ్రీ పుట్టాక మనస్పర్థలు రావటంతో విడిపోయారు. శివకు దూరమైన సుమశ్రీ కుమార్తెతో కలిసి దుర్గాపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. శివకుమార్‌కు మొదటి భార్య, కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఈయన బెంగళూరులో ఉంటున్నాడు.
కబ్జా కథ ఇదీ..
ఆర్థికంగా ఆసరా లేని సుమశ్రీ కుమార్తె సాయిశ్రీ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. దుర్గాపురంలో ఇప్పుడుంటున్న ఇల్లు సుమశ్రీ పేరుతోనే ఉంది. మాదంశెట్టి శివ గార్డియన్‌గా ఉన్నాడు. బిడ్డను హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించేందుకు తల్లి లక్షల్లో ఖర్చు చేసి ఇక డబ్బు లేక శివను వేడుకున్నా ఆయన ముందుకు రాలేదని, ఇటీవల తన ఇంటిని కబ్జా చేశారంటూ సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించింది. భర్తే ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరులతో కలిసి తమను బయటకు పంపేందుకే కబ్జా చేయించాడని ఆరోపించింది.
పోలీసులపై ఆరోపణలు తగదు
ఇంటిని ఆక్రమించుకున్నారని తమవద్దకు రాగానే ఆక్రమణదారులను బయటకు పంపేసి బిడ్డతో కలిసి ఆమె తన ఇంట్లోకి ధైర్యంగా వెళ్లేలా చర్యలు తీసుకున్నామని, తద్వారా న్యాయం చేశామని సౌత్‌జోన్ ఏసిపి కె శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఆమెకు, భర్తకు మధ్య ఇంటికి సంబంధించి వైరుధ్యాలు ఉంటే వారే చూసుకోవాల్సి ఉందన్నారు. పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదని ఖండించారు. ప్రస్తుతం సుమశ్రీ తన ఇంట్లోనే ఉంటోందని, ఇది పోలీసులు కాక మరెవరు చేశారని ప్రశ్నించారు.
నాకు సంబంధం లేదు:ఉమా
సుమశ్రీ బిడ్డను కోల్పోయిన బాధలో మాట్లాడుతోందని, అసలు ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆమె, భర్త మాదంశెట్టి శివ ఎవరో కూడా తనకు తెలీదని, అసలు వారు తన నియోజకవర్గంలోని వారు కాదని, శివ బెంగళూరులో ఉంటాడని ఆమె చెబుతోంది కదా! అన్నారు. రాజకీయంగా తనపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ప్రతిపక్ష పార్టీలు సుమశ్రీని వాడుకుంటున్నారని ఆరోపించారు.
కన్నీరు పెట్టించిన ‘సెల్ఫీ’
ఇదిలావుండగా క్యాన్సర్‌తో బాధపడుతూ కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన సాయిశ్రీ తాను చనిపోతానని తెలుసుకుంది. అందుకే తనను బతికించాలంటూ తండ్రి మాదంశెట్టి శివను వేడుకుంది. ‘నాన్నా.. నన్ను బతికించవా.. నేను నీ కూతుర్ని కదా.. అమ్మ దగ్గర డబ్బు లేదు. నాకు బతకాలని ఉంది. ఒకపని చేయి, డబ్బు ఇవ్వద్దు. నువ్వే ఆస్పత్రిలో చేర్చించి వైద్యం చేయించు. నేను చనిపోతే కనుక నువ్వే బాధ్యుడివి. ప్లీజ్ నాన్నా.. నా పరిస్థితి చూడు. కాళ్లు, చేతులు వాపులు వచ్చాయి’.. అంటూ చిన్నారి ప్రాధేయపడుతున్న తీరు చూపరులకు కన్నీరు పెట్టించింది. స్వయంగా ‘సెల్ఫీ’ వీడియో తీసుకున్న సాయిశ్రీ దాన్ని తండ్రి శివకుమార్‌కు పంపింది.